టీఆర్ఎస్ కు దూరం అయిన మాజీ మంత్రి ఈటల ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ కావటంతో తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. హుజురాబాద్ లో ఉపఎన్నిక తప్పదనే చర్చ మొదలైంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టిన గులాబీ పార్టీ.. పూర్తి పట్టు కోసం వేగంగా పావులు కదుపుతోంది. ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థే గెలిచేలా ఇప్పటికే నేతలు బాధ్యతలు తీసుకోని గ్రౌండ్ లెవల్ లో తమ పనిని మొదలుపెట్టేశారు. ఈటెల బీజేపీలోకి వెళ్లడం ఖాయం అవ్వడంతో అధికార పార్టీ నేతలు విమర్శల జోరు పెంచారు. ఈటలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. పల్లా కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు డీకే అరుణ.. కేసీఆర్ మెప్పు కోసం పనిచేసే టీఆర్ఎస్ నేతలకు ఆత్మే లేదని గౌరవం ఎక్కడనుంచి వస్తుందని ఎద్దేవా చేశారు. మొత్తానికి హుజురాబాద్ నియోజకవర్గంలో మళ్ళీ టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని గట్టి వ్యూహమే రచిస్తోంది. అందుకనుగుణంగా ఎప్పటికప్పుడు హైకమాండ్ ఆదేశాలను క్షేత్రస్థాయిలో నేతలు అమలు చేస్తున్నారు.