Site icon NTV Telugu

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

ట్రంప్ పాలనలో నయా పాలసీ.. వారికి స్పోర్ట్స్ వీసాలపై నిషేధం!

అమెరికా అధ్యక్షుడు తనదైన మార్క్ పాలనను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికాలో ట్రాన్స్‌జెండర్ మహిళలకు ఎదురుదెబ్బ తగిలింది. మహిళల క్రీడలలో పాల్గొనడానికి వీసా కోసం దరఖాస్తు చేసే ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లకు ఇక నుంచి ఆమోదించారు. అమెరికన్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) తాజా పాలసీ ప్రకారం, పురుషుడిగా జన్మించి లింగమార్పిడి చేసి మహిళల క్రీడల్లో పోటీ పడే క్రీడాకారుల దరఖాస్తులను ప్రతికూలంగా పరిగణించనున్నట్టు సోమవారం ప్రకటన విడుదల చేసింది. ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారికి ఇచ్చే O-1A వీసాలు, అత్యుత్తమ ప్రతిభ కలిగిన వలసదారులకు ఇచ్చే EB-1, EB-2 గ్రీన్ కార్డులు, అలాగే నేషనల్ ఇంటరెస్ట్ వేవర్స్ వంటివి ఇకపై ట్రాన్స్‌జెండర్ మహిళలకు సులభంగా మంజూరు కాబోవని USCIS స్పష్టం చేసింది. బయాలజికల్ గుణల వల్ల పురుషులు మహిళల క్రీడలలో గెలిచే అవకాశాన్ని ట్రాన్స్‌జెండర్ ముసుగులో వాడుకుంటున్నారని చాలా కేసుల్లో స్పష్టమైందని USCIS అధికార ప్రతినిధి మాథ్యూ ట్రాగెసర్ వ్యాఖ్యానించారు. ఈ చర్య మహిళా క్రీడాకారుల భద్రత, సమానత్వం, గౌరవం, నిజం అనే ప్రమాణాల్ని కాపాడేందుకు తీసుకున్నదని పేర్కొన్నారు.

పవన్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ ..

ఇటీవలే ‘హరి హర వీరమల్లు’తో పలకరించిన పవన్‌కల్యాణ్‌ అదే జోష్‌తో ఇప్పుడు ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ను పూర్తి చేశారు. పవన్ – హరీశ్ శంకర్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో రాబోతున్నారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఒక మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. పవన్ మాస్ మేనరిజం, డీఎస్‌పీ మ్యూజిక్, హరీష్ శంకర్ టేకింగ్ – ఈ మూడింటి కాంబినేషన్ చూసి ఫ్యాన్స్ థియేటర్లు దద్దరిలడం ఖాయం. అయితే తాజాగా దర్శకుడు గుడ్‌న్యూస్‌ చెప్పారు.

ఉదయం పెళ్లి, రాత్రికి ఫస్ట్ నైట్.. అంతలోనే నవవధువు ఆత్మహత్య!

కాళ్లపారాణి ఆరకముందే నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం పెళ్లి చేసుకున్న యువతి.. రాత్రి ఫస్ట్ నైట్ సమయానికే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన సోమవారం ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. నవవధువు ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కూతురు మృతితో ఆమె తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. స్థానికులు తెలిపిన డీటెయిల్స్ ఇలా ఉన్నాయి… సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన కృష్ణమూర్తి, వరలక్ష్మి దంపతుల కుమార్తె హర్షిత (22). హర్షితకు కర్ణాటకలోని బాగేపల్లి పరిధి దిబ్బూరిపల్లికి చెందిన నాగేంద్రతో ఇటీవల పెళ్లి నిశ్చయించారు. సోమవారం ఉదయం హర్షిత, నాగేంద్రల వివాహం ఘనంగా జరిగింది. నూతన జంటకు ఫస్ట్ నైట్ వేడుక కోడం కుటుంబసభ్యులు ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో హర్షిత గదిలోకి వెళ్లి పైకప్పునకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. హర్షిత ఎంతసేపటికి గదిలో నుంచి బయటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. బంధువులు గది తలుపులు పగలగొట్టారు.

ఆపరేషన్ సిందూర్‌పై ప్రతిపక్షాల తీరు బాధించింది

ఆపరేషన్ సిందూర్‌పై ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరు ఎంతగానో బాధించిందని ప్రధాని మోడీ అన్నారు. మంగళవారం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం అయింది. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో ప్రధాని మోడీని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోడీ ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్‌పై ప్రతిపక్షాల వైఖరి ఏ మాత్రం బాగోలేదన్నారు. తమకు తాము గాయం చేసుకునే విధంగా విపక్ష తీరు ఉందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఎన్ని కీలక విజయాలు సాధించిందని గుర్తుచేశారు. ఆర్టికల్ 370 రద్దు, రామమందిర స్థాపనను జ్ఞాపకం చేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ సందర్భంగా ప్రతిపక్షం స్వీయ హాని కోసం పట్టుబట్టిందని వాపోయారు. ఈ చర్చ ద్వారా ప్రతిపక్షం తప్పు చేసిందన్నారు. ఇక ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆపరేషన్ సిందూర్‌పై తీర్మానాన్ని చదివి వినిపించగా.. కూటమి నేతలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు.

బీఆర్ఎస్ ఫ్యామిలీపై గువ్వల బాలరాజు కీలక వ్యాఖ్యలు

అవినీతి ఆరోపణలు, వరుస విచారణలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. నాగర్‌కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సోమవారం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఫ్యాక్స్‌ ద్వారా తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. మంగళవారం ఆయన మరోసారి ఈ రాజీనామాపై స్పందించారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. ఈనెల 2న తన రాజీనామా సమర్పించానని, కాళేశ్వరం నివేదిక వెలువడిన తర్వాత రాజీనామా చేశానని చెప్పడం సరైందికాదని వ్యాఖ్యానించారు. తన లేఖలో ఎక్కడా అసంతృప్తిని వ్యక్తం చేయలేదని అన్నారు. కేసీఆర్‌ ఫ్యామిలీ కొంత బాధలో ఉంది.. నేనూ బాధ పెట్టదల్చుకోలేదన్నారు గువ్వల బాలరాజు.

అత్యంత ధైర్యవంతమైన నిర్ణయం.. డిప్యూటీ సీఎం పవన్ పోస్ట్ వైరల్!

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ‘ఆర్టికల్‌ 370’ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. 2019 ఆగస్టు 5న ఈ అధికరణను నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. రద్దు అనంతరం జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా (జమ్మూ కశ్మీర్‌, లడఖ్) విభజించిన విషయం తెలిసిందే. ఆర్టికల్‌ 370 రద్దుకు నేటితో ఆరేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. జమ్మూ కశ్మీర్‌, లడఖ్ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు.

మ్యాగజైన్ కవర్ పేజ్ పై యంగ్ టైగర్.. ట్రెండింగ్ ఇన్ ఇండియా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టెంపర్ నుండి వరుస హిట్స్ కొడుతూ టాలీవుడ్ లో మరే ఇతర హీరోలు సాధించలేని రికార్డులను తన పేరిట నమోదు చేస్తున్నాడు ఎన్టీఆర్. RRR సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్ ను పెంచుకున్నాడు తారక్. అటు ఓవర్సీస్ లోను ఎన్టీఆర్ సినిమాలు భారీ కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఇక ఇప్పుడు వార్ 2తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఈ నెల 14న రిలీజ్ కానుంది ఈ సినిమా. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ క్రేజ్ ఇప్పడు మరొ లెవల్ కు వెళ్ళింది. ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ కవర్ పేజీపై ఎన్టీఆర్ ఫోటోను ప్రింట్ చేసింది. ఆ ఫోటోలో రాయల్ లుక్ లో ఎన్టీఆర్ స్వాగ్ అదిరిందనే చెప్పాలి. ఎన్టీఆర్ తన మొట్టమొదటి మ్యాగజైన్ కవర్‌ను ఎస్క్వైర్ ఇండియాతో  షేర్ చేసుకున్నాడు. ఇది ఐకానిక్‌గా ఉందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ మ్యాగజైన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎస్క్వైర్ ఇండియా కవర్ పేజ్ ఫోటో షూట్ ను దుబాయ్ లో నిర్వహించారు. అందుకు సంబందించిన వీడియోను కూడా త్వరలో రిలీజ్ చేయనుంది ఎస్క్వైర్ ఇండియా. 

కాళేశ్వరం నివేదిక లీకులను పట్టించుకోం

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై విచారణ కమిషన్ నివేదిక హాట్ టాపిక్‌గా మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతున్న వేళ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఈ అంశంపై స్పందించారు. నివేదిక లీకులపై తమకు ఎలాంటి ఆసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. “ప్రభుత్వం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాతే మేము స్పందిస్తాం. ఇప్పుడే బయటకు వస్తున్న ఈ నివేదిక ప్రభుత్వానిదా? లేక కాంగ్రెస్‌దా?” అని ఆయన ప్రశ్నించారు.

రష్యాలో పాక్‌, చైనా కిరాయి సైనికులు.. జెలెన్‌స్కీ ఆరోపణలు

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాతో యుద్ధంలో మాస్కో సైనికులతో పాటు పాకిస్థాన్, చైనాకు చెందిన కిరాయి సైనికులతో కూడా పోరాడాల్సి వస్తోందని జెలెన్‌స్కీ ఆరోపించారు. ఉక్రెయిన్ సైనిక దళాలతో జెలెన్‌స్కీ భేటీ అయ్యారు. ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. చైనా, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్తాన్‌, పాకిస్థాన్‌తో సహా ఆఫ్రికన్‌ దేశాల నుంచి వస్తున్న కిరాయి సైనికులు యుద్ధంలో పాల్గొంటున్నట్లు తమ దళాలు గుర్తించాయని తెలిపారు. దీనికి తమ వైపు నుంచి ప్రతిస్పందన గట్టిగా ఉంటుందని హెచ్చరించారు.

గోల్డ్ లవర్స్‌కు షాక్.. భారీగా పెరిగిన పసిడి ధర

శ్రావణ మాసంలో బంగారం ధరలు షాకిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్లు మొదలు కావడంతో పసిడి ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. గత వారం దాకా హెచ్చుతగ్గులుగా ఉన్న ధరలు ఈ వారం మాత్రం హడలెత్తిస్తున్నాయి. నిన్న స్వల్పంగా పెరిగిన ధర.. ఈరోజు మాత్రం అమాంతంగా భారీగా పెరిగింది. తులం బంగారం ధర రూ. 820 పెరిగింది. ఇక సిల్వర్ ధర కూడా షాకిచ్చింది. కేజీ వెండి ధరపై రూ.2,000 పెరిగింది. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర 820 రూపాయలు పెరిగి.. రూ.1,02, 220 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర 750 రూపాయిలు పెరిగి.. తులం బంగారం ధర రూ. 93,700 దగ్గర ట్రేడ్ అవుతోంది. మరోవైపు 18 క్యారెట్ల గ్రాము బంగారం ధర 620 రూపాయిలు పెరిగి 10 గ్రాముల ధర రూ.76,700 దగ్గర ట్రేడ్ అవుతోంది.

 

Exit mobile version