Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

అలర్ట్.. తెలంగాణలోని ఆ జిల్లాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ..

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణలోని పలు జిల్లాలకు ప్రత్యేక వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. రేపు ఉదయం వరకు తెలంగాణలోని పలు జిల్లాలకు అత్యంత భారీ హెచ్చరికలు జారీ అయ్యాయి.. ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచనలు ఉన్నట్లు తెలిపింది.. ఆయా జిల్లాల్లో 20cm వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ మెహబూబాబాద్, వరంగల్ హనుమకొండ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

“కుటుంబ సభ్యుల ఫోన్లే ట్యాప్ చేశారు..” ఫోన్ ట్యాపింగ్‌పై సీఎం సంచలన వ్యాఖ్యలు..

ఫోన్ ట్యాపింగ్ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ కూడా విన్నారని అంటున్నారు.. సొంత కుటుంబ సభ్యుల ఫోన్‌ లే ట్యాపింగ్ చేసి వినాల్సిన పరిస్థితి వస్తే సూసైడ్ చేసుకోవడం ఉత్తమమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ కాదు.. కానీ లీగల్‌గా పర్మిషన్ తీసుకుని చేయాల్సి ఉంటుందన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఫోన్ టాప్ అవుతుందని మొదట ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని.. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరుగుతుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కోసం సిట్ ఏర్పాటు చేశామని.. చిట్ అధికారులను తాను డిక్టేట్ చేయనన్నారు.

‘‘మామ కౌగిలించుకున్నాడు’’.. వేధింపులతో కోడలు ఆత్మహత్య..

తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలో 32 ఏళ్ల మహిళ, మామ లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. అత్తమామల నుంచి గత కొన్ని ఏళ్లుగా వరకట్న వేధింపులకు కారణంగా తనవు చాలించేందుకు ఒంటికి నిప్పంటించుకుంది. బాధితురాలిని రంజితగా గుర్తించారు. 70 శాతం కాలిన గాయాలతో రంజిత, మధురైలోని రాజాజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. రంజిత తన మరణ వాంగ్మూలంలో మామపై సంచలన ఆరోపణలు చేసింది. ‘‘ మా మామగారు నన్ను కౌగిలించుకున్నారు. నేను దానిని తట్టుకోలేకపోయాను. అందుకు ఆత్మాహుతి చేసుకున్నాను’’ అని చెప్పింది. మామ అనుచిత ప్రవర్తనే కాకుండా, భర్త, అత్తమామాల నుంచి వరకట్న వేధింపులు కూడా రంజిత మరణానికి కారణమని ఆమె కుటుంబం ఆరోపించింది.

షాకింగ్‌ కౌంటర్‌.. పవన్ సర్వాంతర్యామి..! అవి కూపస్థ మండూకాలు..!!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఏ ప్రాంతానికి వెళ్లినా.. అక్కడి ప్రజలు, ఆ ప్రాంతంతో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకుంటారు.. నేను ఈ ప్రాంతంలో పెరిగాను.. ఈ ప్రాంతంలో తిరిగాను.. ఇక్కడ వీళ్లతో నాకు పరిచయం ఉంది.. అక్కడ వారితో అనుబంధం ఉంది.. ఇలా చెప్పుకొస్తారు.. అయితే, దీనిపై రాజకీయ విమర్శలు లేకపోలేదు.. పవన్‌ ఎక్కడికి వెళ్లినా.. నేను ఇక్కడే పెరిగాను.. ఇక్కడే తిరిగేవాడిని అని చెబుతారంటూ పలు సందర్భాల్లో వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు.. అయితే, వారికి దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చారు పవన్‌ కల్యాణ్‌.. విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌ వేదికగా జరిగిన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న పవన్‌ కల్యాణ్.. ఇందులో తన మొదటి గురువు సత్యానంద్‌ను స్టేజిమీద ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు స్టేజిమీద పాదాభివందనం చేశారు.

మత ప్రాతిపదికన రిజర్వేషన్లపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ ప్రభుత్వం పంపిన రిజర్వేషన్ల బిల్ ఆమోదించకుండా ఆలస్యం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. విద్య ఉపాధి అంశాలతో పాటు, స్థానిక సంస్థల రిజర్వేషన్ల రెండు బిల్లులను ఆమోదించడం లేదన్నారు. నేడు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు లేవని.. మతాలు ప్రాతిపదిక కాదన్నారు. వెనుకబాటు తనమే తమ ప్రాతిపదిక అని స్పష్టం చేశారు. రేపు ఉదయం మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను కలుస్తామని తెలిపారు.. సర్వే వివరాలు వివరిస్తామని స్పష్టం చేశారు. తమ తరఫున పార్లమెంట్ లో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరతమన్నారు. రేపు సర్వే కోసం జరిగిన ప్రక్రియ పై కాంగ్రెస్ ఎంపీలకు వివరిస్తామని వెల్లడించారు. జనగణనలో కుల గణన చేర్చాలని.. జనగణనలో కులగణన ఎలా చేయొచ్చు.. దేశానికి తెలంగాణ మోడల్ గా నిలిచిందో వివరిస్తామన్నారు. తాము చేసిన సర్వే దేశానికి రోల్ మోడల్ అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి తమ కార్యాచరణ సిద్ధం చేశామని వెల్లడించారు. కేంద్రం రిజర్వేషన్లను ఆమోదించాలని.. అందుకే కేంద్రం పై ఒత్తిడి తేవాలన్నారు. అవసరం అయితే కూటమి నేతలను కూడా కలుస్తామని చెప్పారు.

బెంగళూర్ బస్టాండ్‌లో పేలుడు పదార్థాలు..జెలటిన్ స్టిక్స్, డిటోనేటర్స్ స్వాధీనం..

బెంగళూర్ లోని కలాసిపాల్య బస్టాండ్‌లో పేలుడు పదర్థాలు పట్టుబడటం భయాందోళనలకు గురిచేసింది. స్థానిక పోలీసులు, ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) బస్టాండ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బస్టాండ్‌లో సమీపంలోని ప్లాస్టిక్ కవర్‌లో దాచిన ఆరు జెలిటిన్ స్టిక్స్ దొరికాయి. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పట్టుబడటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ సంఘటనను ధృవీకరిస్తూ, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (వెస్ట్) మాట్లాడుతూ, “కలాసిపాల్య BMTC బస్ స్టాండ్ లోపల టాయిలెట్ వెలుపల ఉంచిన క్యారీ బ్యాగ్ నుండి ఆరు జెలటిన్ స్టిక్స్, కొన్ని డిటోనేటర్లు విడివిడిగా దొరికాయి. FIR ఇంకా నమోదు కాలేదు.” అని చెప్పారు. టాయిలెట్ దగ్గర పనిచేసే సిబ్బంది మాట్లాడుతూ.. వాష్ రూం వాడిన తర్వాత కొందరు బ్యాగులు మరిచి వెళ్తుంటారు. అలాంటి వారు తిరిగి వచ్చి వారి బ్యాగులను తీసుకుంటారు. అయితే, ఈ బ్యాగు గురించి ఎవరూ రాలేదు. మేము ఈ విషయాన్ని గార్డుకు తెలియజేశాం.

అమరావతి రైతులకు గుడ్‌న్యూస్‌..

రాజధాని ప్రాంతం అమరావతి రైతులకు తీపికబురు చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. రైతులకు సంబంధించిన 11వ ఏడాది కౌలు సొమ్మును విడుదల చేసింది సర్కార్‌.. 163.67 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసింది.. 18,726 మంది రైతులకు కౌలు జమైనట్లు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) వెల్లడించింది.. అయితే, 88 మంది రైతులకు సాంకేతిక కారణాలతో వారి ఖాతాల్లో సొమ్ము జమ కాలేదని.. కౌలు జమకాని రైతులు.. మరోసారి బ్యాంకు వివరాలు అందజేయాలన్న అధికారులు సూచించారు..

దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలి.. సీఎం రేవంత్‌ డిమాండ్..

జగదీప్‌ ధన్కడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవి కోసం త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఈ అంశంపై తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగదీప్ ధన్కడ్ రాజీనామా బాధాకరమన్నారు. ఉపరాష్ట్రపతి పదవి తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఉన్న వెంకయ్య నాయుడును వెనక్కి పంపించారన్నారు. ఎన్డీయే తెలంగాణలో ఉన్న బీసీలకు అన్యాయం చేసిందని.. ఎన్డీఏ దత్తాత్రేయ, బండి సంజయ్ ల గొంతు కోసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి పదవి దత్తాత్రేయకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు ఆత్మ గౌరవం నిలబెట్టాలన్నారు. 2029 లో పార్లమెంట్ ఎన్నికలకు ఓబీసీ ఇరిర్వేషన్లు లిట్మస్ టెస్ట్ అవుతాయి. ఓబీసీలకు న్యాయం చెయ్యడానికి బీజేపీ సర్కార్ సిద్ధంగా లేదు. ఏ బిల్లు పంపినా క్లారిఫికేషన్ అడుగుతారు.. రిజర్వేషన్ల బిల్ పై క్లారిటీ అడిగారు. వాళ్ళు అడిగిన దానికి క్లారిటీ ఇచ్చామని సీఎం తెలిపారు.

దారుణం.. ప్రియుడు మోసం చేశాడని పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య..

వికారాబాద్ జిల్లా దోమ మండలం పీర్లగుట్ట తాండాలో విషాదం నెలకొంది. తనను ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించాడని మనస్తాపానికి గురైన నేనావత్ లక్ష్మి (19) అనే యువతి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కుల్కచర్ల మండలం గోన్యా నాయక్ తండాకు చెందిన రాహుల్ తనను పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడని… ఇప్పుడు పెళ్ళికి నిరాకరిస్తున్నాడని ఆరోపిస్తూ.. తన ఆత్మహత్యకు రాహుల్ కారణమంటూ లక్ష్మి వాంగ్మూలంలో తెలిపింది. అంతేకాకుండా తన వద్దనున్న మూడు తులాల బంగారం, రూ. 20 వేల నగదు తీసుకుని ముఖం చాటేశాడని పేర్కొంది. పెళ్ళి విషయం అడగగా కుల గోత్రాలు కలవవని పెళ్ళి కుదరదని చెప్పాడని యువతి తెలిపింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి స్వగ్రామానికి తరలించారు. రాహుల్‌ ఇంటికి చేరుకుని విచారణ చేపట్టనున్నారు.

పాలనలో ఏఐ వినియోగంతో ప్రజలకు మెరుగైన సేవలు

రోజువారి ప్రభుత్వ పరిపాలనలో ఏఐ వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు మంత్రి నారా లోకేష్‌.. విజయవాడ నోవాటెల్ హోటల్ లో ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ – ఆంధ్రప్రదేశ్ సదస్సులో సీఎం నారా చంద్రబాబు నాయుడతో కలిసి పాల్గొన్న విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. ఏఐ అండ్‌ డేటా సెంటర్లపై జరిగిన చర్చలో మాట్లాడుతూ.. డేటా విప్లవం ద్వారా అంతర్జాతీయంగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందువరుసలో నిలుస్తోందన్నారు.

Exit mobile version