క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చిన తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు 101వ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీవీ ఘాట్‌లో ఆయనకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. భారతదేశం ఆర్ధికంగా శక్తి వంతంగా నిలవడానికి పీవీ నరసింహారావే కారణమని పేర్కొన్నారు. భూ సంస్కరణలు తేవడమేకాకుండా.. భూమి లేని పేదలకు భూమి ఇచ్చారన్నారని అన్నారు. యువత ప్రపంచ దేశాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందడానికి పీవీ సరళీకృత విధానాలే కారణమని కొనియాడారు.
ప్రతి ఒక్కరూ కీర్తించాల్సిన వ్యక్తి పీవీ అని రేవంత్ అన్నారు. మారుమూల గ్రామం నుంచి దేశ ప్రధానిగా ఎదగారని, ఆయన సేవలు మరవలేనివని అన్నారు. అంతేకాదు దివంగత జైపాల్ రెడ్డి పీవీ అడుగుల్లో నడిచారని తెలిపారు. తెలంగాణ అభ్యున్నతికి కాంగ్రెస్ పాటు పడుతుందన్నారు. హన్మకొండ, భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామంలో పీవీ జ్ఞాపకార్దం చేపట్టిన పనులు అసంతృప్తిగా జరిగాయని తెలుస్తోందన్నారు. వాటిని త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని రేవంత్ అన్నారు. పీవీ నరసింహారావు కుటుంబాన్ని కాంగ్రెస్ ఎప్పుడు గౌరవిస్తుందని రేవంత్ ఈ సందర్బంగా పేర్కొన్నారు.
