TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!

  • కేరళలో యూడీఎఫ్ ఘన విజయం.. కాంగ్రెస్ హర్షం
  • తెలంగాణ మోడల్ పాలన ప్రభావం: మహేష్ గౌడ్
  • కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం
  • విజయ్‌కు అభినందనలు.. ఇండియా కూటమి సమీక్ష త్వరలో
Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

TPCC Mahesh Goud : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) భారీ విజయం సాధించడం పట్ల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం కేరళ రాజకీయాల్లో ఒక చరిత్రాత్మక ఘట్టమని ఆయన కొనియాడారు. కేరళలో కాంగ్రెస్ కూటమి గెలుపు వెనుక తెలంగాణ కాంగ్రెస్ నేతల కృషి ఎంతో ఉందని మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, కీలక నేతలు కేరళలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారని గుర్తు చేశారు. తెలంగాణలో అమలవుతున్న ప్రజా పాలనను చూసి ఓట్లు వేయాలని తాము కోరామని, ఆ ప్రభావం కేరళ ఓటర్లపై స్పష్టంగా కనిపించిందని ఆయన విశ్లేషించారు.

కేరళలో వచ్చిన ఈ ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త నమ్మకాన్ని నింపాయని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ విజయం తమ పార్టీకి మరింత బలాన్ని ఇచ్చిందని, రాబోయే రోజుల్లో తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్న ధీమా పెరిగిందని వెల్లడించారు. పొరుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పుంజుకోవడం పార్టీ భవిష్యత్తుకు శుభసూచకమని ఆయన పేర్కొన్నారు.

ఇదే క్రమంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుని సంచలనం సృష్టించిన టీవీకే (TVK) అధినేత విజయ్‌కు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇక తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ‘ఇండియా’ (INDIA) కూటమి త్వరలోనే సమీక్ష నిర్వహించబోతోందని ఆయన చెప్పారు. ఈ ఫలితాలను విశ్లేషించుకుని, కూటమిని దేశవ్యాప్తంగా మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.