సోనియాగాంధీ ఆదేశాలతో సత్యగ్రహ దీక్ష జరుగుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి వెల్లడించారు. అగ్నిపథ్‌పై పార్లమెంట్‌లో చర్చించకుండా యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆమె మండిపడ్డారు. మోదీ తీసుకొచ్చిన ప్రతి పథకం తన స్నేహితులు అదానీ, అంబానీల కోసమేనని ఆరోపణలు చేశారు. శ్రీలంకలో కూడా మోదీ అదానీకి సహకరించేలా ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.
మాకు అగ్నిపథ్ వద్దని విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారని ఆమె తెలిపారు. అగ్నిపథ్‌తో రక్షణ శాఖలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానాన్ని తీసుకొచ్చి.. దేశ భద్రతను ఫణంగా పెడుతున్నారని మండిపడ్డారు. పింఛన్లు ఇవ్వాల్సి వస్తుందని.. 4 సంవత్సరాల వరకే విధుల్లోకి తీసుకోవడం అన్యాయమన్నారు. అగ్నివీరులు 4 సంవత్సరాల తర్వాత రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
పోలీసులు కాల్చి చంపితే.. ఆ శవానికి వాళ్ళ జెండా వేసే అర్హత ఎక్కడిదని ఆమె ప్రశ్నించారు. ఈ అల్లర్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వైఫల్యం చెందిందన్నారు. ఇది అగ్నిపథ్ కాదు అగ్నిపరీక్ష అంటూ అభివర్ణించారు. సాగు చట్టాలను విరమించికున్నట్లుగా అగ్నిపథ్‌నూ కూడా వెనక్కి తీసుకోవాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు.
