Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

2 రోజులు ఢిల్లీలో ఉండలేకపోయా.. కాలుష్యంపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ కాలుష్యంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులు ఢిల్లీలో ఉండలేకపోయాయని.. గొంతు ఇన్ఫెక్షన్‌కు గురైందని తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యంతో బాధపడుతోందని.. దీనికి 40 శాతం తన రంగానికి సంబంధించిన సమస్యేనని అంగీకరిస్తున్నట్లు తెలిపారు. భారతదేశం శిలాజ ఇంధనాలపై ఎక్కువగా ఆధారపడటాన్ని తప్పుపట్టారు. ‘‘శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకోవడానికి భారతదేశం ప్రతి సంవత్సరం దాదాపు రూ. 22 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని.. శిలాజ ఇంధనాల వాడకాన్ని మనం తగ్గించుకోలేమా? ఇది ఎలాంటి దేశభక్తి? శిలాజ ఇంధనాలు కారణంగా కాలుష్యం పెరుగుతోంది. సున్నా కాలుష్యానికి కారణమయ్యే ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్-శక్తితో నడిచే వాహనాలను మనం ఎందుకు ప్రోత్సహించలేము?.’’ అని వ్యాఖ్యానించారు.

గ్లోబల్ టీవీ బంగ్లాదేశ్ చీఫ్‌కు బెదిరింపులు.. ఉద్యోగం నుంచి తప్పుకోకపోతే..!

బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు తగ్గడం లేదు. భారత వ్యతిరేక నాయకుడు ఉస్మాన్ హాదీ హత్య తర్వాత మీడియా సంస్థలు, హిందువులు లక్ష్యంగా దాడులు జరిగాయి. అల్లర్లతో దేశం అట్టుడుకింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే గ్లోబల్ టీవీ బంగ్లాదేశ్ చీఫ్ నజ్నిన్ మున్నీని ఓ గ్యాంగ్ హత్యా బెదిరింపులు చేశారు. వెంటనే ఆమెను తొలగించాలని.. లేదంటే కార్యాలయాన్ని తగలబెడతామని వార్నింగ్ ఇచ్చారు. ఉస్మాన్ హాదీ హత్య తర్వాత డిసెంబర్ 21న కొంత మంది యువకులు ఢాకాలోని గ్లోబల్ టీబీ బంగ్లాదేశ్ కార్యాలయాన్ని సందర్శించి నజ్నిన్ మున్నీ తొలగించాలని డిమాండ్ చేశారు. ఆమె షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ మద్దతుదారుడని యువకులు పేర్కొన్నారు. మున్నీని తొలగించకపోతే ప్రోథోమ్ అలో, ది డైలీ స్టార్‌పై జరిగిన దాడుల మాదిరిగానే ఛానల్ కార్యాలయాన్ని తగలబెడతామని హెచ్చరించినట్లు సమాచారం.

బీజేపీ విధానాలతో వైశ్య వ్యాపారులు దెబ్బతిన్నారు.. పోరాటం చేయాలని రాహుల్‌గాంధీ పిలుపు

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో వైశ్య వర్గాన్ని దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. వైశ్య వర్గానికి చెందిన వ్యాపారులతో రాహుల్‌ గాంధీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వైశ్య వర్గానికి మద్దతుగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ మనస్తత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. వైశ్య వ్యాపారుల సమస్యలపై రాహుల్‌ గాంధీ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘‘మా వ్యాపారం పతనానికి దగ్గరగా ఉంది.. అంటూ వైశ్య సమాజం నుంచి వచ్చిన ఆవేదన నన్ను తీవ్రంగా కలచివేసింది. నేడు ఇలా నిరాశలో కూరుకుపోవడం ఓ హెచ్చరిక లాంటిది. గుత్తాధిపత్య సంస్థలకు స్వేచ్ఛనిచ్చి.. చిన్న, మధ్యతరహా వ్యాపారులపై అధికారం, జీఎస్టీ వంటి విధానాలతో ప్రభుత్వం భారం మోపుతోంది. ఇది కేవలం విధాన వైఫల్యం మాత్రమే కాదు. ఉత్పత్తి, ఉపాధితో పాటు భారత భవిష్యత్తు పైనా ప్రత్యక్ష దాడి’ అంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు.

“రీల్స్” చేస్తుందని అభ్యర్థి తొలగింపు.. “హిందువు” కాబట్టే తొలగించారని ఆరోపణ

పశ్చిమ బెంగాల్‌లో బాబ్రీ మసీదును నిర్మిస్తామని చెబుతూ, శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వార్తల్లో వ్యక్తిగా మారారు. బాబ్రీ వివాదం కారణంగా, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కబీర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వచ్చే ఏడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హుమాయున్ కబీర్ సొంతగా ‘‘జనతా ఉన్నయన్ పార్టీ’’ని స్థాపించాడు. అయితే, ఇప్పుడు ఆయన మరో వివాదంలో ఇరుక్కున్నాడు. ఎన్నికల్లో తన పార్టీ తరుపున తాత్కాలిక అభ్యర్థుల జాబితా నుంచి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ నిషా ఛటర్జీని తొలగించారు. బల్లిగంజ్ నియోజవర్గం నుంచి టీఎంసీ కీలక నేత బాబుల్ సుప్రీయోకు వ్యతిరేకంగా నిషా ఛటర్జీని తన పార్టీ అభ్యర్థిగా ప్రకటించి, కొంత సేపటికే ఈ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గారు.

మెరిట్ లిస్ట్ విడుదల.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.!

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2,322 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీ ప్రక్రియలో మరో కీలక దశ పూర్తయింది. ఈ పోస్టులకు సంబంధించిన ‘ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్’ను తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) రాసిన మొత్తం 40,423 మంది అభ్యర్థుల వివరాలను, వారు సాధించిన మార్కులతో సహా బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు బోర్డు ప్రతి దశలోనూ అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తోంది. సీబీటీ, కాంట్రాక్ట్/అవుట్‌సోర్సింగ్ సర్వీసు వెయిటేజీ మార్కులపై ఆగస్టులోనే ఒక దఫా అభ్యంతరాలను స్వీకరించి, అభ్యర్థుల సందేహాలను బోర్డు నివృత్తి చేసింది. తాజాగా విడుదల చేసిన ప్రొవిజనల్ మెరిట్ జాబితాపైనా అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే తెలిపేందుకు మరోసారి అవకాశం కల్పించింది.

కొత్త సినిమాల టికెట్ల రేట్ల పెంపుపై మంత్రి కందుల దర్గేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

కొత్త సినిమా విడుదల అయినప్పుడు అప్పటికప్పుడు టికెట్ ధరలు పెంచకుండా ఒక సమగ్ర విధానం అమలు చేస్తాం అన్నారు మంత్రి కందుల దుర్గేష్.. అటు సినిమా పరిశ్రమకు.. ఇటు సినీ ప్రేక్షకులకు న్యాయం జరిగేలా టికెట్ రేట్లు ఉండేలా చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ రేట్ల కు సంబంధించి ప్రభుత్వం ఇవాళ సమావేశం నిర్వహించింది. సినిమా ప్రముఖులు… ప్రభుత్వ ఉన్నతాధికారులు తో సమావేశం నిర్వహించారు.. ప్రతి సారి కొత్త సినిమా విడుదల అయినప్పుడు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోనున్నారు. సినిమా టికెట్ రేట్లు పెరిగి.. సినిమాకు వెళ్లి పాప్ కార్న్ కనుక్కోవడం కూడా కష్టంగా మారిందన్నారు దర్శకుడు తేజ.

భారత్ బంగ్లాదేశ్‌పై దాడి చేస్తే.. మిసైల్స్‌తో దాడి చేస్తామని పాక్ లీడర్ వార్నింగ్..

భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు క్షీణించాయి. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం, భారత్‌పై విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తోంది. ఇటీవల, రాడికల్ ఇస్లామిస్ట్ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది హత్య తర్వాత, బంగ్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున హింస చెలరేగింది. దైవదూషణ ఆరోపణలతో హిందూ వ్యక్తి దీపు చంద్ర దాస్‌ను అత్యంత క్రూరంగా హత్య చేశారు. ఈ పరిణామాలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌పై భారత్ దాడి చేస్తే సైనిక ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్తాన్ పాలక ముస్లిం లీగ్‌ పార్టీకి చెందిన నాయకుడు కమ్రాన్ సయీద్ ఉస్మానీ ఒక వీడియోలో వార్నింగ్ ఇచ్చాడు. ఢాకాపై న్యూఢిల్లీ ఏదైనా చర్య తీసుకుంటే, పాకిస్తాన్ నుంచి తీవ్ర ప్రతిస్పందన వస్తుందని అన్నారు. బంగ్లాదేశ్ సార్వభౌమత్వంపై భారత్ దాడి చేస్తే, ఎవరైనా బంగ్లాదేశ్‌ వైపు చెడు దృష్టి పెట్టడానికి ధైర్యం చేస్తే, పాకిస్తాన్ ప్రజలు, పాక్ సైన్యం, పాక్ క్షిపణులు చాలా దూరంలో లేవని గుర్తుంచుకోండి అంటూ భారత్‌ను బెదిరించే ప్రయత్నం చేశారు. ఈ ప్రాంతంలో భారత్ చేస్తున్న కుట్రల పట్ల ముస్లిం యువత అప్రమత్తంగా ఉండాలని ఉస్మాని పేర్కొన్నారు. అఖండ భారత్ భావజాలాన్ని బంగ్లాదేశ్‌పై రుద్దే ప్రయత్నాన్ని పాక్ ప్రతిఘటిస్తుందని ఆయన అన్నారు.

హైటెక్ దొంగ బత్తుల ప్రభాకర్ ఆటకట్టు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైటెక్ దొంగ బత్తుల ప్రభాకర్ ఉదంతం మరో మలుపు తిరిగింది. రాజమండ్రి సమీపంలో పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయిన ప్రభాకర్ ఆచూకీని ఎట్టకేలకు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను చెన్నై సమీపంలో ఉన్నట్లు సాంకేతిక ఆధారాల ద్వారా పోలీసులు నిర్ధారించుకున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ‘ప్రిజం’ పబ్బులో కాల్పులు జరిపి హల్చల్ సృష్టించడంతో ప్రభాకర్ పేరు మొదటిసారి వెలుగులోకి వచ్చింది. అప్పటి నుండి అతను పోలీసులకు సవాల్‌గా మారుతూనే ఉన్నాడు. ప్రభాకర్ స్టైల్ చాలా విభిన్నం.

కేవలం ఇళ్లను మాత్రమే కాకుండా, ఏపీ, తెలంగాణలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలను లక్ష్యంగా చేసుకుని భారీ దోపిడీలకు పాల్పడటం ఇతని ప్రత్యేకత. కాలేజీల్లోని ఆఫీస్ లాకర్లను కొల్లగొట్టడంలో ఇతను సిద్ధహస్తుడు. విజయవాడ నుంచి తప్పించుకున్న ప్రభాకర్, పోలీసుల కళ్లు గప్పి చెన్నైకి మకాం మార్చాడు. అక్కడ కూడా తన పంథా మార్చుకోకుండా, తమిళనాడుకు చెందిన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలో భారీ చోరీకి పాల్పడ్డాడు. ఆ కాలేజీ లాకర్ల నుంచి సుమారు 60 లక్షల రూపాయల నగదును దొంగిలించినట్లు సమాచారం.

సైబరాబాద్‌లో వెలుగు చూసిన భారీ చైల్డ్ ట్రాఫికింగ్ దందా

హైదరాబాద్ నగరం నడిబొడ్డున పసికందులను విక్రయిస్తున్న ఒక భారీ మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఈ ముఠా కార్యకలాపాలను గమనించిన పోలీసులు, మెరుపు దాడులు నిర్వహించి ఏకంగా 12 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ ముఠా సభ్యులు కేవలం స్థానికంగానే కాకుండా, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి, ప్రధానంగా అహ్మదాబాద్ వంటి నగరాల నుండి చిన్న పిల్లలను హైదరాబాద్‌కు తరలిస్తూ అక్రమ విక్రయాలకు పాల్పడుతున్నారు. ఒక్కొక్క శిశువును సుమారు 15 లక్షల రూపాయల భారీ ధరకు సంతానం లేని వారికి విక్రయిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సర్పంచ్‌లకు సీఎం రేవంత్ అదిరిపోయే న్యూ ఇయర్‌ గిఫ్ట్..!

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గ్రామ పంచాయతీల అభివృద్ధి విషయంలో అత్యంత కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించారు. నారాయణపేట జిల్లా కోస్గిలో జరిగిన కొడంగల్ నియోజకవర్గ నూతన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, సర్పంచ్‌లకు, గ్రామీణ ప్రజలకు భారీ ఊరటనిచ్చే వరాలను ప్రకటించారు. ఇకపై గ్రామాలకు నిధుల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా మంత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి కార్యాలయం నుండి నేరుగా ప్రత్యేక అభివృద్ధి నిధులు (Special Development Fund) అందుతాయని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రతి చిన్న గ్రామ పంచాయతీకి రూ.5 లక్షలు, ప్రతి పెద్ద గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి సాధారణంగా వచ్చే నిధులకు ఇది అదనమని, దీనివల్ల గ్రామాల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

Exit mobile version