దారుణం.. భార్య, మామ చేతిలో భర్త హత్య..!
వికారాబాద్ జిల్లా తాండూర్ మండలంలోని మల్కాపూర్ గ్రామంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. రెడ్డిపల్లి వెంకటేష్ (34) అనే యువకుడిని అతని భార్య జయశ్రీ, మామ పండరి కలిసి హత్య చేసిన ఘటన సంచలనం రేపుతోంది. పోలీసుల అందించిన వివరాల ప్రకారం… వెంకటేష్ తన భార్య జయశ్రీపై అనుమానంతో తరచూ గొడవపడుతూ.. శారీరకంగా, మానసికంగా వేధించేవాడని సమాచారం. ఇదే కారణంగా భార్య మానసికంగా విసిగిపోయి తన తండ్రి పండరి సహాయంతో ఈ హత్య ప్లాన్ వేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తదుపరి ఉపరాష్ట్రపతిగా పేర్లు పరిశీలన..! ఆ పార్టీ నేతకు ఛాన్స్!
జగదీప్ ధన్‌ఖర్ అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. రెండేళ్ల పదవి ఉండగానే రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో వైదొలగుతున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో ధన్‌ఖర్ పేర్కొన్నారు. అయితే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే రాజీనామా చేయడం విమర్శలకు తావిస్తోంది. మోడీ ప్రభుత్వానికి మేలు చేసేందుకే ధన్‌ఖర్ రాజీనామా చేశారంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి.
జక్కంపూడి రాజా దీక్ష భగ్నం.. 50 మంది హౌస్ అరెస్ట్!
రాజానగరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత జక్కంపూడి రాజా ఆమరణ దీక్షను ముందస్తుగా పోలీసులు భగ్నం చేశారు. నేటి నుండి ఏపీ పేపర్ మిల్లు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఆమరణ నిరాహారదీక్షకు జక్కంపూడి సిద్ధమయ్యారు. పేపరు మిల్లు గేటు ఎదురుగా ఉన్న కళ్యాణంలో దీక్ష చేయడానికి ఏర్పాట్లు చేసుకున్న సమయంలో భారీగా పోలీసులు అక్కడికి వచ్చారు. జక్కంపూడి రాజాను అరెస్టు చేసి ఇంటికి తరలించారు. రాజా ఇంటి వద్ద భారీగా పోలీసులు మొహరించారు. పేపర్ మిల్లుకు 500 మీటర్ల పరిధిలో ఆందోళనలు, నిరసనలు చేపట్టకూడదనే నెపంతో జక్కంపూడి రాజాను పోలీసులు తరలించారు. రాజా అనుచరులు 50 మందిని ప్రివెంటివ్ అరెస్ట్ చేసి రాజమండ్రి త్రీటౌన్ స్టేషన్‌కు తరలించారు. రాజమండ్రిలో సెక్షన్ 30, సెక్షన్ 144 అమలులో ఉన్నందున పేపర్ మిల్లు సమీపంలో ఎటువంటి ఆందోళనలు చేపట్టవద్దని పోలీసులు హెచ్చరించారు. ప్రస్తుతం జక్కంపూడి రాజా ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్‌లో మంగళవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. హైదరాబాద్ సహా మరో 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ తాజా బులెటిన్ ప్రకారం.. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
దళిత యువకుడు హత్య కేసు.. నేటి కోర్టు తీర్పుపై నెలకొన్న ఉత్కంఠ!
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈరోజు తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు నిందితుడిగా ఉన్నారు. అనంత బాబుకు శిక్ష పడనుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకొని, న్యాయపరంగా ముందుకు సాగేందుకు సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావును కూటమి ప్రభుత్వం నియమించింది. ఎమ్మెల్సీ అనంత బాబు తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను కాకినాడలో హత్య చేసి డోర్ డెలివరీ చేసిన విషయం తెలిసిందే.
పిచ్చికి పరాకాష్ట.. సోషల్ మీడియా మత్తు..!
సోషల్ మీడియా ఫేమ్ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే పరిస్థితి పెరుగుతోంది. తాజాగా ఇలాంటి సంఘటనపై టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మండిపడ్డారు. వైరల్ వీడియోలో ఒక యువకుడు రైలు పట్టాలపై పడుకొని, తనపై నుంచి రైలు పోతుండగా వీడియో తీయించుకొని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోను షేర్ చేసిన సజ్జనార్, సోషల్ మీడియా మత్తులో పడిన ఇలాంటి యువతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “పిచ్చికి పరాకాష్ట.. అంటే ఇదే! రీల్స్ కోసం ఇప్పటికిప్పుడే ఫేమస్ కావాలని తపనపడుతున్నారు. కానీ ఏ రకం వీడియోలు చేస్తున్నామో, ఎంత ప్రమాదకరమో ఆలోచన లేకుండా వెర్రి పనులకు పాల్పడుతున్నారు. ఒకవేళ ప్రమాదం జరిగితే తల్లిదండ్రులు ఎలాంటి క్షోభను అనుభవిస్తారో అర్థం చేసుకునే సోయి వీరికి లేదు” అని సజ్జనార్ వ్యాఖ్యానించారు.
అంతేకాదు, “సోషల్ మీడియా మత్తులో పడిన ఈ మానసిక రోగులకు కౌన్సిలింగ్ అత్యవసరం. లేదంటే వీడియోలు వైరల్ అవుతున్నాయని మరెన్నో ప్రమాదకర పనులు చేస్తూ ప్రాణాలను పణంగా పెడతారు” అని హెచ్చరించారు.
హర్యానాలో భూకంపం… ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో స్వల్ప ప్రకంపనలు
మంగళవారం (జులై 22) ఉదయం ఢిల్లీ – ఎన్‌సీఆర్ ప్రాంతాన్ని స్వల్పంగా భూకంపం కంపించింది. స్వల్పంగా కంపనలు గుర్తించినప్పటికీ, ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. భారత జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (National Centre for Seismology) విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఉదయం 6 గంటలకు 3.2 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఈ భూకంపానికి హర్యానాలోని ఫరిదాబాద్ ప్రాంతం కేంద్రంగా నమోదైంది.
యువకుడిపై పెద్దపులి దాడి.. గట్టిగా కేకలు వేయడంతో.. !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవి రేంజ్ పరిధిలో చెంచు యువకుడుపై పెద్దపులి దాడి చేసింది. జనాలు కేకలు వేయడంతో పెద్దపులి యువకుడుని వదిలి అడవిలోకి పారిపోయింది. యువకుడిని మెరుగైన వైద్య సేవల కోసం అటవీశాఖ సిబ్బంది ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పెద్దపులి రాకతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని కొత్తపల్లి మండలం సదరం పెంట చెంచు గూడెంకి చెందిన పులిచెర్ల అంకన్న అనే యువకుడు సోమవారం రాత్రి బహిర్బుమికి బయటికి వెళ్లాడు. గూడెం శివారులో పొదల్లో దాక్కొని ఉన్న పెద్దపులి ఒక్కసారిగా అంకన్నపై దాడి చేసింది. వెంటనే ఆ యువకుడు గట్టిగా కేకలు వేయడంతో గూడెం వాసులు పరుగెత్తుకెళ్లారు. గూడెం వాసులు గట్టిగా కేకలు వేసుకుంటూ అంకన్న వద్దకు చేరుకున్నారు. జనాల అరుపులు విన్న పెద్దపులి భయపడిపోయి అంకన్నను వదిలేసి అడవిలోకి పారిపోయింది. పులి దాడిలో యువకుడి కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి.
