జనాభా లెక్కలు కులాల వారీగా కేంద్రం చెప్పటం లేదు
రేపు మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ ఎస్టీ విభాగం కార్యవర్గ సమావేశం ఉందని తెలిపారు ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ బెల్లయ్య నాయక్. అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్టీ విభాగం చేసిన పనితీరు.. పార్లమెంట్ ఎన్నికలకు అదేవిధంగా పనిచేయాలి దిశ నిర్దేశం చేయడమే అజెండా అని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ రెండో విడత భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్నారని, జనాభా లెక్కలు కులాల వారీగా కేంద్రం చెప్పటం లేదని బెల్లయ్య నాయక్ మండిపడ్డారు. ఆ లక్ష్యం తోనే రాహుల్ యాత్ర చేస్తున్నారని, రిజర్వేషన్ లు అమలు కావడం లేదన్నారు. అధికారంలోకి వస్తే ఓబీసీ గణన చేస్తామని రాహుల్ చెప్పారని బెల్లయ్య నాయక్ తెలిపారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర లక్ష్యం, ఉద్దేశలు st విభాగం నాయకులకు వివరిస్తామని ఆయన పేర్కొ్న్నారు. లంబాడి, గోండు, ఎరుకల.. గిరిజనులు 80 శాతం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేశారని బెల్లయ్య నాయక్ తెలిపారు. అలాగే రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఉన్న ఆశావహులను వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ నుంచి నరేష్ జాదవ్, సేవాలాల్ రాథోడ్, పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీ, మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్‌లు టికెట్లు ఆశిస్తున్నారు. అదే విధంగా కరీంనగర్ నుంచి ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ లేదా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. నిజామాబాద్ నుంచి మహేశ్‌కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఈరావత్రి అనిల్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు టికెట్లు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కర్, మెదక్ నుంచి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఆయన భార్య నిర్మలా రెడ్డిలను బరిలో దించే అవకాశం ఉంది.
కునో పార్క్‌లో మరో చిరుత చనిపోయింది.. ఇప్పటి వరకు 10 మృతి
మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్కులో మరో చిరుత మరణించింది. 2022 సెప్టెంబర్ నెలలో నమీబియా నుంచి తీసుకువచ్చిన చిరుతల్లో వరసగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. శౌర్య అని పిలువబడే చిరుత మరణించడంతో ఇప్పటి వరకు 7 పెద్ద చిరుతలు, మూడు చిరుత పిల్లలు మరణించాయి. మార్చి 2023లో 3 చిరుత పులి పిల్లలు మరణించాయి.
అయితే, మృతికి కారణాలు పోస్టుమార్టం తర్వాతే నిర్ధారించగటమని ప్రాజెక్ట్ డైరెక్టర్ చెప్పారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు చిరుత నడకలో అస్థిరతను ట్రాకింగ్ ద్వారా గమనించామని, చిరుత బలహీనంగా ఉందని, చిరుతను బతికించేందుకు సీపీఆర్ చేసినా ప్రతిస్పందిచలేదని ఆయన వెల్లడించారు. మొత్తం 20 చిరుతలను నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి కునో నేషనల్ పార్కుకి తీసుకువచ్చారు. ప్రభుత్వం చేపట్టిన ‘‘ప్రాజెక్ట్ చీతా’’ కింద రెండు విడుతలుగా చిరుతలను ఇండియాకు తీసుకువచ్చారు. మొదటి బ్యాచ్ సెప్టెంబర్ 2022లో చేరగా.. రెండో బ్యాచ్ ఫిబ్రవరి 2023లో వచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా దేశంలోని అడవుల్లో చిరుతలను ప్రవేశపెట్టడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. దాదాపుగా 7 దశాబ్ధాల క్రితం దేశంలో చిరుతలు అంతరించిపోయాయి. వీటిని మళ్లీ పెంచాలనే ఉద్దేశంతోనే ప్రాజెక్ట్ చీతాను చేపట్టారు.
నాసిన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ..
శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నాసిన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం జగన్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సీఎం జగన్ తో కలిసి భవనాలను పరిశీలించారు. ఐఆర్ఎస్ కు ఎంపికైన అభ్యర్థులతో ప్రధాని మోదీ ముఖాముఖి నిర్వహించారు. ఐఆర్ఎస్ అభ్యర్థుల శిక్షణ కోసం రూ.1500 కోట్లతో 503 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ భవనాల నిర్మాణం చేపట్టింది. ఇప్పటి వరకు హర్యానాలో మాత్రమే నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ కేంద్రం ఉండేది.
అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. చారిత్రక ప్రదేశంలో నాసిన్ ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. నాసిన్‌ను ప్రారంభించడం ఆనందకరంగా ఉందని తెలిపారు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ట కోసం 11 రోజుల అనుష్టానం చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు.. పుట్టపర్తి సత్యసాయిబాబ జన్మస్థలం.. లేపాక్షిలో వీరభద్ర మందిరం దర్శించుకోవడం ఆనందంగా ఉందని ప్రధాని తెలిపారు. రామరాజ్య భావన నిజమైన భావన అని మహాత్మాగాంధీ చెప్పారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు సేవకులు అని తెలిపారు. గతంలో పన్నుల విధానం అర్థమయ్యేది కాదని.. జీఎస్టీ తీసుకువచ్చి పన్నులను సరళతరం చేశామన్నారు ప్రధాని. ప్రజల నుంచి వచ్చిన పన్నులు వారి సంక్షేమానికే వాడాలని.. ఇదే రామరాజ్య సందేశమని ప్రధాని మోదీ తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్ MLC అభ్యర్థులు వీరే
తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్ పేర్లను అధిష్ఠానం ఫిక్స్ చేసింది. వారిద్దరికీ ఫోన్ చేసి, నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించింది. ఈ నెల 18తో నామినేషన్ల గడువు ముగియనుంది. 29న పోలింగ్ నిర్వహించి, ఫలితాలు వెల్లడిస్తారు. అసెంబ్లీలో సంఖ్యాబలం కారణంగా కాంగ్రెస్ పార్టీకే ఆ సీట్లు దక్కనున్నాయి. అద్దంకి దయాకర్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుంగతుర్తి టికెట్ ఆశించారు. అధినాయకత్వం మందు సామేల్ కు టికెట్ కేటాయించింది. దీంతో ఆయనకు ఎంపీగా అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించారు. ఎన్ ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్న బల్మూరి వెంకట్ కు కూడా మరో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ, నిరుద్యోగ విద్యార్థుల ఆత్మహత్య, టెన్త్ పేపర్ లీకేజీల నేపథ్యంలో విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన ఆయన పోరాటాలు చేశారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు జనవరి 4న నోటిఫికేషన్ జారీ అయింది. రెండు ఉపఎన్నికలు కావటంతో ఎన్నికల
సంఘం వేరువేరుగా నోటిఫికేషన్లను ఇచ్చింది. జనవరి 11 నుంచి ఈనెల 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. జనవరి 29న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు ఫలితాలను ప్రకటించనుంది.
అంబరానంటిన జగ్గన్నతోట ప్రభల తీర్థం..
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని జగ్గన్నతోట ఏకాదశ రుద్రుల ప్రభల తీర్థం అంబరానంటింది. అంబాజీపేట మండలంలోని 11 గ్రామాల నుంచి ఏకాదశ రుద్రుల ప్రభలను ప్రత్యేకంగా అలంకరించి భుజాలపై మోసుకొని ఊరేగింపుగా తీసుకొని వచ్చి జగ్గన్నతోటలో ఆశీనులు చేశారు. పంటపొలాలు, కౌశిక నది మీదుగా జగన్నతోట వచ్చిన దృశ్యాలు గగూర్పాటు కలిగించాయి. ఈ ప్రభలను తిలకించేందుకు జనాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జగ్గన్నతోటలో ఆశీనులైన ఏకాదశ రుద్రులు భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నారు. కాగా, కోనసీమ నడుమ తరతరాల నుండి జరుగుతున్న “జగ్గన్నతోట” ప్రభలతీర్థం వైభవానికి ఎంతో ప్రఖ్యాత ఉంది . మకర సంక్రమణ ఉత్తరాయణ మహాపుణ్యకాలంలో సంక్రాంతి కనుమ నాడు కోనసీమలోని మొసలిపల్లి శివారు జగ్గన్నతోటలో జరిగే ఏకాదశ రుద్రుల సమాగమము అత్యంత ప్రాచీనమైన, చారిత్రాత్మకమైన, అతిపురాతనమైన, పవిత్రమైన సమాగమం. ప్రాచీనకాలంలో మొట్టమొదటిగా ఈ తోటలోనే ఈ పదకొండు గ్రామాల రుద్రులు సమావేశమయ్యారని ప్రతీతి. ఈ తోటలో ఏవిధమైన గుడి గానీ, గోపురం గానీ ఉండవు.. ఇది పూర్తిగా కొబ్బరితోట. ఈ ఏకాదశరుద్రులు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ సమావేశం అవ్వడంతో ఈ తోట విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఏకాదశరుద్రుల కొలువు. హిందూధర్మశాస్త్రాల ప్రకారం.. ఏకాదశరుద్రులు ఒక్కచోటకొలువు తీరేది ప్రపంచం మొత్తం మీదా, ఈ భూమండలం మొత్తానికీ ఒక్కచోటే అదీవేదసీమ అయినటువంటి కోనసీమలోనే.. లోక కల్యాణార్ధం ఈ పదకొండు గ్రామాలశివుళ్లు జగ్గన్నతోటలో సమావేశం అయ్యి లోక విషయాలుచర్చిస్తారని ప్రతీతి. సుమారు 400 సంవత్సరాల క్రితం నుండి ఈ సంప్రదాయం ఉందనీ తీవ్రమైన పరిస్థితులు వచ్చిన 17 వశతాబ్ధంలో ఈ 11 గ్రామాల రుద్రులు ఈ తోటలోనే సమావేశం అయ్యి.. లోక రక్షణగావించారని ప్రతీతి. అప్పటి నుండీ క్రమం తప్పకుండా ప్రతీ సంవత్సరమూ కనుమ రోజు ఎన్ని అవాంతరాలు ఎదురైనా , భూమి తల్లక్రిందులైనా ఈ రుద్రులను ఒక్కచోట చేర్చుతారు ఈ గ్రామస్తులు. సంస్థానదీశులైన శ్రీరాజావత్సవాయి జగన్నాధమహారాజుకు చెందిన ఈతోట జగ్గన్న తోట అనే పేరుతో స్థిరపడింది.
పల్లే కన్నీరు పెడుతుందోయ్ అనే పాట ప్రభుత్వాన్నే మార్చేసింది
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. జిల్లా కేంద్రంలో తాజాగా శుభకార్యాలు జరిగిన పలువురు నాయకుల ఇండ్లకు వెళ్ళి కలిశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సర్పంచ్ లకు ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పదవిలో నుండి పోయేముందు కూడా గౌరవంగా పంపించాలని భావనతో ఆత్మీయ సత్కారం కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. పదవులు వస్తాయి, పోతాయి, అంతేకాని శాశ్వతం కాదు. పదవిలో ఉన్నప్పుడు ఎంత మంచిగా పనిచేశారన్నదే ముఖ్యమన్నారు కేటీఆర్. పదవిలో ఉన్నప్పుడు అన్ని విధాలా మంచిగా పనిచేశారు కాబట్టే, ప్రజలు కెసిఆర్ ముఖ్యమంత్రి కాలేదన్నది జీర్ణించుకోలేక పోతున్నారని, ఓ కవి రాసిన పాట, పల్లే కన్నీరు పెడుతుందోయ్ అనే పాట ప్రభుత్వాన్నే మార్చేసిందన్నారు
రిక్షావాలాగా మారిన బీజేపీ ఎంపీ.. రిక్షా తొక్కిన జీవీఎల్
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖలో సంక్రాంతి సంబరాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కనుమ రోజున విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఓ రిక్షావాలాను కూర్చోబెట్టుకుని జీవీఎల్ రిక్షా తొక్కారు. సంప్రదాయ పంచెకట్టులో నడుముకు కండువా బిగించి రిక్షా తొక్కారు. తర్వాత.. ఆ రిక్షా కార్మికుడికి కొంత డబ్బులు ఇచ్చారు. అయితే.. దీనికి సంబంధించిన వీడియోను జీవీఎల్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో షేర్ చేశారు. విశాఖలో మహా సంక్రాంతి సంబరాలు నేటితో ముగియనున్న నేపథ్యంలో రిక్షా కార్మికుడు పెంటయ్యను అతని రిక్షాలోనే ఎక్కించుకుని తొక్కాను. తన రిక్షా తొక్కే అవకాశం నాకు ఇచ్చినందుకు అతనికి రుసుం చెల్లించాను అని జీవీఎల్ తెలిపారు. ప్రస్తుతం జీవీఎల్ రిక్షా తొక్కిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
దళితబంధు లబ్ధిదారుల నిధుల ఫ్రీజ్‌ను ఎత్తివేయాలి
హనుమకొండ జిల్లా హరితహోటల్ లో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియ శ్రీహరి మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమం జరుగుతుందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పాసయిందని, ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేయబోతోందన్నారు కడియం శ్రీహరి. అంతేకాకుండా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు లో అఫిడవిట్ ఫైల్ చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు పాలించాలి..ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. దళితబంధు లబ్ధిదారుల నిధుల ఫ్రీజ్ ను ఎత్తివే యాలని ఆయన డిమాండ్ చేశారు. దళితబంధును కొనసాగించాల్సిందే… పేరు మార్చి అంబేద్కర్ అభయ హస్తం గా మార్చిన మాకు ఇబ్బంది లేదన్నారు
కడియం శ్రీహరి. దళితబంధు అక్రమాలపై విచారణ జరిపితే మాకు అభ్యంతరం లేదన్నారు. బీజేపీ ఎస్సీ వర్గీకరణ చేస్తుందని మాకు నమ్మకం లేదని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు.
రీజనల్ రింగ్ రోడ్డుపై సీఎం ఆదేశాలు
హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను మూడు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. అడ్డంకులన్నీ అధిగమించి, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు అవతల నిర్మించ తలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ ప్రక్రియ కొంతకాలంగా పెండింగ్ లో పడింది. భారత్ మాల పరియోజన ఫేజ్ వన్ లో రీజనల్ రింగ్ రోడ్డు (ఉత్తరం) రూ.158.645 కిలోమీటర్ల మేరకు తలపెట్టారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణకు తెలంగాణ రాష్ట్రం సగం వాటా నిధులు భరించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 1935.35 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు 1459.28 హెక్టార్ల భూసేకరణ పూర్తయింది. గత ప్రభుత్వం సహాయ నిరాకరణ ధోరణి కారణంగా తొమ్మిది నెలలుగా ఈ ప్రాజెక్టు భూసేకరణలో ఎటువంటి పురోగతి లేదు. నేషనల్ హైవే అథారిటీ (NHAI) తో తలెత్తిన చిక్కుముడులను పరిష్కరించే ప్రయత్నం జరగలేదు. దీంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్డుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
