NTV Telugu Site icon

అందుకే హుజురాబాద్‌లో దళిత బంధు ప్రారంభించాం : వినోద్‌ కుమార్‌

హుజురాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారం ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలిఉంది. దీంతో ప్రముఖ రాజకీయ పార్టీలైన టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు హుజురాబాద్‌ టీఆర్ఎస్‌ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనడం హాస్యాస్పదమన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఓట్ల కోసమో ఎన్నికల కోసమో పథకాలు తీసుకువచ్చే పార్టీ కాదని, మా మేనిఫెస్టోలో లేని రైతుబంధు ఇచ్చిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు.

కేంద్ర బలగాలను దించి భయపెట్టాలని చూస్తున్నది బీజేపీయే అని ఆరోపించారు వినోద్… హుజురాబాద్‌లోనే ఆనాడు రైతు బంధు ప్రారంభించాము, అందుకే దళిత బంధు కూడా ఇక్కడి నుండి ప్రారంభించామని ఆయన వెల్లడించారు. కేసీఆర్ సభ కోసం వంద ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తే మోడల్ కోడ్ కారణాలు చూపిస్తూ జిల్లా మొత్తం ఎలక్షన్ కోడ్ తీసుకొచ్చారన్నారు. పక్క జిల్లా లో సభ ఏర్పాటు చేద్దాం అంటే మళ్లీ రాష్ట్రం మొత్తం కోడ్ తీసుకు వస్తారేమో అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ బహిరంగ సభ అంశం ఎన్నికల కమిషన్ పరిధిలో ఉందని, ఇప్పటివరకు ఎలాంటి గొడవలు జరగకుండా ప్రచారాలు జరిగాయని, ఇక ముందు కూడా గొడవలు లేకుండా ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు.