Site icon NTV Telugu

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

అప్పన్న సన్నిధిలో అపశృతి.. గోడకూలి ఏడుగురు మృతి

సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. క్యూలైన్ లో ఉన్న భక్తులపై గోడ కూలి ఏడుగురు మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారందరినీ పోలీసులు ఆస్పత్రికి తరలిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో భక్తులు నిజరూప దర్శనం కోసం భారీగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఆ సమయంలో భారీ వాన కురిసింది. ఆ ధాటికి గోడ కూలి భక్తులపై పడిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఏడుగురు ప్రాణాలు వదిలారు.

హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం, 14 మంది మృతి

కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం సెంట్రల్ కోల్‌కతాలోని ఒక హోటల్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారని పోలీసులు తెలిపారు. మంటలను అదుపులోకి తెచ్చినట్లు కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ వర్మ విలేకరులకు తెలిపారు. ప్రస్తుతం 14 మృతదేహాలను వెలికితీసినట్లుగా వెల్లడించారు. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని చెప్పారు. ప్రస్తుతం అయితే మంటలు పూర్తిగా అదుపులో ఉన్నట్లుగా పేర్కొన్నారు.

భారత్ యుద్ధానికి సిద్ధమవుతోంది.. ధీటుగా ఎదుర్కొంటామన్న పాక్ మంత్రి

ప్రధాని మోడీ మంగళవారం త్రివిధ దళాలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా ఏం చేయాలన్నదానిపై మేథోమథనం చేశారు. ఈ సందర్భంగా త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తూ భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని ప్రధాని మోడీ మార్గదర్శకం చేశారు. టార్గెట్లు, టైమ్ డిసైడ్ చేయాలని రక్షణ శాఖకు కీలక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఇక మోడీ కీలక భేటీ తర్వాత పాకిస్థాన్ అప్రమత్తం అయినట్లు కనిపిస్తోంది. తమకు అందిన విశ్వసనీయ నిఘా సమాచారం ప్రకారం భారతదేశం 36 గంటల్లో పాకిస్థాన్‌పై సైనిక చర్యకు సిద్ధపడుతున్నట్లుగా తెలిసిందని పాకిస్తాన్ సమాచార మంత్రి అత్తౌల్లా తరార్ విలేకర్ల సమావేశంలో వ్యాఖ్యానించారు. 24-36 గంటల్లో భారత సైన్యం ఏదొకటి చేయొచ్చని పేర్కొన్నారు. ఒకవేళ భారత్ అలాంటి చర్యలకే దిగితే ఎదుర్కోవడానికి పాకిస్థాన్ కూడా సిద్ధంగా ఉందని తెలిపారు.

తెలంగాణలో నేడు పదో తరగతి ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు గుడ్‌న్యూస్. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న TS 10వ తరగతి ఫలితాలు విడుదలకు తేదీ ఖరారైంది. విద్యాశాఖ ప్రకటించిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 30న బుధవారం మధ్యాహ్నం 1 గంటకు పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయ్యింది. తాజా ఫలితాల ప్రకటనతో పాటు, ఈ సంవత్సరం మార్కుల మెమో రూపంలో కొన్ని కీలక మార్పులు చేపట్టారు. గతంలో విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా గ్రేడ్లు, సీజీపీఏలు మాత్రమే ఇచ్చే విధానానికి బదులుగా, ఈసారి రాత పరీక్షలు , ఇంటర్నల్ అసెస్‌మెంట్‌ మార్కులను విడిగా చూపిస్తూ, మొత్తం మార్కులు , గ్రేడ్లను మెమోలో చేర్చనున్నారు. అలాగే, ఉత్తీర్ణత లేదా అప్రమత్తత (పాస్/ఫెయిల్) స్థితిని కూడా స్పష్టంగా పేర్కొననున్నారు.

హిట్ 3 ఓవర్సీస్ సూపర్బ్ స్టార్ట్

యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్: ది ఫస్ట్ కేస్, హిట్ 2 : ది సెకండ్ కేస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు రాబోతున్న హిట్ 3 లో నాచురల్ స్టార్ నాని హీరోగా కన్నడ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. శైలేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మూడో సినిమా కావడం పక్కింటి అబ్బాయిలా ఉండే నానిని మోస్ట్ వైలెంట్ గా చూపించడం వంటి అంశాలు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. నేడు ప్రీమియర్స్ తో విడుదల అవుతున్న హిట్ 3 నార్త్ అమెరికాలో తన వేట మొదలుపెట్టింది. సాధారణంగా నాని సినిమాలకు యూఎస్ మార్కెట్ లో ఎంత స్ట్రాంగ్ గా వసూళ్లు ఉంటాయి. గతంలో నాని నటించిన అనేక సినిమాలు ఆ విషయాన్ని నిరూపించాయి. ఇప్పుడు రాబోతున్న హిట్ 3 అడ్వాన్స్ బుకింగ్స్ లో 400K డాలర్స్ దిశగా దూసుకెళుతోంది. ఇక టికెట్స్ పరంగా చూస్తే 18,000+ కేవలం యుఎస్ ప్రీమియర్స్ రూపంలో రాబట్టింది. అటు UKలోను నాని చెలగాటం అడిస్తున్నాడు. ఇప్పటికే అక్కడ 8500 టికెట్స్ పైగా బుకింగ్స్ తో సాలిడ్ స్టార్ట్ అందుకుంది హిట్ 3. USA లో నాని కెరీర్ లోనే హయ్యెస్ట్ ప్రీమియర్ వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. మరో వైపు నాని కెరీర్ లోనే హిట్ 3 ఓవర్సీస్ లో బిగ్గెస్ట్ రిలీజ్ కాబోతుంది. మరి కొన్ని గంటల్లో ఓవర్సీస్ ప్రీమియర్స్ తో రిలీజ్ అవుతున్న హిట్ 3 సూపర్ హిట్ టాక్ వస్తే భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.

పెళ్లై ఏడాది గడవక ముందే ఘోరం.. అసలు ఏమైందంటే?

ఆకస్మాత్తుగా జరిగే సంఘటనలు జీవితాలను తలకిందులు చేస్తాయి. 9 నెలల క్రితం పెళ్లైన ఓ యువతి లైఫ్ లో అనుకోకుండా జరిగిన సంఘటన జీవితమే లేకుండా చేసింది. పెళ్లై ఏడాది గడవక ముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. బైక్ పై వెళ్తుండగా మెడకు ఉన్న చున్ని వెనక చక్రంలో చిక్కుకోవడంతో యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన అనకాపల్లిలో జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా కేసనకుర్రుకు చెందిన కళ్యాణపు రామదుర్గ (28)కు కోనసీమ జిల్లా పోలవరానికి చెందిన విన్నకోట మోహన్‌కృష్ణతో 9 నెలల క్రితం పెళ్లి జరిగింది. ఇటీవలె మోహన్‌కృష్ణకు అచ్యుతాపురం సెజ్‌లో ఉద్యోగం వచ్చింది. దీంతో ఆ యువతి ఎంతో సంతోషించింది. కానీ ఆ సంతోషం కొన్ని రోజులే అని ఊహించలేకపోయింది. విధి ఆడిన వింత నాటకంలో అసువులు బాసింది.

ఈ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిజరూప దర్శనం కోసం వేచి ఉన్న భక్తులపై అకస్మాత్తుగా గోడ కూలడంతో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన భక్తులను పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటన భక్తజనంలో తీవ్ర ఆవేదనకు కారణమైంది. విషాదకర ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. “ఆంధ్ర ప్రదేశ్ లోని సింహాచలం ఆలయం వద్ద గోడ కూలి భక్తులు మరణించిన ఘటన తీవ్ర ఆవేదనను కలిగించింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.” అని అన్నారు. విశాఖపట్నం జిల్లాలో ఘనంగా జరుగుతున్న చందనోత్సవం సందర్భంగా స్వామివారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు.

పహల్గామ్ ఘటన మనసు కలిచివేసింది.. భారత్ నిందలు వేయడం తగదన్న పాక్ మాజీ ప్రధాని

పహల్గామ్ ఉగ్ర దాడిపై పాకిస్థా్న్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. ప్రాణ నష్టం జరగడం విషాదకరమని తెలిపారు. మృతుల కుటుంబాలకు  ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు చెప్పారు. పాకిస్థాన్ జైల్లో ఉన్న ఇమ్రాన్ ‌ఖాన్ ఈ మేరకు మంగళవారం ఎక్స్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తాజా ఉద్రిక్తల నేపథ్యంలో భారత్ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పుల్వామా దాడి జరిగినప్పుడు కూడా పాకిస్థాన్‌పై భారత్ నిందలు వేసిందని.. ఇప్పుడు కూడా అదే మాదిరిగా మోడీ సర్కార్ నిందలు వేస్తోందని తెలిపారు. తన హయాంలో దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని చెప్పినా భారత్‌కు ముందుకు రాలేదన్నారు. 2019లో జరిగినట్లుగానే.. ఇప్పుడు కూడా అదే జరుగుతోందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ భారత్ దుస్సాహసానికి దిగితే.. అందుకు పాకిస్థాన్ కూడా అణు ఘర్షణతో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. దేశాల మధ్య చెలగాటం ఆడకుండా బాధ్యతాయుతంగా భారత్ వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

క్వికర్ క్విజ్.. నమ్మితే నిండా మునిగినట్టే.. లక్షన్నర కాజేసిన సైబర్ కేటుగాళ్లు..!

సికింద్రాబాద్‌లో ఒక మహిళ తన ఫ్లాట్‌ను అద్దెకు ఇవ్వాలని ఆన్‌లైన్‌లో ప్రకటన ఇచ్చింది. క్వికర్ యాప్‌లో పెట్టిన ఆ ప్రకటనకు ఓ కేటుగాడు కన్నేశాడు. ఫోన్ చేసి తాను ఆర్మీ అధికారిని అని చెప్పి నమ్మబలికాడు. ఫ్లాట్ చాలా బాగుందని, అద్దెకు తీసుకుంటానని చెప్పాడు. అంతేకాదు, ఆర్మీ అకౌంటెంట్ త్వరలోనే మిమ్మల్ని సంప్రదిస్తాడని చెప్పి మరింత నమ్మకం కలిగించాడు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. ఆర్మీ చెల్లింపులు రివర్స్ మోడ్‌లో ఉంటాయని, మొదట మీరు కొంత డబ్బు పంపిస్తే.. తాము చెల్లించాల్సిన అద్దెతో కలిపి మీ ఖాతాలో వేస్తామని మాయమాటలు చెప్పాడు. అమాయకమైన ఆ మహిళ వారి మాటలు నమ్మింది. విడతల వారీగా ఏకంగా లక్షా 31 వేల రూపాయలు వారి ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేసింది.

ఈ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిజరూప దర్శనం కోసం వేచి ఉన్న భక్తులపై అకస్మాత్తుగా గోడ కూలడంతో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన భక్తులను పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటన భక్తజనంలో తీవ్ర ఆవేదనకు కారణమైంది. విషాదకర ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. “ఆంధ్ర ప్రదేశ్ లోని సింహాచలం ఆలయం వద్ద గోడ కూలి భక్తులు మరణించిన ఘటన తీవ్ర ఆవేదనను కలిగించింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.” అని అన్నారు. విశాఖపట్నం జిల్లాలో ఘనంగా జరుగుతున్న చందనోత్సవం సందర్భంగా స్వామివారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు.

 

Exit mobile version