సంక్రాంతి అనగానే గాలి పటాలను ఎగుర వేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక పిల్లలకు అయితే ఈ పండుగ ఎంత ప్రత్యేకమో చెప్పనవసరం లేదు. సంక్రాంతి సెలవుల్లో పిల్లలందరూ గాలిపటాలను ఎగురవేయడమే కాకుండా, గాలిపటాల ఎగురవేతపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో పిల్లలు ఇతరుల గాలిపటాలను ఓడించేందుకు నిషేధిత దారాలను ఉపయోగిస్తుంటారు. అయితే గాలి పటాలను ఎగురవేసేటప్పడు దానికి వాడే దారం, మాంజా వంటివి ఎన్నో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బెంచ్ గాలి పటాలను ఎగుర వేసేప్పుడు నైలాన్, సింథటిక్ దారాలను ఉపయోగించడాన్ని, అమ్మకాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆయా రాష్ర్టాలను ఎన్జీటీ ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ అటవీశాఖ మార్గదర్శకాలను రూపొందించింది.
Read Also: ఏపీలో కొత్తగా 4,528 కరోనా కేసులు
నైలాన్, సింథటిక్ దారాలతో ఎవరైనా గాలి పటాలను ఎగుర వేసినా, వాటిని అమ్మినా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు పోలీస్, జీహెచ్ఎంసీ, ఫారెస్ట్, డిపార్ట్‌మెంట్‌తో పాటు ఎన్జీవో సంఘాలను రంగంలోకి దింపింది. ఫిర్యాదు చేసేందుకు 24గంటలూ పనిచేసేలా హెల్ప్ లైన్, టోల్ ఫ్రీ నెం. 18004255364ను, 040…23231440 అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎవరైనా నిషేధిత దారాలతో గాలిపటాలను ఎగుర వేస్తే ఈ నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. నిషేధిత దారాలతో గాలిపటాలు ఎగురవేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ అటవీ శాఖ తెలిపింది.
