Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

గుడ్‌న్యూస్.. హైదరాబాద్ నుంచి అయోధ్యకు స్పెషల్ ట్రైన్..!

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. జనవరి 22న ఆలయంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరగనుంది. ప్రధాని మోదీ ఆలయ ప్రారంభోత్సవం చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రామమందిర దర్శనానికి వెళ్లే ప్రయాణికుల కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు నడపడానికి రైల్వే శాఖ సిద్ధమైంది. ప్రతి శుక్రవారం ఈ రైలు హైదరాబాద్ నుండి అయోధ్యకు వెళుతుంది.

భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం అనేక సౌకర్యాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. దేశంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ అయిన భారతీయ రైల్వే కూడా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొత్త రైళ్లను నడుపుతోంది. ఎప్పటికప్పుడు కొత్త రైళ్లను అందుబాటులోకి తెస్తున్నారు, కొత్త ట్రాక్‌లు వేస్తున్నారు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లను అందుబాటులోకి తెస్తున్నారు. ఇక ఈ నెల 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఇందుకోసం దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. భవిష్యత్తులోనూ భక్తుల సంఖ్య భారీగా పెరగనుంది. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకోనుంది. అయోధ్య వెళ్లే వారి కోసం ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు.

పశుసంవర్దక శాఖ కార్యాలయంలో ఫైళ్ల మాయంపై కేసు.. ఏసీబీకి బదిలీ

పశుసంవర్థక శాఖ కార్యాలయంలో ముఖ్యమైన ఫైళ్లు మాయమైన ఘటనను రేవంత్ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసుతో పాటు గొర్రెల పంపిణీలో జరిగిన అక్రమాలపైనా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఈ రెండు కేసులను ఏసీబీకి బదిలీ చేస్తూ ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే గొర్రెల పంపిణీ నిధుల బదిలీల్లో ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్లు తేలింది. కాగా.. గచ్చిబౌలిలో అధికారులపై కేసు నమోదైంది. నాంపల్లిలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైళ్లు పోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అనేక ప్రభుత్వ ఫైళ్లను ధ్వంసం చేసి, దగ్ధం చేసిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మసాబ్ ట్యాంక్ పశుసంవర్ధక శాఖలోనూ ఫైళ్లు మాయమైన ఘటన చోటుచేసుకుంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఓఎస్‌డీ కల్యాణ్‌ కార్యాలయ ఫైళ్లు గల్లంతయ్యాయి. కిటికీ గ్రిల్స్ తొలగించిన దుండగులు ఫైళ్లను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఓఎస్డీ కళ్యాణ్, ఆపరేటర్ మోహన్ ఎలిజా, వెంకటేష్, ప్రశాంత్‌లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కొత్త ప్రభుత్వం గొర్రెల యూనిట్ల పంపిణీలో అక్రమాలు జరిగాయని గుర్తించింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ పథకం కింద పెద్ద ఎత్తున నిధులు మళ్లించినట్లు గుర్తించారు. ఈ మేరకు పలువురు అధికారులపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆ కేసులను ఏసీబీకి బదిలీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌.. సుప్రీంకోర్టులో కీలక పరిణామం

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. ఇవాళ సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందా? అంటూ అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా.. 17ఏపై ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.. సెక్షన్‌ 17ఏ వర్తిస్తుందని జస్టిస్‌ అనిరుద్ధ్ బోస్‌ పేర్కొనగా.. అసలు సెక్షన్‌ 17ఏ వర్తించదన్నారు జస్టిస్‌ బేలా.. దీంతో, ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి.. 17ఏపై ఎలాంటి తీర్పు ఇవ్వలేదు ద్విసభ్య ధర్మాసనం.. విస్తృత ధర్మాసనానికి ఈ కేసు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు విజ్ఞప్తి చేసింది ద్విసభ్య ధర్మాసనం.. తగిన నివేదిక కోసం చీఫ్‌ జస్టిస్‌కు నివేదిస్తున్నాం.. 17ఏ అన్వయించడంలో మాకు భిన్నాభిప్రాయాలున్నాయన్నారు జస్టిస్‌ అనిరుద్ధ్‌ బోస్‌.. దీంతో.. చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ బాలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోర్టులో పడినట్టు అయ్యింది. కాగా, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ దాఖలు చేశారు.. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలని కోరారు.. అక్టోబర్ 20న తుది విచారణ జరిపి తీర్పును జనవరి 16వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం కోర్టు.. 17ఏ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా కేసు నమోదు చేయడం కుదరదని పిటిషన్‌లో చంద్రబాబు పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో.. విస్తృత ధర్మాసనానికి ఈ కేసు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు విజ్ఞప్తి చేసింది ద్విసభ్య ధర్మాసనం.. దీంతో, చంద్రబాబు పిటిషన్‌పై సీజేఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు మరింత ఉత్కంఠగా మారింది.

వివాదంలో వైసీపీ ఎమ్మెల్యే..! కళాశాలలో మద్యం, కోళ్లు పంపిణీ..

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వైభవంగా సాగుతోంది.. కనుమ రోజు నాన్‌వెజ్‌ మార్కెట్లకు ఫుల్‌ డిమాండ్‌ పెరిగింది.. చికెన్‌, మటన్‌, ఫిష్‌, నాటుకోళ్లు.. ఇలా వివిధ రకాల నాన్‌వెజ్‌ కొనుగోలు చేస్తున్నారు.. అయితే, ఇదే సమయంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కార్యకర్తలకు ఇచ్చిన కనుమ కానుక వివాదాస్పదంగా మారింది.. కళాశాలలో తమ కార్యకర్తలకు మద్యం, కోళ్లు పంపిణీ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కు చెందిన డిఫెన్స్ అకాడమీ.. కనుమ పండుగ సందర్భంగా ఈ మద్యం, కోళ్ల పంపిణీ చేయడమే దీనికి కారణం అయ్యింది. అయితే, ఈ కళాశాల ను రామబాణం క్యాంపస్ అని కూడా అంటారు. డిఫెన్స్ ఉద్యోగాలకు వెళ్లేందుకు శిక్షణ తీసుకునే విద్యార్థులు కూర్చునే తరగతి గదుల్లో 400 మద్యం బాటిళ్లు, బతికి ఉన్న కోళ్ల పంపిణీ చేస్తున్న వైనంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.. అది కాస్తా వివాదంగా మారింది. ఈ పంపిణీ కోసం ముందు రోజే టోకెన్ లు పంపిణీ చేయడం మరో విశేషం. అసలు 400 మద్యం బాటిళ్లు ఎలా వచ్చాయంటూ ఆరోపణలు వస్తున్నాయి. మద్యం పంపిణీ సమయంలో కళాశాలపై అంతస్తులో ఉన్న కార్యాలయం లోనే ఎమ్మెల్యే గణేష్ ఉన్నారని తెలుస్తోంది. కానీ, లిక్కర్, కోడి పంపిణీకి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారి వివాదం రేగడంపై ఎమ్మెల్యే ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వలేదు.

మరోసారి బెదిరింపు కాల్స్.. ఫోన్‌ నెంబర్లతో సహా బయటపెట్టిన రాజాసింగ్..

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గతంలో కూడా పలు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇప్పుడు మరోసారి కూడా అదే తరహాలో బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ఆయనే స్వయంగా వీడియో బయటపెట్టారు. అంతే కాకుండా.. తనకు వస్తున్న కాల్ లిస్ట్ లను కూడా కలిగి ఉంది. తనకు ఈ నెంబర్లతోనే రోజూ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. శ్రీరామనవమి రోజున శోభయాత్ర తీయడాన్ని బెదిరిస్తున్నట్లు తెలిపారు. శోభయాత్ర తీస్తే కాల్చేస్తామని బెరిస్తున్నట్లు రాజాసింగ్ స్వయంగా ఫోన్ ద్వారా మీడియాకు చూపించారు. తనకు కాల్ చేసి బెదిరిస్తున్న కాలర్ కు తను బెదిరిస్తే బెదిరేరకం కాదని దమ్ముంటే ముందుకు వచ్చి మాట్లాడాలని రాజాసింగ్ అన్నారు. నువ్వు ఒక అమ్మకు పుట్టి వుంటే నా ఎదురుగా వచ్చి మాట్లాడని ధైర్యం చెప్పారు. తనకు రోజూ కాల్స్ చేసి బెదిరించేది కాదు.. గుండె ధైర్యం మనిషివైతే ముందుకు వచ్చి మాట్లాడాలని సూచించింది. నేను రాముడి శోభయాత్ర చేసే తీరుతానని చెప్పారు.

లారీ డ్రైవర్ల సమ్మె విరమించుకోవాలి.. పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి..

లారీ డ్రైవర్ల సమ్మె విరమించుకోవాలని రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. డ్రైవర్ల సమస్య కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిధి అని, సమ్మెతో ప్రజలకు ఇబ్బందులు కలిగించద్దని కోరారు. ఇది సరైంది కాదని కొత్త చట్టం రాష్ట్ర పరిధిలోనిది కాదని, కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని పొన్నం ప్రభాకర్ తెలిపారు. లారీ డ్రైవర్లు సమ్మెపై పునరలోచించాలని విజ్ఞప్తి చేశారు. లారీ డ్రైవర్లు సమ్మె చేయవద్దని… సమ్మె లోకి వెళ్తే సామాన్య ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని వెంటనే సమ్మెపై పునరలోచించాలని కోరారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ఇప్పటికిప్పుడు అమలు చేయడం లేదని ఇది అందరికి కాకుండా ప్రమాదం జరిగిన తరువాత హిట్ అండ్ రన్ కి పాల్పడే వారికి మాత్రమే వర్తిస్తుందని రవాణా శాఖ అధికారులు, లారీ ఓనర్స్ అసోసియేషన్ తో పలు సంఘాలు డ్రైవర్స్ యూనియన్స్ కి అవగహన కల్పిస్తున్నాయి.

రామ మందిర ప్రారంభోత్సవం ‘మోడీ ఫంక్షన్’.. అందుకే మేం వెళ్లడం లేదు..

రామమందిర ప్రారంభోత్సవాన్ని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీపై కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిర కార్యక్రమం ‘మోడీ ఫంక్షన్’గా అభివర్ణించారు. జనవరి 22న తేదీని బీజేపీ, ఆర్ఎస్ఎస్ పూర్తిగా నరేంద్రమోడీ కార్యక్రమంగా మార్చాయని, ఇడి బీజేపీ/ఆర్ఎస్ఎస్ ఫంక్షన్ అని మండిపడ్డారు. అందుకే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెళ్లనని చెప్పారని అన్నారు. మేము అన్ని అన్ని మతాలను, ఆచారాలను గౌరవిస్తామని, హిందూ మత పెద్దలు, హిందూ మతానికి సంబంధించిన వ్యక్తులు కూడా జనవరి 22 రామ మందిర వేడుకలకు వెళ్లడంపై ఏమనుకుంటున్నారో వారి అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పారు. ఇది రాజకీయ కార్యక్రమం అని రాహుల్ గాంధీ అని అన్నారు. దీంతోనే ప్రధాని నరేంద్రమోడీ చుట్టూ రూపొందించిన ఈ రాజకీయ కార్యక్రమానికి వెళ్లడం మాకు ఇష్టం లేదు అని అన్నారు. అంతకుముందు రామాలయ వేడుకకు జనవరి 22న హాజరుకావాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, అధిర్ రంజన్ చౌదరిలకు అయోధ్య రామమందిర ట్రస్ట్ ఆహ్వానం పంపింది. ఇది పూర్తిగా ఆర్ఎస్ఎస్/బీజేపీ సొంత కార్యక్రమమని దీనికి హాజరు కాబోవడం లేదని కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. దీనిపై బీజేపీ విమర్శలు చేస్తోంది.

పీసీసీ చీఫ్‌గా వైఎస్‌ షర్మిల నియామకం.. కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటన

వైఎస్‌ షర్మిల వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసి.. కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న తర్వాత ఆమెకు కీలక బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ సాగింది.. త్వరలోనే ఆమెకు పీసీసీ చీఫ్‌గా నియమిస్తారని ప్రచారం సాగింది.. దానికి అనుగుణంగానే వైఎస్‌ షర్మిలను పీసీసీ చీఫ్‌గా నియమించింది కాంగ్రెస్‌ అధిష్టానం.. వైఎస్‌ షర్మిలను ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా నియమించినట్టు ఓ ప్రకటన విడుదల చేశారు ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌.. ఇదే సమయంలో.. సోమవారం రోజు పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజును కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించినట్టు పేర్కొన్నారు. కాగా, ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసి.. వైఎస్ షర్మిలకు లైన్‌ క్లియర్‌ చేసిన విషయం విదితమే.. మణిపూర్‌లో పీసీసీ అధ్యక్ష పదవిపై వైఎస్‌ షర్మిలకు మల్లికార్జున ఖర్గే స్పష్టత ఇచ్చారని.. హైకమాండ్ ఆదేశం మేరకు పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నమాట.. గిడుగు రుద్రరాజుతో రాజీనామాతో వైఎస్‌ షర్మిలకు లైన్‌ క్లియర్‌ కాగా.. ఈ రోజు వైఎస్‌ షర్మిలనకు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా నియమించింది కాంగ్రెస్‌ అధిష్టానం. కాగా, రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్‌ పరిస్థితి దారుణంగా మారిపోయింది.. కానీ, వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను రేస్‌లోకి తీసుకొచ్చేందుకు అధిష్ఠానం వ్యూహాలను రచిస్తోంది. దానిలో భాగంగా ఏపీ కాంగ్రెస్ పగ్గాలను షర్మిలకు అప్పగించిందంటున్నారు విశ్లేషకులు.. ఇటీవలే ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జన ఖర్గే, రాహుల్‌ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి పనుల్లో వైఎస్‌ షర్మిల బిజీగా ఉన్న విషయం విదితమే.

గాలిపటాలు ఎగురవేస్తూ ఇద్దరు చిన్నారులకు విద్యుత్‌ షాక్‌

కోరుట్ల పట్టణంలో సోమవారం గాలిపటం ఎగురవేస్తుండగా విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సంక్రాంతి పండుగ సందర్భంగా భీమునిదుబ్బ ప్రాంతంలో తమ ఇంటి డాబాపై ఇద్దరు చిన్నారులు తోకల సాత్విక్, ప్రశాంత్ గాలిపటం ఎగురవేస్తున్నారు. ఈ క్రమంలో గాలిపటం ఎగురవేసేందుకు ఉపయోగించే దారం విద్యుత్ తీగలలో ఇరుక్కుపోయింది. తీగలలోని దారాన్ని తీసేందుకు ప్రయత్నించగా, బాలురు విద్యుత్‌ వైరుకు తగిలి గాయాలు అయ్యాయి. వారిని స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

రామయ్య పాదాల చెంత వెలిగిన 108 అడుగుల భారీ అగరబత్తి..

గుజరాత్ లోని వడోదరకు చెందిన బిహాభాయ్ భర్వాద్ రామ భక్తుడు.. రామాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని 3.5 అడుగుల వెడల్పు, 108 అడుగుల పొడవుతో భారీ అగర్‌బత్తిని తయారు చేశాడు. ఆ భారీ అగర్‌బత్తి అయోధ్య రామయ్య పాదాల చెంత వెలిగింది. రామయ్యకు తమ గ్రామం నుంచి ఏదైనా కానుక ఇవ్వాలని భావించిన తర్సాలీ గ్రామం.. ఈ భారీ అగర్‌‌బత్తీని తయారుచేసింది. ఈ అగర్‌బత్తితో రాముడికి రోజూ ధూపం వేయాల్సిన పని కూడా తప్పుతుందని గ్రామస్థులు తెలిపారు. కాగా.. ఈ బాహుబలి బత్తీ తయారు చేయటానికి రెండు నెలల సమయం పట్టిందని.. దీని తయారీకి రూ.5 లక్షలు ఖర్చు అయ్యిందని తెలిపారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే హర్ష వర్ధన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొల్లాపూర్ లో మల్లేష్ ఆనే బీఆర్‌ఎస్‌ కార్యకర్తది రాజకీయ హత్య కాకపోతే.. జూపల్లి ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు..? అని ఆయన వ్యాఖ్యానించారు. హత్యపై డీజీపీకి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు సరైన రీతిలో విచారణ చేయడం లేదన్నారు హర్షవర్ధన్‌ రెడ్డి. మల్లేష్ హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను సచివాలయంలో పక్కన కూర్చో పెట్టుకుని మాట్లాడారు జూపల్లి కృష్ణారావు అని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. హత్య విచారణను ప్రభావితం చేసేలా జూపల్లి తీరు ఉందని, ఆ కుటుంబాన్ని పరామర్శించే ధైర్యం లేదు జూపల్లి కృష్ణారావుకి అని ఆయన అన్నారు. కేటీఆర్‌పై జూపల్లి కృష్ణారావు విమర్శలు రాజకీయ దిగజారుడుతనం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లేష్ హత్య వెనుక జూపల్లి కృష్ణారావు అనుచరులు ఉన్నారని, మల్లేష్ కుటుంబానికి బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందన్నారు.

ఎన్నారై మహిళా ఉద్యోగినిపై అత్యాచారం చేశారని సీఈవోపై కేసు నమోదు..

ఢిల్లీ పోలీసులు తన కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న ప్రవాస భారతీయ (ఎన్‌ఆర్‌ఐ) మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై రాజధానికి చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ సీఈవోపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు..ఈ సంఘటన సెప్టెంబర్ 14, 2023 నాటిది, ఇది ఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో జరిగిందని PTI నివేదకలో పేర్కొంది.. శనివారం రాత్రి, భారతీయ సంతతికి చెందిన అమెరికా పౌరుడు చేసిన ఫిర్యాదు మేరకు చాణక్యపురి పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 376 (రేప్) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది.. నిందితుడు CEOగా ఉన్న ఢిల్లీకి చెందిన సంస్థలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఫిర్యాదుదారు, ఆ వ్యక్తికి తన మామతో సంబంధం ఉందని, ఉద్యోగం పొందడంలో తనకు సహాయపడిందని తెలిపారు. అయితే నిందితుల  బయటకు చెప్పడానికి బయపడిన పోలీస్ అధికారి ఆ విషయాన్ని ఓ ఛానెల్ తో పంచుకున్నారు.. గత సంవత్సరం సెప్టెంబర్ 14న లుటియన్స్ ప్రాంతంలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో నిందితుడిని కలిశానని ఆమె మాకు చెప్పారు. తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది.. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ఆ సంస్థకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తుండగా, నిందితుడు సీఈవోగా ఉన్నారు. ఫిర్యాదుదారు, నిందితుడు ఇద్దరూ ఒకరికొకరు గతంలో తెలుసు. ఆ వ్యక్తి మహిళ మేనమామకు స్నేహితుడు..  ఉద్యోగం సంపాదించడంలో ఆమెకు సహాయం చేశాడు, అని అదనపు డిసిపి (న్యూఢిల్లీ) రవికాంత్ కుమార్ తెలిపారు. ఇక ఈ కేసుపై ఇంకా విచారణ కొనసాగుతోందని, లభ్యమైన ఆధారాలను బట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

షర్మిల ప్రభావం ఏపీ రాజకీయాల్లో జీరో..

వైఎస్ షర్మిలకు పీసీసీ పదవిపై మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కాంగ్రెస్ కు సీట్లే కాదు.. ఓటేసే దిక్కులేదని విమర్శించారు. షర్మిల ప్రభావం ఏపీ రాజకీయాల్లో జీరో అని ఆరోపించారు. ఏపీ ప్రజల ఆకాంక్షలను గొడ్డలితో అడ్డంగా నరికేసింది కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. పాత పార్టీకి నిన్నటి వరకు ఒకరు.. ఇవాళ మరొకరని పేర్కొ్న్నారు. అధ్యక్షులు మారినంత మాత్రాన ఎటువంటి ప్రయోజనం ఉండదని హాట్ కామెంట్స్ చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. మరోవైపు చంద్రబాబు అంశంపై మంత్రి అమర్నాథ్ స్పందించారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబుకు ఊరట కలిగిందనే ప్రచారం జరుగుతోంది.. చంద్రబాబు బెయిల్ మీద ఉన్న దొంగ అని విమర్శించారు. చంద్రబాబు కోర్టు బోనులో నిలబడి సమాధానం చెప్పాలిసిందే అని తెలిపారు. ద్విసభ్య ధర్మాసనం చాలా క్లియర్ గా చెప్పింది.. ఇన్వెస్టిగేషన్, రిమాండ్ ప్రొసీజర్ పక్కగానే జరిగిందని బెంచ్ అభిప్రాయపడిందని పేర్కొన్నారు. ఏ విధంగాను ఇది చంద్రబాబుకు అనుకూలం కాదు.. అమాయక చక్రవర్తని ఎక్కడా చెప్పలేదు అని అన్నారు.

దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ పెవిలియన్​అదుర్స్‌

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ పెవిలియన్​ అందరినీ ఆకర్షిస్తోంది. వేర్​ ట్రెడిషన్​ మీట్స్​ ఇన్నోవేషన్​ ట్యాగ్​ లైన్​తో ఈ ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. మన తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాన్ని చాటేలా రూపొందించిన ఈ వేదిక అందరినీ ఆకర్షిస్తోంది. మన బతుకమ్మ, బోనాల పండుగలు, మన చారిత్రక వారసత్వ సంపదకు చిహ్నంగా నిలిచిన చార్మినార్​… మన కళాకారుల ఖ్యాతిని ప్రపంచానికి చాటిన చేర్యాల పెయింటింగ్​, పోచంపల్లి ఇక్కత్​, ఐటీ, సాంకేతిక ఆవిష్కరణల కొత్త సౌధం టీ హబ్​.. స్కైరూట్ ఏరోస్పేస్.. విభిన్న రంగాల మేళవింపు ఉట్టిపడేలా తయారు చేసిన వాల్​ డిజైనింగ్​ ఈ పెవిలియన్​కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు ప్రపంచానికి చాటిచెప్పటంతో పాటు.. ’ఇన్ వెస్ట్ ఇన్​ తెలంగాణ’ పేరుతో ముస్తాబు చేసిన ఈ పెవిలియన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ’ప్రపంచంలోనే అపారమైన అవకాశాలున్న తెలంగాణ’, ‘పెట్టుబడులకు దేశంలోనే మొట్టమొదటి గమ్యస్థానం తెలంగాణ’ అనే నినాదాలు​ పెవిలియన్​కు స్వాగతం పలుకుతున్నాయి. భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు.. మీ కోసమే తెలంగాణ అంటూ ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి హోర్డింగ్​ ప్రపంచ దిగ్గజ కంపెనీలను ఆకట్టుకునేలా ఉంది. సంప్రదాయ మేళవింపుతో ఆవిష్కరణలు.. జీవ వైద్య రంగానికి డేటా సైన్స్​ జోడీ.. ప్రతిభను ప్రతిబింబించే సాంకేతికత.. పరిశ్రమల నుంచి సమగ్రత.. స్థిరత్వం నుంచి ఆర్థిక వృద్ధి సిద్ధిస్తుందనే తెలంగాణకున్న అనుకూలతలన్నింటినీ దీనిపై ఇంగ్లీష్​ కోట్స్​తో ప్రదర్శించారు.

Exit mobile version