TRS Leader Tamminani Krishnaiah Killed In Khammam After Flag Hoisting: ఖమ్మం జిల్లా తెల్దార పల్లిలో టీఆర్ఎస్ నాయకుడు తమ్మినేని తమ్మినేని కృష్ణయ్యను కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. పొన్నెకల్లు రైతు వేదిక వద్ద జెండా ఎగురవేసిన తర్వాత కృష్ణయ్య బైక్‌పై వెళ్లగా.. ఆయన్ను వెంబడించి దుండగులు హతమార్చారు. ఈ ఎటాక్‌లో కృష్ణయ్య స్పాట్‌లోనే చనిపోయారు. పక్కా ప్లాన్ ప్రకారమే దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య హత్య జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. కృష్ణయ్య ఒంటిపై 12 కత్తిపోట్లు ఉన్నట్లు సమాచారం. మొత్తం ఐదుగురు చుట్టుముట్టి, కృష్ణయ్యను హత్య చేసినట్టు సమాచారం.
డ్రైవర్ ముతేష్ బైక్ నడుపుతుండగా.. అతని వెనుక కృష్ణయ్య కూర్చున్నారు. దుండగులు వారి ద్విచక్ర వాహనాన్ని అడ్డగించి.. ముతేష్‌ను బెదిరించి అక్కడి నుంచి పంపించేశారు. ఆ తర్వాత కత్తులతో కృష్ణయ్యపై ఏకధాటిగా దాడి చేశారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోదరుడు తమ్మినేని కోటేశ్వరరావు ఈ హత్య చేయించాడని అనుమానిస్తూ.. ఆయన ఇంటిపై కృష్ణయ్య అనుచరులతో పాటు స్థానిక గ్రామస్తులు దాడికి దిగారు. దీంతో.. కోటేశ్వరావు ఇంటి వద్ద భారీగా పోలీసుల్ని మోహరించారు. అటు.. పోస్టుమార్టం నిమిత్తం కృష్ణయ్య మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసుపత్రికి చేరుకొని, ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన తుమ్మల నాగేశ్వరరావు.. కాలం చెల్లిన కొంతమంది అరాచకులు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇటువంటి సంఘటనలతో అభివృద్ధి ఆగిపోతుందని.. వ్యక్తిగత ఎదుగుదల చూడలేక, ఇలాంటి పిరికి చర్యలు చేస్తున్నారని విమర్శించారు. ఎంతటి వారినైనా ఉపేక్షించేదే లేదని.. నిందితుల్ని, ఈ కుట్ర వెనుక ఉన్న వారిని శిక్షించి తీరుతామని చెప్పారు. గ్రామంలో ప్రశాంత వాతావరణానికి అభిమానులు సహకరించాలని కోరారు.