Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

టీ20 వరల్డ్‌కప్ 2026కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. టీం నుంచి ప్యాట్ కమిన్స్ ఔట్!

ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తుది 15 మంది జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే ప్రొవిజనల్ స్క్వాడ్‌ను ప్రకటించిన ఆస్ట్రేలియా తాజాగా తుది జట్టును వెల్లడించింది. ఈ జట్టులో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా వరల్డ్‌కప్‌కు దూరమయ్యాడు. వెన్నెముక గాయంతో బాధపడుతున్న కమిన్స్ స్థానంలో బెన్ డ్వార్షుయిస్‌ను ప్లేయింగ్ ఎలెవన్ లోకి తీసుకున్నారు.

ఈ మూడు ప్రకటనలు చేస్తే చాలు.. రాకెట్‌ కంటే స్పీడ్‌గా దూసుకెళ్లనున్న స్టాక్ మార్కెట్..!

దేశ రాబోయే కేంద్ర బడ్జెట్ 2026పై స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొమ్మిదవ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం మూడు కీలక ప్రకటనలు చేస్తే, స్టాక్ మార్కెట్ రాకెట్ లా దూసుకుపోతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ డిమాండ్లకు జెరోధా సీఈవో నితిన్ కామత్ కూడా మద్దతు తెలపడం విశేషం.

వైసీపీ నేత హరిప్రసాద్‌ రెడ్డిపై దాడి.. ఒక మహిళతో కారులో వెళ్తుండగా..!

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డిపై దాడి ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. తిరుపతి సమీపంలోని ఉప్పరపల్లి ప్రాంతంలో ఓ మహిళతో కలిసి కారులో వెళ్తుండగా, ఆమె భర్త అడ్డుకుని హరిప్రసాద్ రెడ్డిపై దాడి చేసినట్లు సమాచారం. స్థానికుల కథనం ప్రకారం, హరిప్రసాద్ రెడ్డితో పాటు కారులో ఉన్న మహిళపైనా దాడి జరిగింది. అనంతరం ఇద్దరినీ కారులో నుంచి బయటకు లాగి కొట్టినట్లు తెలుస్తోంది. ఈ దాడికి కారణం మహిళతో హరిప్రసాద్ రెడ్డికి అక్రమ సంబంధం ఉందనే అనుమానమేనని ప్రచారం జరుగుతోంది.

అజిత్ పవార్ మరణానికి “టేబుల్‌టాప్ రన్‌వే” కారణమా..?

ఎన్సీపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఘోర విమాన ప్రమాదంలో మరణించారు. స్థానిక ఎన్నికల ప్రచారం కోసం ముంబై నుంచి బారామతికి ఆయన ప్రయాణించిన విమానం, ల్యాండింగ్‌కు కొన్ని క్షణాల ముందు కుప్పకూలింది. రన్ వే పక్కనే క్రాష్ కావడం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే, ఈ ప్రమాదంపై పౌర విమానయాన శాఖ దర్యాప్తు చేస్తోంది. అయితే, ఈ ప్రమాదానికి బారామతిలో ఉన్న ‘‘టేబుల్ టాప్ రన్‌వే’’నే కారణమా.? అనే అనుమాలు వ్యక్తమవుతున్నాయి. ఈ టేబుల్ టాప్ రన్‌వేలు కలిగిన విమానాశ్రయాల్లోనే అత్యధిక ప్రమాదాలు జరిగాయి. ముఖ్యంగా ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో ఈ ప్రమాదాలు చోటు చేసుకోవడం గమనార్హం. సాధారణంగా చుట్టుపక్కల ప్రాంతాల కన్నా ఎక్కువ ఎత్తులో ఉండే రన్ వేలను ఈ పేరుతో వ్యవహరిస్తుంటారు. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, పర్వతాల ప్రాంతాల్లో ఉండే విమానాశ్రయాలు టేబుల్ టాప్ రన్ వేలను కలిగి ఉంటాయి. ఈ రన్ వేలు చిన్నగా ఉండటంతో పైలెట్లకు టేకాఫ్, ల్యాండిగ్ అనేది ఇబ్బందితో కూడుకున్న విషయం. ఒకవేళ ఎక్కువ రన్ వేని ఉపయోగించుకునే పక్షంలో విమానం క్రాష్ అవుతుంది. మంగళూర్, సిమ్లా, కాలికట్, లెంగ్‌పుయ్(మిజోరాం), పాక్యోంక్(సిక్కిం), బారామతిల్లో టేబుల్‌టాప్ రన్‌వేలు ఉన్నాయి.

మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ సమీక్ష

తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ నేతలతో కలిసి ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. జూమ్ మీటింగ్ లో పిసిసి (PCC) చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , ఇతర కీలక నేతలతో చర్చించారు.  మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా నాయకులకు సీఎం దిశానిర్దేశం చేశారు. పార్టీలోని నాయకులందరూ విభేదాలు పక్కన పెట్టి సమిష్టిగా పనిచేస్తేనే విజయం సాధ్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.

కేజీహెచ్ నిర్లక్ష్యం.. గర్భంలోనే శిశువు మృతి.. చలించిన పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే..?

విశాఖపట్నం కేజీహెచ్ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగా గర్భంలోనే తన శిశువు మృతి చెందిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మహిళ ఫిర్యాదు చేసింది. శుక్రవారం రాత్రి విశాఖ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్‌ను పట్నాల ఉమాదేవి అనే మహిళ కలిసింది… గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో కాన్పు నిమిత్తం కేజీహెచ్ లో చేరగా.. వైద్యులు, సిబ్బంది తన పట్ల, తన కుటుంబ సభ్యుల పట్ల నిర్లక్ష్యంగా ఎంతో అమానవీయంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేసింది. కాన్పుకి ఇచ్చిన గడువు పూర్తయ్యిందని తెలిపినప్పటికీ సాధారణ కాన్పు పేరిట నరకం చూపించారని, తన పరిస్థితి అందోళనకంగా ఉందని కుటుంబ సభ్యులు పదేపదే చెప్పినా వినిపించుకోలేదని పవన్‌కు తెలిపింది.

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద టెన్షన్‌ టెన్షన్‌..

గుంటూరు జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఆయన అనుచరులు భారీ సంఖ్యలో ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన తెలుగుదేశం పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నాయకులు ఆరోపించారు. టీడీపీ ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేయవచ్చన్న వార్తలు వ్యాపించడంతో అప్రమత్తమైన అంబటి అనుచరులు ఇంటివద్దకు చేరుకుని మద్దతుగా నిలిచారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతను పెంచింది.

అక్రమ సంబంధం.. మామపై పెట్రోల్ పోసి నిప్పటించిన కోడలి ప్రియుడు..

తమిళనాడు కడలూరు జిల్లాలో జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక వృద్ధుడిని నడిరోడ్డపై పెట్రోల్ పోసి తగలబెట్టడం, అతను సాయం కోసం రోడ్డుపై పరిగెత్తుకుంటూ వేడుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది. జిల్లాలోని పణ్రుట్టి సమీపంలోని మాలిగంపట్టు గ్రామానికి చెందిన రాజేంద్రన్(70) అనే జీడిపప్పు రైతును ఆమె కోడలు, ప్రియుడు కలిసి కుట్ర చేసి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ కేసులో నలుగుర్ని పోలీసులు అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో రాజేంద్రన్ తన గ్రామానికి చెందిన కందన్‌తో కలిసి బైక్‌పై మాలిగం పట్టు రోడ్డులో వెళ్తుండగా, అకస్మాత్తుగా కారుతో వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతడిపై పెట్రోల్ పోసి నిప్పటించారు. మంటలతోనే రాజేంద్రన్ కేకలు వేస్తూ, సాయం కోరాడు. చివరకు అతడికి అంటుకున్న మంటల్ని స్థానికులు ఆర్పివేసి, స్థానిక ఆస్పత్రికి తరలించారు. 70 శాతం కాలిన గాయాలతో ఆయన కడలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో మణికందన్(39), కుపేంద్రన్(29), పార్థిబన్(28)లను అరెస్ట్ చేశారు.

బలూచిస్తాన్‌లో విరుచుకుపడిన BLA.. 10 మంది పాక్ అధికారులు మృతి..

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) భారీ ఎత్తున దాడులు చేసింది. 12 ప్రాంతాల్లో సమన్వయ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 10 మంది పాకిస్తాన్ భద్రతా అధికారులు మరణించగా, 37 బీఎల్ఏ యోధులు మరణించినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో కాల్పులతో పాటు ఆత్మాహుతి బాంబు దాడులు జరిగినట్లు తెలుస్తోంది. క్వెట్టా, పస్ని, మస్తుంగ్, నోష్కి, గ్వాదర్ జిల్లాల్లో ఈ దాడులు జరిగినట్లు పాక్ సీనియర్ భద్రతా అధికారి వెల్లడించారు. అయితే, ఇప్పటివరకు ఈ దాడుల్లో ఎంత మంది సాధారణ ప్రజలు మరణించారనే వివరాలు వెలువడలేదు. భద్రతా సిబ్బంది వేగంగా స్పందించడంతో దాడుల తీవ్రతను తగ్గించినట్లు అధికారులు చెప్పారు.పాకిస్తాన్ భద్రతా దళాలలోని కొంతమంది సభ్యులను అపహరించినట్లు సమాచారం. ఇంటర్నెట్, రైలు సేవలు నిలిపివేశారు. అయితే భద్రతా ఆపరేషన్ జరుగుతోంది.

మ్యాట్రిమోనీలో పెళ్లి డ్రామా.. ఒంటరి మహిళలే టార్గెట్.. చిక్కిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్!

అందమైన సూటు బూటు, మెడలో బంగారు వస్తువులు, లగ్జరీ కార్లతో తెలుగు మ్యాట్రిమోనీ, సాదీ డాట్ కం. వెబ్ సైట్ లతో ఒంటరి మహిళలను పెళ్లి పేరుతో మోసం చేస్తున్న ఘరానా మోసగాడి గుట్టురట్టయింది. రాజమండ్రి త్రీటౌన్ పోలీసులు వల పర్ని ఘరానా మోసగాడిని పట్టుకున్నారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న చిత్తూరుకు చెందిన నిందితుడు పోలీసులకు చిక్కి కటకటాలు పాలయ్యాడు. పైన ఫోటోలో సూటు బూటుతో బంగార ఆభరణాలతో కనిపిస్తున్న చిత్తూరుకు చెందిన చల్లా నారాయణ అలియాస్ కృష్ణ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. సాది డాట్ కం, తెలుగు మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో తన ఫోటోలను, సెల్ నెంబర్, పోస్టు చేస్తాడు. పెళ్లి కోసం వచ్చే ఫోన్లను సంప్రదించి మహిళలను తెలివిగా బురిడీ కొట్టిస్తూ బంగారు వస్తువులను కొట్టేస్తున్నాడు. ఒంటరి మహిళలు, పెళ్లి కానీ అమ్మాయిలే ఈతగాడి టార్గెట్. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి మీకు దోషం ఉంది ఒంటిపై బంగారు వస్తువులను ధరించి రాజమండ్రి గోదావరి గట్టుకు రమ్మని చెప్తాడు.

 

Exit mobile version