టీఆర్‌ఎస్‌లో గెలిచిన స్థానిక సంస్థల ప్రతినిధులకు గౌరవం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సమస్యల పరిష్కారం కూడా లేదన్నారు. టీఆర్‌ఎస్ నేతలు అక్రమంగా సంపాదించిన ధనంతో బలప్రదర్శన చేస్తున్నారని.. సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన నిధులపై చర్చ లేదని ఆయన మండిపడ్డారు. పీఎం, సీఎంలు చిల్లర చర్చలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో చనిపోతున్న రైతులు, నిరుద్యోగం, సామూహిక హత్యాచారాల ప్రస్తావన లేదు.. ఒకరి తప్పులు ఒకరు చూపించుకోకుండా లోపాయకారి ఒప్పందంతో మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. స్థానికంగా ఉండే చిన్న చిన్న సమస్యలను కూడా టీఆర్ఎస్ పార్టీ తీర్చడం లేదన్నారు. స్థానికంగా అభివృద్ధి పనుల కోసం లీడర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. బడంగ్‌పేట్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో ఢిల్లీలో రేవంత్ మాట్లాడారు.
Badangpet Mayor: టీఆర్ఎస్‌కు షాక్.. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లోకి బడంగ్‌పేట్ మేయర్
ఇంతకాలం టీఆర్ఎస్‌తో కలిసి పని చేసినా ప్రజా సమస్యలు తీర్చడం లేదు.. అందులో భాగంగానే టిఆర్ఎస్ పార్టీని చాలామంది వీడుతున్నారని ఆయన అన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్‌పోర్టు, ఐటీ రంగం కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి చెందాయన్నారు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేస్తామని చెప్పారని.. కానీ చిన్న వర్షం వస్తేనే మనిషి లోతు నీళ్లు రోడ్లపై నిలుస్తున్నాయని రేవంత్ ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం లేకనే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది జాయిన్ అవుతున్నారని.. మహేశ్వరం డివిజన్‌కు సంబంధించిన కార్పొరేటర్లు, మేయర్ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో పార్టీలో చేరారన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని రాహుల్ గాంధీ వారికి సూచించారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల నడ్డి విడుస్తోందని.. డీజిల్, గ్యాస్ ధరలు రెట్టింపు స్థాయిలో పెరిగాయని ఆయన వెల్లడించారు. దేశంలో మత సామరస్యం దెబ్బ తిందన్నారు. తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని… రాష్ట్రం మొత్తం దివాలా తీసిందని రేవంత్ అన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణను కాపాడేందుకు మేమంతా కలిసి పని చేస్తామన్నారు.
Uttamkumar reddy: హైదరాబాద్ సభలో మోడీ ప్రసంగం అట్టర్ ప్లాప్
అన్యాయంగా అక్రమంగా సంపాదించిన సొమ్ముతో బల ప్రదర్శన చూపించారని.. రాష్ట్రంలో ఉన్న సమస్యలను పక్కదారి పట్టించిందికే ఇలాంటి ప్రదర్శనలు చేపట్టారని ఆయన ఆరోపించారు. బీజేపీ సభ సందర్భంగా ఒక వారం రోజులపాటు టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు చిల్లర వ్యాఖ్యలు చేసుకున్నారని రేవంత్ అన్నారు. చివరికి ఫ్లెక్సీలో విషయంలో కూడా తిట్టుకున్నారని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించిందన్నారు. రాష్ట్రంలో విభజన హామీలు చాలా పెండింగ్లో ఉన్నాయని.. వాటిని పట్టించుకోలేదన్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఇవా చాలా పెండింగ్ సమస్యలు ఉన్నాయన్నారు. హైదరాబాదులో ఉన్న అనేక సమస్యలపై మోడీ ఎందుకు మాట్లాడలేదని రేవంత్ ప్రశ్నించారు. రెండు పార్టీలు కలిసి నాటకాలు ఆడుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు ఒప్పందం ప్రకారమే కేంద్ర చేస్తున్న తప్పులను టిఆర్ఎస్ పార్టీ ఎత్తి చూపడం లేదని ఆరోపించారు. మోడీ కూడా సభ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీపై ఎలాంటి విమర్శలు చేయలేదన్నారు.