NTV Telugu Site icon

Revanth: వరంగల్ బయలుదేరిన రేవంత్.. అరెస్ట్ చేసిన పోలీసులు

Revanth

Revanth

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన రాకేష్ కుంటుంబాన్ని పరామర్శించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బయలుదేరారు. కాగా ఘట్‌కేసర్‌లో రేవంత్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. టీపీసీసీ చీఫ్ సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రేవంత్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న వాహనాన్ని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారో చెప్పాలని రేవంత్ నిలదీశారు. అరెస్ట్‌ గురించి రాతపూర్వకంగా పత్రం ఇస్తేనే పోలీస్‌స్టేషన్‌కు వస్తానంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఆర్‌ఎస్ చంపిందని.. బీజేపీ చంపించిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వరంగల్‌కు వెళ్తే వచ్చే ఇబ్బంది ఏంటంటూ ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ మంత్రులు శవయాత్ర చేయొచ్చు కానీ.. తాము వెళ్లడానికి కూడా ఇన్ని ఇబ్బందులు ఎందుకు అంటూ మండిపడ్డారు. టీఆర్ఎస్ చావులను కూడా రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందంటూ విమర్శలు గుప్పించారు. ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయలేరంటూ ప్రభుత్వంపై ఆగ్రహించారు. త్వరలో సిరిసిల్లలో నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటిస్తామని రేవంత్ పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్లే యువకులు బలవుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అన్నివిధాలా ఆలోచించి, చర్చించి తీసుకురావాల్సిన అగ్నిపథ్‌ సర్వీసును కేంద్రం హడావుడిగా తీసుకొచ్చిందన్నారు. సైనికులను నాలుగేళ్ల ప్రాతిపదికన నియమించడం దారుణమన్న రేవంత్‌రెడ్డి.. కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు అగ్నిపథ్ ఆందోళనలో మృతి చెందిన రాకేష్ అంతిమయాత్ర ఉద్రిక్తంగా మారింది. వరంగల్‌లో అంతిమయాత్ర జరుగుతున్న సమయంలో పోచం మైదాన్‌ కూడలిలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంపై ఆందోళనకారులు దాడి చేశారు. నల్లజెండాలతో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం బోర్డుకి నిప్పు పెట్టారు. పోచం మైదాన్‌ కూడలి మీదుగా రాకేష్ అంతిమ యాత్ర సాగింది.

Show comments