Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

అక్రమ బంగ్లాదేశీలపై త్రిపుర ఉక్కుపాదం, టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు..

అక్రమంగా తమ రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తున్న బంగ్లాదేశీయులపై పలు ఈశాన్య రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా, అస్సాం, త్రిపురతో పాటు చాలా ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశీ చొరబాటుదారులతో విసిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాలు వీరిని బహిష్కరించేందుకు చర్యల్ని ప్రారంభించాయి. ఇప్పటికే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, అక్రమ బంగ్లాదేశీయులను గుర్తించి, వారు ఆక్రమించిన స్థలాలను విముక్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా త్రిపుర రాష్ట్రం కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారుల్ని గుర్తించి, వారిని బహిష్కరించేందుకు పశ్చిమ త్రిపుర జిల్లా ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్‌తో త్రిపుర 856 కి.మీ సరిహద్దును పంచుకుంటోంది. సరిహద్దు జిల్లాల్లో ఈ చొరబాట్లు ఎక్కువగా ఉన్నాయి. పశ్చిమ తి్రిపు జిల్లాలోని మొత్తం 15 పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ అధికారులు ఈ టాస్క్‌ఫోర్స్‌లో ఉంటారు. ఈ టాస్క్ ఫోర్స్‌కు జిల్లా ఇంటెలిజెన్స్ డీఎస్పీ దేబాసిష్ సాభా నేతృత్వం వహిస్తారు.

క్లైమాక్స్‌కి చేరిన లిక్కర్ స్కాం కేసు.. విచారణలో కీలక విషయాలు..

లిక్కర్ స్కాం క్లైమాక్స్‌కి చేరింది. నాలుగు నెలలుగా లిక్కర్ స్కాంపై సిట్ విచారణ చేస్తోంది. విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. ఏప్రిల్ నుంచి కేసులో నిందితుల అరెస్ట్ మొదలు పెట్టింది. మొదటి కేసులో మిథున్ రెడ్డి కీలకమని సిట్ చెబుతోంది. ఒక సారి నోటీస్ ఇచ్చి మిథున్ రెడ్డిని విచారించింది. కేసులో టెక్నికల్ ఆధారాలను మిథున్ రెడ్డి ముందు ఉంచింది. ఇప్పటికే మిథున్ రెడ్డికి చెందిన సంస్థలకు లిక్కర్ ముడుపులు వెళ్లినట్టు గుర్తించింది. ఆ వివరాలను మిథున్ రెడ్డి ముందు పెట్టి విచారిస్తోంది. గతంలో డిస్టలరీస్, ఇతర సాక్షులు ఇచ్చిన స్టేట్ మెంట్లతో పాటు విచారణలో సేకరించిన ఆధారాలతో సహా విచారణ కొనసాగుతోంది. 4 గంటలుగా మిథున్ రెడ్డి విచారణ కొనసాగుతోంది.

 ఓరుగల్లు 40 ఏళ్ల కల సాకారమైంది..

కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమిచ్చే ప్రాజెక్టులను ప్రకటించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వరంగల్, ఖాజీపేట అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “40 ఏళ్ల ఓరుగల్లు వాసుల కలను సాకారం చేశాం. వ్యాగన్ తయారీ, కోచ్‌ల తయారీ, ఓవర్ హాలింగ్ కోసం మూడు యూనిట్లు మంజూరు చేశాం. దీని ద్వారా 3వేల మందికి నేరుగా ఉపాధి కలుగుతుంది. ఓరుగల్లు అభివృద్ధి కోసం కేంద్రం ఎన్నో నిధులు కేటాయించింది. మోడీ గ్యారంటీ అంటే తప్పకుండా నెరవేరుతుంది” అని అన్నారు.

మెదక్ టీచర్ ఆత్మహత్య.. సెల్ఫీ వీడియోలో మిత్రద్రోహంపై ఆవేదన

మెదక్ జిల్లాలో చోటుచేసుకున్న విషాదకర ఘటన స్థానికులను కలచివేసింది. మేడ్చల్‌లోని ఓ లాడ్జ్‌లో మెదక్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరేసుకునే ముందు తాను ఎదుర్కొంటున్న మానసిక వేదనను వీడియో రూపంలో రికార్డు చేసి తన ఆఖరి మాటలు చెప్పాడు. హావేలిఘనపూర్ మండలంలోని సర్దన జిల్లా పరిషత్ హైస్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న రమేష్ (45) గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి భారీ నష్టాలను ఎదుర్కొన్నాడు. అప్పుల భారంతో ఇల్లు, బంగారం, కొంత ఆస్తి విక్రయించి కొంతమేర అప్పులు తీర్చినట్లు తన వీడియోలో తెలిపాడు. అయితే డబ్బులు తీసుకున్న కొందరు మిత్రులే మిత్రద్రోహం చేస్తున్నారని, తనపై ఒత్తిడి పెడుతున్నారని వాపోయాడు.

మాజీ మంత్రి రోజాపై టీడీపీ ఎమ్మెల్యే అసభ్యకర వ్యాఖ్యలు.. మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్..

మాజీ మంత్రి రోజాపై టీడీపీ ఎమ్మెల్యే భాను ప్రకాష్ వ్యాఖ్యలపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు.. రోజాకు సంఘీభావం తెలుపుతూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఎమ్మెల్యే భానుప్రకాష్ ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.. మాజీ మంత్రి ఆర్‌కె రోజా సెల్వమణిపై టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమని.. తెలుగుదేశం పార్టీలో దారుణంగా మారిన దుష్ట సంస్కృతికి ఆ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతూ గట్టిగా మాట్లాడుతున్నందుకు, వాటిని ప్రశ్నిస్తున్నందుకూ ఓర్చుకోలేక, నా సోదరి రెండుసార్లు ఎమ్మెల్యేగానూ, మంత్రిగానూ పని చేసిన ఆర్‌కె రోజాను అత్యంత అసభ్యకరమైన పదజాలంతో దూషించారని మండిపడ్డారు.

సీఆర్‌పీఎఫ్ జవాన్‌ను చితకబాదిన కన్వారియాలు..

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ రైల్వే స్టేషన్‌లో రైలు టిక్కెట్లు కొనడంపై జరిగిన వాగ్వాదంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్‌పై కన్వారియాలు(శివభక్తులు) దాడికి పాల్పడ్డారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. దాడికి పాల్పడిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీలో ఈ దాడికి సంబంధించిన వీడియోలు రికార్డయ్యాయి. కాషాయ దుస్తులు ధరించిన కొందరు కన్వారియాలు మీర్జాపూర్ స్టేషన్‌లో బ్రహ్మపుత్ర రైలును ఎక్కే ముందు సీఆర్‌పీఎఫ్ జవాన్‌ను కొట్టడం కనిపిస్తోంది. ఈ సంఘటనపై రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ సంఘటనా స్థలానికి చేరుకుని ఏడుగురు కన్వారియాలను అరెస్ట్ చేసింది.

పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్త ఎత్తిన సీఎం చంద్రబాబు..

నేడు సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా కపిలేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. పారిశుద్ధ్య కార్మికుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులు ధరించే సూట్‌ని ధరించారు. తిరుపతిలో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి ఒక్కో నెల ఒక్కో కార్యక్రమాన్ని చేపట్టినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రం బాగుండాలంటే అందరూ స్వచ్ఛత పాటించాలని పిలుపునిచ్చారు.ఏపీ స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారాలంటే స్వచ్ఛాంధ్రప్రదేశ్‌గా మార్చాలని అన్నారు. జాతీయ స్థాయిలో ఏపీకి 5 స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు రావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. తాను తిరుపతిలో చదువుకుంటూనే ఎమ్మెల్యేగా ఎదిగానని, అంచెలంచెలుగా ఎదిగి నాలుగోసారి సీఎం అయ్యానని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

మోడీజీ, 5 యుద్ధ విమానాల గురించి నిజం చెప్పండి..

మే నెలలో జరిగిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ సమయంలో భారత్, పాకిస్తాన్ వివాదంలో మొత్తం 5 యుద్ధ విమానాలు కూలినట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఇప్పటికే రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తాను నివారించినట్లు ట్రంప్ చెప్పుకుంటున్నారు. పలు సందర్భాల్లో ఈ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. అయినప్పటికీ, ట్రంప్ వినిడం లేదు. ఇదిలా ఉంటే, తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు దేశంలో రాజకీయ వివాదానికి కారణమయ్యాయి.

కులగణనపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన స్వతంత్ర కమిటీ

రాష్ట్రంలో చేప‌ట్టిన కుల‌గ‌ణ‌నను అధ్య‌య‌నం చేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించిన స్వ‌తంత్ర‌ నిపుణుల క‌మిటీ ప్రభుత్వానికి తమ నివేదికను సమర్పించింది. ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి అధ్వర్యంలోని నిపుణులు సమావేశమయ్యారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు సిఎం ముఖ్య కార్యదర్శి వి. శేషాద్రి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సాంఘీక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఈ.శ్రీధర్, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ. శరత్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఏపీ లిక్కర్‌ స్కామ్ కేసులో ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌..

లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఏ4గా ఉన్నారు. గతంలో ఒకసారి సిట్ విచారణకు హాజరయ్యారు. తాజాగా మరోసారి సిట్ విచారణకు హాజరు కాగా.. ఆయన్ని అరెస్ట్ చేశారు. రేపు కోర్టులో మిథున్ రెడ్డిని సిట్ హాజరుపర్చనుంది. అరెస్ట్‌పై ఎంపీ కుంటుంబానికి సిట్ సమాచారం అందించింది. మరోవైపు.. కేసు ఛార్జిషీటులో ఎంపీ మిథున్ రెడ్డి పేరును చేర్చడంతో ఆయన ఏపీ హైకోర్టులో ముందుస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా.. విచారణ చేపట్టి ధర్మాసనం.. కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు వ్యక్తిని అరెస్ట్ చేయకుండా కేసులో ఛార్జ్‌షీట్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

 

Exit mobile version