తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజకీయ రంగాన్ని తాను ఒక పవిత్రమైన యజ్ఞంలా , తపస్సులా భావిస్తానని చాటిచెప్పారు. అధికార దాహం కంటే ప్రజా సేవకే ప్రాధాన్యతనిస్తూ, గత దశాబ్దాలుగా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు , రాజకీయ పార్టీలకు అతీతంగా తాను పనిచేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండటం సహజమని, అయితే తనపై రాజకీయంగా విమర్శలు చేసే శత్రువుల నియోజకవర్గాలు , గ్రామాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో తాను పక్షపాతం లేకుండా నిధులు కేటాయించానని ఆయన గుర్తుచేశారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా అభివృద్ధిపై ఆయనకు ఉన్న మక్కువను ప్రదర్శిస్తూ, ఈ జిల్లాను తెలంగాణలోనే కాకుండా దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాలనేది తన జీవితాశయమని పేర్కొన్నారు. అది గిరిజన ప్రాంతమైనా, అటవీ ప్రాంతమైనా మౌలిక సదుపాయాల కల్పనలో వెనుకబడకూడదనే పట్టుదలతో పని చేస్తున్నట్లు ఆయన వివరించారు.
Damodar Raja Narasimha: ఉగాది నాటికి సనత్‌నగర్ TIMS ప్రారంభం: పూర్తి స్థాయి వైద్య సేవలు అందిస్తాం..!
గత ప్రభుత్వ పనితీరును తీవ్రంగా ఎండగట్టిన తుమ్మల, గత పాలకుల హయాంలో ప్రజలకు కేవలం అరిచేతిలో వైకుంఠం చూపించారని, ఆచరణ సాధ్యం కాని హామీలతో రాష్ట్రాన్ని , ప్రజలను మోసం చేశారని విమర్శించారు. గత పాలనలో జరిగిన నష్టాలను పూడ్చుకుంటూ, ప్రస్తుతం రాష్ట్రాన్ని సరైన దారిలో నడిపించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అనుభవం లేని యువకుడిగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాయకత్వంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. “తెలంగాణ మోడల్” అంటే కేవలం మాటలు కావని, పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్ పంపిణీ, సన్న బియ్యం సరఫరా , పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజన వసతి వంటి కార్యక్రమాలే దానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. విద్య , వైద్య రంగాల్లో సమూల మార్పులు తీసుకొస్తూ మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రగతిలో కేంద్ర ప్రభుత్వం నుండి ఎదురవుతున్న సవాళ్లను కూడా ఆయన ప్రస్తావించారు. కేంద్రం ఆశించిన స్థాయిలో సహకరించకపోయినా, అనేక ఆటంకాలు సృష్టించినా , రాష్ట్రంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ, సంక్షేమ పథకాలు ఆగకుండా చూస్తున్నామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే పరమావధిగా, ఆర్థిక లోటును అధిగమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తుమ్మల నాగేశ్వరరావు తన ప్రసంగంలో ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
