ఉపరాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టాలని ఇండియా కూటమి నిర్ణయం! ఖర్గే మంతనాలు
జగదీప్ ధన్‌ఖర్ అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఎన్నిక జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు పోలింగ్ జరగనుంది. అదేరోజు ఫలితం విడుదల కానుంది. ఇక ఉపరాష్ట్రపతి పదవిని కైవసం చేసుకునేందుకు అధికార ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మద్దతు ఉంది. ఈజీగా ఈ ఎన్నిక గెలవనుంది. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి కూడా పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకోసం మల్లిఖార్జున ఖర్గే విపక్ష పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏకాభిప్రాయం కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వర్గాలు పేర్కొన్నాయి.
నది ఒడ్డున ప్రేమికుడు, కొండపై ప్రియురాలి మృతదేహాలు.. చంపిందెవరు..?
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఒక ప్రేమికుల హత్య కేసు సంచలనంగా మారింది. మూడు రోజుల్లోనే రెండు వేర్వేరు ప్రదేశాల్లో ఆ ప్రేమికుల మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. ఝాన్సీలోని గరౌత పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రపుర గ్రామంలో 18 ఏళ్ల పుట్టో మృతదేహం గ్రామంలోని కొండపై అనుమానాస్పద స్థితిలో పడి ఉండటాన్ని గ్రామస్థులు గమనించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు రోజుల క్రితం, ఝాన్సీ పరిధి లహ్చురా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని గుధా గ్రామం నది ఒడ్డున రక్తంతో తడిసిన ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడి పేరు విశాల్ అని వెల్లడైంది. అతను తహ్రౌలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పత్రాయ్ గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. విశాల్, పుట్టో చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. మూడు రోజుల క్రితం, ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. ఈ అంశంపై గరౌతా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. బహుశా అమ్మాయి కుటుంబానికి వారి ప్రేమ వ్యవహారం నచ్చకపోవచ్చునని ప్రజలు అంటున్నారు. కాబట్టి వారు వారిని చంపి, వారి మృతదేహాలను వేర్వేరు ప్రదేశాల్లో విసిరేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన జరిగినప్పటి నుంచి రెండు గ్రామాల్లోనూ దుఃఖ వాతావరణం నెలకొంది. మరోవైపు ఈ అంశంపై పోలీసులు స్పందిస్తూ.. ఆ అమ్మాయి సోదరుడు ఈ హత్యలు చేశాడని.. ప్రస్తుతం ఆ సోదరుడు పరారీలో ఉన్నాడని చెబుతున్నారు.
ప్రియుడిని ఇంటికి పిలిచి భర్తతో కలిసి చంపేసిన ప్రియురాలు.. అసలేమైందంటే..!
ఉత్తరప్రదేశ్‌లో దారుణంగా జరిగింది. ప్రియుడిని ఇంటికి పిలిచి.. అత్యంత దారుణంగా భర్త కలిసి ప్రియురాలు హతమార్చింది. సంభాల్‌లో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రయీస్ అహ్మద్, సితార భార్యభర్తలు. అనిష్(45) అనే యువకుడితో సితారకు సంబంధం ఉంది. అయితే ఇటీవల అనిష్‌కు పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలో అనిష్‌ను ఇంటికి పిలిచిన సితార.. భర్తతో కలిసి స్క్రూడ్రైవర్‌తో పొడిచి చంపేసింది. బాధిత కుటుంబం మాట్లాడుతూ.. అప్పు ఇచ్చిన డబ్బులు అడిగినందుకు హత్య చేశారని ఆరోపిస్తూ ఉంటే.. వివాహేతర సంబంధంతోనే ఈ హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులైన భార్యాభర్తలను అరెస్ట్ చేశారు. అయితే సితార.. తన ప్రియుడ్ని ఎందుకు చంపిందో అర్థం కావడం లేదని పోలీసులు పేర్కొన్నారు.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలపై జగన్ సంచలన ట్వీట్..
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలపై మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్ చేశారు. చంద్రబాబు అనే వ్యక్తి అప్రజాస్వామిక, అరాచకవాది. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతరేశారని.. అబద్దాలు చెప్పి, మోసాలు చేసి కుర్చీని లాక్కోవాలని చూస్తున్నారని ఆరోపించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని.. సీఎంగా చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. జగన్ ట్వీట్ ప్రకారం.. చంద్రబాబు అనే వ్యక్తి ఒక అప్రజాస్వామిక, అరాచక వాదని, రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, ప్రజల మనసును గెలుచుకుని రాజకీయాలు చేయరని, కుట్రలు చేసి, దాడులు, దౌర్జన్యాలు చేసి, అబద్ధాలు చెప్పి, మోసాలుచేసి, వెన్నుపోట్లు పొడిచి కుర్చీని లాక్కోవాలని చూస్తారని అనడానికి మరోమారు మన కళ్లెదుటే రుజువులు కనిపిస్తున్నాయి. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ(ZPTC) స్థానాల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ ఆయన చేస్తున్న నిస్సిగ్గు, బరితెగింపు రాజకీయాలే దీనికి సాక్ష్యాలు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనీయకుండా, కుట్రపూరితంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుగారు, ఆయన అడుగులకు మడుగులొత్తే కొంతమంది అధికారులు, టీడీపీ అరాచక గ్యాంగులు, ఈ గ్యాంగులకు కొమ్ముకాసే మరి కొంతమంది పోలీసులు వీరంతా ముఠాగా ఏర్పడి అక్కడి ఎన్నికను హైజాక్ చేయడానికి దుర్మార్గాలు, దారుణాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబుగారు అమలు చేస్తున్న కుట్రపూరిత పథకాన్ని ఒక సారి చూస్తే…,
టీటీడీ ఫిర్యాదుతో వైఎస్ జగన్ మేనమామపై కేసు?.. అసలేం జరిగింది..?
మాజీ సీఎం వైఎస్ జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పై టీటీడీ విజిలెన్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీవారి ఆలయం ముందు రాజకీయ ఆరోపణలు చేశారని విజిలెన్స్ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలను నిషేధిస్తూ ఇటీవల పాలకమండలి తీర్మానం చేసిన విషయం తెలిసిందే. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు పరిశీలిస్తున్న పోలీసులు పరిశీలిస్తున్నారు. లీగల్ ఓపినియన్ అనంతరం కేసు నమోదు చేసే అవకాశం ఉంది..
ముందస్తు సమాచారం ఇచ్చినా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు..
వర్షాల కారణంగా రింగ్ రోడ్డులోపల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని లక్ష్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్‌ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాత్కాలిక ట్రాఫిక్ ఇబ్బందులు తప్ప ఇతర పెద్ద సమస్యలు లేవని తెలిపారు. ఏ విభాగమైనా సరే సమన్వయంతో పనిచేస్తే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని చెప్పారు. ప్రభుత్వం ఎంతటి చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం కూడా అవసరమని మంత్రి స్పష్టం చేశారు. ఆకస్మిక వర్షం, అక్రమ నిర్మాణాలు, ఓపెన్ నాళాల్లో చెత్త వేయడం వంటి కారణాలతో సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన తెలిపారు. ఈ పరిస్థితులను ఎదుర్కోవడంలో హైడ్రా వాహనాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు.
హర్యానాలో భూకంపం.. జనం పరుగులు
హర్యానాలో భూకంపం సంభవించింది. ఝజ్జర్‌లో 3.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆదివారం మధ్యాహ్న సమయంలో 3.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. భయంతో జనాలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఎలాంటి వివరాలు అధికారులు వెల్లడించలేదు. ఈ భూకంపం మధ్యాహ్న 4:10 గంటలకు వచ్చినట్లుగా తెలుస్తోంది. 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించిందని ఎన్‌సీఎస్ తెలిపింది. అయితే దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. ప్రస్తుతం అధికారులు అప్రమత్తం అయ్యారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఏపీకి ఎల్లో అలర్ట్ జారీ.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్..
ఏపీకి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. పల్నాడు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది. తిరుపతి, కడప, నంద్యాల, సత్యసాయి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. జనాలకు కీలక సూచనలు చేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల వాతావరణం మళ్లీ ఒక్కసారిగా మారబోతుంది. ఈ నెల 13వ తేదీ నుంచి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు తెలంగాణతోపాటు ఏపీలో కూడా ప్రభావం చూపించనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఆగస్టు 10) తెలంగాణలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రేపు, అంటే 11వ తేదీన, ఈ ప్రభావం 19 జిల్లాల్లో కనిపించనుంది. అంటే దాదాపు రాష్ట్రం మొత్తం వర్షం ప్రభావం కనిపించనుంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా రాబోయే 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సృష్టి ఫెర్టిలిటీ స్కాండల్.. సంచలన విషయాలు తెరపైకి
హైదరాబాద్‌లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌కు చెందిన డాక్టర్ నమ్రతపై ఘోర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పేద దంపతుల వద్ద ఫ్రీగా ఆడపిల్లలను తీసుకుని, సరోగసి పేరుతో విక్రయించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆడపిల్లలను పెంచే ఆర్థిక స్థోమత లేని కుటుంబాల నుండి ఏజెంట్ల సహకారంతో పిల్లలను సేకరించిన నమ్రత, మగ పిల్లలయితే ఒక్కొక్కరిని లక్ష రూపాయలకు కొనుగోలు చేసి సరోగసి పేరుతో అమ్మినట్లు సమాచారం. డాక్టర్ నమ్రత దగ్గరకు వచ్చే దంపతులకు సరోగసి పేరుతో చికిత్స అందిస్తున్నట్టుగా చూపించేది. గర్భధారణ ప్రక్రియ జరుగుతోందని నమ్మించేలా ప్రతినెల స్కానింగ్‌లు, బిడ్డ ఎదుగుదల రిపోర్టులు తయారు చేసి పంపించేది. వాస్తవానికి అవి నకిలీ రిపోర్టులేనని దర్యాప్తులో తేలింది. “మీ బిడ్డ వేరే మహిళ గర్భంలో పెరుగుతున్నాడు” అంటూ ప్రతి నెల చికిత్స పేరుతో మూడు నుండి నాలుగు లక్షలు వసూలు చేసేది.
భారీగా పెరిగిన వరద.. నాగార్జునసాగర్ 8 గేట్ల ఓపెన్
నాగార్జున సాగర్ ప్రాజెక్టులో వరద పరిస్థితి మరోసారి తీవ్రరూపం దాల్చింది. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు పెద్ద ఎత్తున చేరుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం 590 అడుగులకు చేరడంతో అధికారులు 8 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 65,842 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,09,952 క్యూసెక్కులుగా నమోదైంది. ఇక తెలంగాణకు వాతావరణశాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. రేపు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్, అధికారులు ప్రజలకు సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
