Thummala Nageswara Rao Gives Clarity On Party Changing: కొన్ని రోజుల నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీని వీడనున్నారనే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆయన తిరిగి గులాబీ తీర్థం పుచ్చుకోవచ్చని ప్రచారం జరిగింది. అయితే.. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తుమ్మల క్లారిటీ ఇచ్చేశారు. తాను టీఆర్ఎస్‌లోనే ఉంటానని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వాజేడులో గురువారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల ఆ విషయాన్ని ధృవీకరించారు. ఈ ఆత్మీయ సమావేశం యాదృచ్చికమేనని.. ఇక్కడ చేసిన అభివృద్దికి కృతజ్ఞతగా తన ఆత్మీయులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఎవ్వరినీ ఇక్కడికి రమ్మని తాను పిలవలేదని.. కొద్దిమంది మిత్రులు అనుకొని, ఈ కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. టీవీలలో వస్తున్నట్టు ఎలాంటి బ్రేకింగులు లేవని మరోసారి క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణా సాధకుడు, తన సహచరుడు కేసీఆర్ ఆశయాలకు, తన ఆలోచనలకు రూపంగా సీతారామ ప్రాజెక్టుని పూర్తి చేశామని తుమ్మల తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి చెరువు, ప్రాజెక్టుకు సీతమ్మ సాగర్ ద్వారా నీళ్లు అందిస్తామన్నారు. కేసిఆర్ స్వప్నంతోనే.. ప్రతి ఇంట్లో నల్లా తిప్పితే, శుద్ధి చేసిన నీటిని అందిస్తున్నామన్నారు. రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉండాలనేది ముఖ్యమంత్రి కోరిక.. దేశ రాజకీయాలలో ఎవరో ఒకరు ఏదో చేద్దామనే ఆలోచనలు చేస్తూనే ఉంటారని తెలిపారు. అయితే.. మనకు నిబద్ధత ముఖ్యమని సూచించారు. రాజకీయాల్లో ఒడిదొడుకులు ఉండనే ఉంటాయన్నారు. మీ అభిమానం తోడుంటే.. కొండలనైనా తాను పిండి చేస్తానన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన అన్ని అనుమతులను ఇవ్వాలని తాము కేంద్ర ప్రభుత్వంపై యుద్ధమే చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి.. విభజన అంశాలు ఏమున్నాయో, వాటిలో ప్రధానంగా నదీజాలాల సమస్యను సీఎం కేసిఆర్ ప్రస్తావించారన్నారు.
సీతారామ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో వినియోగంలో రావడం కోసం.. సీతమ్మ సాగర్ బ్యారేజ్ ఈ సీజన్‌లోనే కంప్లీట్ చేయ్యాలని కేసిఆర్ అధికారులకు ఆదేశించారని తుమ్మల వెల్లడించారు. ఇక్కడ 36 టీఎంసీ నీళ్ళు నిల్వ ఉండటం వల్ల.. మంచినీటికి గాను, సాగునీటికి గాను ఎలాంటి ఇబ్బంది ఉండకుండా చూడటం కోసమే సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణమన్నారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు సజావుగా పూర్తి చేసేందుకు.. సీఎం సూచనలు మేరకు అధికారులు కష్టపడి పని చేస్తున్నారన్నారు. అందరు కలిసి అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ఇక ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.