ఆరాంఘర్ నుండి నెహ్రూ జూలాజికల్ పార్క్ మార్గంలో 4.5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న, నగరంలో రెండవ అతి పొడవైన ఫ్లైఓవర్ మార్చి 2023 నాటికి ప్రారంభించబడే అవకాశం ఉంది. ప్రస్తుతం పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే నగరంలో పొడవైన ఫ్లైఓవర్. 636.80 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డీపీ) కింద ఆరు లేన్‌ల ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు. ఫ్లై ఓవర్ పనులను బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పరిశీలించారు. ఆయన వెంట గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ ఉన్నారు. ఈ ఫ్లై ఓవర్ జీహెచ్‌ఎంసీ చార్మినార్ జోన్ పరిధిలోకి వస్తుంది.
అయితే తాజాగా ఇదే జోన్‌లో మరో ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు ఒవైసీ జంక్షన్ సమీపంలోని ఏపీజే అబ్దుల్ కలాం ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. ఇటీవల జీహెచ్‌ఎంసీ సెంట్రల్ డివిజన్ పరిధిలో షేక్‌పేట్ ఫ్లైఓవర్ ప్రారంభమైంది. అయితే నగరంలోని పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే తర్వాత రెండో స్థానంలో షేక్‌పేట్ ఫ్లైఓవర్ ఉంది. కానీ.. ఈ ఫ్లైఓవర్ పొడవు 2.71 కిలోమీటర్ల.. 2023లో ప్రారంభం కానున్న ఆరాంఘర్ నుండి నెహ్రూ జూలాజికల్ పార్క్ మార్గంలోని ఫ్లైఓవర్ 4.5 కిలోమీటర్లు ఉండనుంది. దీంతో నగరంలో రెండో పొడవైన ఫైఓవర్ స్థానంలో ఆరాంఘర్ నుండి నెహ్రూ జూలాజికల్ పార్క్ మార్గంలో నిర్మించే ఫ్లైఓవర్ నిలువనుంది.