Telangana Young Voters: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 18-19 ఏళ్ల మధ్య వయసు ఓటర్ల సంఖ్య లక్షా 36 వేల 496 మాత్రమే. అయితే ఈ సంఖ్య త్వరలోనే రికార్డు స్థాయిలో ఏకంగా ఎనిమిది రెట్లు పెరగనుంది. తద్వారా 10 లక్షల మార్కును చేరుకోనుంది. భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) కొత్తగా ప్రవేశపెట్టిన రూలే దీనికి కారణం. ఇప్పటివరకు ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండినవాళ్లు మాత్రమే ఓటర్ గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉండేది.
కానీ ఇప్పుడు 17 సంవత్సరాలు నిండినవాళ్లు కూడా అడ్వాన్స్‌గా అప్లై చేసుకునేందుకు ఈసీఐ ఛాన్స్ ఇచ్చింది. 2023 ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 నాటికి 18 నిండబోయేవాళ్లు ముందుగానే అంటే 2022 ఆగస్టు ఒకటి నుంచి ఎన్‌రోల్ అవటానికి అనుమతించింది. 2023 వార్షిక ఓటర్ల సవరణ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుండటంతో ఈసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు దరఖాస్తు చేసుకునేవారి పేర్లను తదుపరి ఓటర్ల ముషాయిదా జాబితాలో చేరుస్తారు.
Woman Statue: ఈ విగ్రహమేంటి ఇలా ఉందనుకుంటున్నారా? ఎన్నో విశేషాలు దీని సొంతం.
కొత్త యువ ఓటర్ల నమోదును పెంచేందుకు ఈసీఐ చేపడుతున్న చర్యలకు తాజాగా తీసుకున్న ఈ సరికొత్త నిర్ణయం బాగా ఉపకరిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2022 జనవరిలో ప్రచురించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం ఓటర్ల సంఖ్య 3.03 కోట్లు. 2021 నవంబర్ నుంచి చేపట్టిన ‘స్పెషల్ సమ్మరీ రివిజన్(ఎస్‌ఎస్‌ఆర్)-2022’ అనంతరమే ఈ లిస్టును ఈసీఐ విడుదల చేసింది.
అయితే ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాల్సిన యువత సంఖ్య చాలా ఎక్కువ ఉన్నట్లు గ్రహించిన ఈసీఐ అనూహ్య నిర్ణయాన్ని వెలువరించింది. గతంలో ఓటర్ల లిస్టును ఏటా జనవరి ఫస్టున అప్‌డేట్ చేసేవాళ్లు. దీంతో ఈలోపే ఏదైనా ఎలక్షన్ జరిగితే నవ యువకులు ఓటేసేందుకు వీల్లేకుండాపోయేది. ఈసీఐ అమలుచేయనున్న నూతన నిర్ణయం వల్ల ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఇదిలా ఉండగా ఇప్పటివరకు కొత్తగా 2 లక్షల 27 వేల 226 మంది ఓటర్లుగా నమోదయ్యారు.
అదే సమయంలో దాదాపు అదే సంఖ్యలో(2 లక్షల 26 వేల 997 మంది) ఓటర్ల పేర్లను వివిధ కారణాలతో తొలగించారు. చనిపోయిన, వేరే రాష్ట్రాలకు వెళ్లిన ఓటర్లను తెలంగాణ జాబితా నుంచి తీసేశారు. ఒక ఓటర్‌కి ఒకటికి మించి ఉన్న కార్డులను గుర్తించటానికి ఈసీఐ సాఫ్ట్‌వేర్ సాయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తనిఖీలు చేపట్టింది.
ఈవిధంగా 22.04 లక్షల డూప్లికేట్ ఓటర్ గుర్తింపు కార్డులు ఉన్నట్లు తేల్చింది. అనంతరం 10 లక్షల 25 వేల 987 మంది ఓటర్ల పేర్లను కొట్టేసింది. తెలంగాణ రాష్ట్రం మొత్తమ్మీద అత్యధిక సంఖ్యలో 43 లక్షల 67 వేల 20 మంది ఓటర్లతో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ఏడు జిల్లాల్లో కనీసం 10 లక్షలు, అంతకన్నా ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు.