Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

కోనేరు హంపి ఓటమి.. ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌గా దివ్య దేశ్‌ముఖ్‌!

2025 ఫిడే ప్రపంచ మహిళల చెస్‌ ఛాంపియన్‌గా నాగపుర్‌కు చెందిన 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్‌ నిలిచారు. సోమవారం జార్జియాలోని బటుమిలో జరిగిన టైబ్రేక్ రెండవ ర్యాపిడ్ గేమ్‌లో తెలుగు తేజం కోనేరు హంపీని ఓడించి (2.5-1.5) టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఫైనల్స్‌లో తొలి ర్యాపిడ్‌ టై బ్రేకర్‌ డ్రాగా ముగియగా.. రెండో గేమ్‌లో మొత్తం 75 ఎత్తుల్లో దివ్య విజయం సాధించారు. మహిళల చెస్‌ ప్రపంచకప్‌ టైటిల్‌ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా దివ్య చరిత్ర సృష్టించారు. ఈ విజయంతో దివ్య గ్రాండ్‌ మాస్టర్‌ హోదాను అందుకొన్నారు. అంతేకాదు క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌కు అర్హత కూడా సాధించారు.

యెమెన్ చేరుకున్న నిమిషా ప్రియ కుటుంబ సభ్యులు.. విడిచిపెట్టాలని కుమార్తె వేడుకోలు

కేరళ నర్సు నిమిషా ప్రియ కుటుంబ సభ్యులు యెమెన్ దేశానికి చేరుకున్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ ఆధ్వర్యంలో యెమెన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా నిమిషా ప్రియ కుమార్తె మిషెల్(13) ప్రభుత్వాన్ని దయ కోరింది. తన తల్లిని విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేసింది. ‘‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను మిస్ అవుతున్నాను.’’ అంటూ మిషెల్ తన తల్లి గురించి చెప్పడం వీడియోలో కనిపించింది. దయతో తన తల్లిని కరుణించి విడిచి పెట్టాలని యెమెన్ అధికారులను మిషెల్ వేడుకుంది. కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిషా ప్రియ.. 2017, జూలైలో యెమెన్ జాతీయుడు తలాల్ అబ్దో మెహదీని హత్య చేసిన కేసులో అరెస్టు అయింది. మరొక నర్సు సహాయంతో మత్తు మందు ఇచ్చి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరూ కలిసి అతని శరీరాన్ని ముక్కలు చేసి, అవశేషాలను భూగర్భ ట్యాంక్‌లో పడవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే నిమిషా ఈ ఆరోపణలను కోర్టులో సవాలు చేసింది. కానీ కోర్టులు ఆమె అప్పీళ్లను తోసిపుచ్చాయి. చివరికి ఈ కేసులో ఆమెను దోషిగా తేల్చింది. అనంతరం న్యాయస్థానం ఆమెకు ఉరిశిక్ష విధించింది. అయితే భారతప్రభుత్వం జరిపిన దౌత్యం ఫలించింది. చివరి నిమిషంలో నిమిషా ప్రియకు ఉరిశిక్ష తప్పింది. ప్రస్తుతం ఆమెను క్షేమంగా భారత్‌కు తీసుకొచ్చేందుకు కేఏ.పాల్ ప్రయత్నిస్తున్నారు. అక్కడి ప్రభుత్వంతో మంతనాలు జరుపుతున్నారు.

మళ్లీ వార్నింగ్‌లు.. బెదిరింపులు ఆపకపోతే ఖమేనీ అంతు చూస్తామన్న ఇజ్రాయెల్

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మరోసారి మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా ఇరాన్‌ను మరోసారి ఇజ్రాయెల్ తీవ్రంగా హెచ్చరించింది. యూదు రాజ్యాన్ని ఇరాన్ బెదిరించడం కొనసాగిస్తే.. మళ్లీ టెహ్రాన్‌పై దాడి చేయడమే కాకుండా ఖమేనీని కూడా లక్ష్యంగా చేసుకుంటామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ హెచ్చరించారు. ఆదివారం ఇజ్రాయెల్ వైమానిక దళానికి చెందిన రామన్ వైమానిక స్థావరాన్ని కాట్జ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సమక్షంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది. ‘‘నేను నియంత ఖమేనీకి స్పష్టమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఇజ్రాయెల్‌ను బెదిరించడం కొనసాగిస్తే.. మా చేయి మళ్లీ టెహ్రాన్‌కు చేరుకుంటుంది. మరింత ఎక్కువ శక్తితో.. ఈసారి మీకు వ్యక్తిగతంగా నష్టం జరగొచ్చు.’’ అని కాట్జ్ వ్యాఖ్యానించారు.

ఉచిత బస్సు ప్రయాణం ఆగష్టు15 నుంచే.. ఆటో డ్రైవర్‌కు 10 వేలు!

మహిళల ఆర్టీసీ బస్సు ప్రయాణంకు ఆగష్టు 15న శ్రీకరం చుట్టబోతున్నాం అని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. త్వరలో ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని పోర్టు త్వరలోనే పూర్తి కాబోతుందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన కారణంగా ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఏపీకి రాబోతున్నాయని చెప్పారు. ఉత్తరాంధ్రలో విశాఖపట్నంను ఫైనాన్షియల్ హబ్‌గా చేయడానికి కార్యాచరణ చేస్తున్నాం అని, 20 లక్షల ఉద్యోగాల్లో భాగంగా ప్రణాళికలు తయారు చేస్తున్నాం అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. నేడు శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి పర్యటించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే, కీలక నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

ప్రేమన్నాడు.. పెళ్లన్నాడు.. కోరిక తీరాక..

తాండూర్ మండలం బెల్కటూర్ గ్రామానికి చెందిన అక్షిత, తన మాజీ ప్రియుడు సురేష్ మోసపూరిత చర్యల కారణంగా పోలీసులను ఆశ్రయించింది. ప్రేమ పేరుతో మోసపోయిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బెల్కటూర్ గ్రామానికి చెందిన అక్షిత, అదే గ్రామానికి చెందిన సురేష్ మధ్య కొంతకాలంగా ప్రేమ కొనసాగింది. అయితే, వీరి ప్రేమకు పెద్దలు అడ్డుకట్ట వేశారు. చివరికి అక్షిత తల్లిదండ్రులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తితో ఆమె వివాహం జరిపించారు. వివాహం తర్వాత కూడా సురేష్ అక్షితను వదలకుండా తరచూ వేధించాడు. ఈ విషయం గుర్తించిన భర్త, అక్షితను పుట్టింటికి పంపించాడు. ఈ సమయంలో సురేష్, పెళ్లి చేసుకుంటానని నమ్మించి అక్షితను శారీరకంగా లోబర్చుకున్నాడు. పెళ్లి విషయం ప్రస్తావించగానే సురేష్ తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో అక్షిత మోసపోయిన విషయాన్ని గ్రహించింది.

గవర్నర్‌తో వైఎస్ జగన్‌ దంపతుల భేటీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి!

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ దంపతులు ఏపీ గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌తో సమావేశం అయ్యారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు రాజ్‌ భవన్‌లో గవర్నర్‌తో దాదాపు గంట పాటు భేటీ అయ్యారు. గవర్నర్‌తో భేటీ అనంతరం జగన్ దంపతులు తిరిగి తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు. మర్యాదపూర్వకంగానే గవర్నర్‌ను జగన్ దంపతులు కలిశారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇటీవలే అనారోగ్య సమస్యల నుంచి కోలుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరోగ్య పరిస్థితిపై జగన్ దంపతులు వాకబు చేశారట.

ఉగ్రవాదుల్ని సైన్యం ఎలా మట్టుబెట్టింది.. మహదేవ్ ఆపరేషన్ సీక్రెట్ ఇదే!

ఆ ముగ్గురు కరుడుగట్టిన ఉగ్రవాదులు. 26 మందిని చంపిన నరహంతకులు. యుద్ధంలో ఆరితేరిన వారు. అధునాతన ఆయుధాలు ప్రయోగించడంలో నైపుణ్యం కలిగిన వారు. అలాంటి ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం మామూలు విషయం కాదు. ఎంతో ప్రణాళిక ఉండాలి. ఎన్నో జాగ్రత్తలు ఉండాలి. అలాంటి ఆపరేషనే మహదేవ్ ఆపరేషన్. భారత సైన్యం ఎలా చేపట్టింది. ఉగ్రవాదుల్ని ఎలా మట్టుబెట్టింది. తెలియాలంటే ఈ వార్త చదవండి. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పర్యాటకులను మతం పేరుతో 26 మందిని ముష్కరులు చంపేశారు. ఆనాటి నుంచి ఉగ్రవాదుల కోసం సైన్యం వేటాడుతోంది. ఇంకోవైపు దర్యాప్తు సంస్థలు కూడా నిఘా పెట్టాయి. ఉగ్రవాదులు మాత్రం భారత్‌లోనే ఉన్నట్లుగా ఒక క్లారిటీకి వచ్చారు. అంతేకాకుండా స్థానికుల సహాయంతో అన్ని వసతులు పొందుతున్నట్లుగా కనిపెట్టారు. దీంతో నిఘా సంస్థలు పక్కా ప్రణాళికతో కనిపెడుతున్నాయి. ఉగ్రవాదులకు సౌకర్యాలు కల్పిస్తున్న ఇద్దరు స్థానికుల్ని పట్టుకున్నారు. అన్ని విషయాలు ఆరా తీశారు.

వైఎస్ జగన్ ఎవరిని టచ్ చేయకూడదో.. వాళ్లనే టచ్ చేశారు!

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. అధికార దుర్వినియోగం చేసి జగన్ అతని గొయ్యి అతనే తవ్వుకున్నారన్నారు. ఎవరిని టచ్ చేయకూడదో జగన్ వాళ్లనే టచ్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత ఎంపీ రఘురామకృష్ణరాజును క్రూరంగా హింసించారని మంత్రి విమర్శించారు. ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఉప్పుటేరు వంతెన వద్ద హోంమంత్రి అనితకు ఏపీ ఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, కనుమూరి భారత్ ఘన స్వాగతం పలికారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో హోం మంత్రి అనిత పాల్గొన్నారు.

ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. వైఎస్ జగన్ ఇలాఖాలో ఆగస్టు 12న పోలింగ్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఉప ఎన్నికల నిర్వహణకు ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 3 ఎంపీటీసీలు, 2 జడ్పీటీసీలు, 2 పంచాయితీలకు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జూలై 30 నుంచి ఆగస్టు 1 వరకూ నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. ఆగష్టు 5న మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. ఆగస్టు 10న, ఆగస్టు 12న పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేశారు.

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం మణీంద్రం, పల్నాడు జిల్లా కారెంపూడి మండలం వేపకంపల్లి, నెల్లూరు జిల్లా విడవలూరు మండలం విడవలూరు – 1 ఎంపీటీసీ స్ధానాలకు.. కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్ధానాలకు.. ప్రకాశం జిల్లా కొండపి గ్రామపంచాయతి సర్పంచ్, వార్డుమెంబర్‌లకు, తూర్పుగోదావరి జిల్లా కడియపులంక గ్రామపంచాయతి సర్పంచ్‌లకు ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇలాఖాలో ఆగస్టు 12న పోలింగ్ జరగనుంది. ఆరోజు పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉపఎన్నిక జరగనుంది.

తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిల నియామకం

తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు కోలీజియం ఇటీవల చేసిన సిఫారసులను ఆమోదిస్తూ, నలుగురు కొత్త జడ్జిల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో హైకోర్టులో న్యాయ వ్యవస్థ మరింత బలపడనుందని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నియామకాలతో గాడి ప్రవీణ్‌కుమార్‌, చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గౌస్‌ మీరా మొహుద్దీన్‌ తదితరులు త్వరలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణం చేయనున్నారు. సుప్రీంకోర్టు కోలీజియం సిఫారసుల ఆధారంగా న్యాయవాదుల అనుభవం, నిబద్ధత, న్యాయపరమైన ప్రతిభను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఈ ఎంపికలు జరిగాయి.

 

Exit mobile version