Harish Rao: ఈ నెల 18న బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం వేదికగా భారీ బహిరంగసభను నిర్వహిస్తోంది. సభకోసం మంత్రలు ఖమ్మం జిల్లాలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రమంత్రి హరీష్ రావు శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు సండ్రవీరయ్య, రెడ్యానాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Also: Kishan Reddy: తండ్రిని అడ్డుపెట్టుకుని కేటీఆర్‌లా మంత్రిని కాలేదు.. కష్టపడి పైకి వచ్చాం..
రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న బీఆర్ఎస్ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన సభ కరీంనగర్ సభ అని, దేశ రాజకీయాలను మలుపుతిప్పబోయే సభ ఖమ్మం సభ అని ఆయన అన్నారు. ప్రస్తుతం యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తోందని అన్నారు. నేడు తెలంగాణ చేస్తుందే.. రేపు దేశం ఆచరిస్తుంది అని పేర్కొన్నారు. ఖమ్మం సభకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్ట్ నాయకులు రాబోతున్నట్లు ఆయన వెల్లడించారు.
దేశస్థాయిలో ఉండే రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు తెలంగాణ వైపు దృష్టి సారించాయని.. కేసీఆర్ ఎదుగుదల తెలంగాణ ప్రజల ఎదుగుదల అని అన్నారు. వరంగల్ జిల్లాకు రావాల్సిన గిరిజన యూనివర్సిటీ ఎందుకు ఇవ్వలేదని.. మా బయ్యారం ఉక్కు ప్యాక్టరీ ఎప్పుడు ప్రారంభిస్తారు..? వరంగల్ లో కోచ్ ఫ్యాక్టరీ ఎప్పుడు పెడతారు..? అని బీజేపీని ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీ బీజేపీ కాదా..? అని అడిగారు.