NTV Telugu Site icon

Forged Visa: ఏజెంట్‌ను నమ్మి మస్కట్‌కు.. తెలంగాణ మహిళ అష్ట కష్టాలు..

Forged Visa

Forged Visa

అదనంగా డబ్బు సంపాదించి, తమ కుటుంబానికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని ఎంతో మంది భావిస్తారు.. ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్తారు.. అయితే, ఇదే సమయంలో.. కొందరు ఏజెంట్ల బారిన పడి.. నిండా మునగడమే కాదు.. జైలులో మగ్గాల్సిన పరిస్థితి.. సంపాదన లేదు.. కుటుంబానికి దూరమై.. జైలులో ఒంటరిగా మగ్గాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.. ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం జిల్లాకు చెందిన మహిళలు నకిలీ వీసా ఏజెంట్ల బారిన పడ్డారు. నకలీ వీసా మోసానికి గురైన పలువురు మహిళలు కేరళలో పట్టుబడి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇలా మోసపోయి జైలుకు పోయిన ఐదుగురిని మానవ హక్కుల సంఘాల ప్రతినిధుల పోరాటం కారణంగా బయటకు రాగా.. మరికొంతమంది జైలులోనే ఉన్నారు.. గల్ఫ్ దేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి మహిళల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన ఏజెంట్లు.. నకిలీ వీసాలతో విమానాల్లో ఎక్కిస్తున్నారు. ఇటీవల కొచ్చి విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ సిబ్బంది పలువురు మహిళల పాస్‌పోర్ట్‌లను తనిఖీ చేసినప్పుడు ఈ నకిలీ వీసాల రాకెట్‌ బాగోతం వెలుగు చూసింది..

అయితే, తెలంగాణలోని కొత్తగూడెంకు చెందిన ఓ బాధితురాలి పరిస్థితి కన్నీరు పెట్టిస్తోంది.. కొత్తగూడెంకు చెందిన విజయలక్ష్మి(40) భర్తను కోల్పోవడంతో.. కుటుంబభారం తనపై పడింది.. ఆమె తల్లి పూలు అమ్మతూ జీవిస్తుండగా.. కుమారుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు.. ఒంటరి తల్లి తన ఏకైక కుమారుడికి మంచి విద్యను అందించడానికి, ఉన్నతస్థానంలో ఉంచడానికి తపనపడింది.. బతుకుదెరువు కోసం తీవ్రంగా ప్రయత్నించింది. డబ్బు సంపాదించి తన బిడ్డను పోషించుకోవడానికి విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకుంది. తన బిడ్డకు అన్ని సుఖాలు ఇవ్వాలని కలలు కంది.. అయితే, అది తనను ఊహించలేని ప్రదేశానికి తీసుకెళ్తుందని ఆమెకు కూడా తెలియదు పాపం..

మహిళలను అక్రమంగా రవాణా చేయడం మరియు గల్ఫ్ దేశాలకు తీసుకువెళ్లడం గురించి విన్నాం.. భారీ జీతాలు అంటూ వాగ్దానం చేస్తారు.. నిబంధనలు అంటూ సంతకాలు తీసుకుంటారు.. వారు దేనికి సంతకం చేశారో వారికి తెలియదు. రోజులో 14, 18 గంటల పాటు పని చేయమని వారిని మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్తారు. పని తర్వాత, వారిని అద్దెకు తీసుకున్న యజమానులు వారి బ్యాంకు ఖాతాలలో డబ్బును జమ చేస్తామని వాగ్దానం చేస్తారు, కానీ, అది కూడా చాలా సార్లు జరగదని ఆరోపణలు ఉన్నాయి.. యజమానులు వారికి జీతం ఇవ్వని లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి అనుమతించని సందర్భాలు ఉన్నాయి. యజమానికి వ్యతిరేకంగా కార్మికుడు తిరగబడితే, వారి పాస్‌పోర్ట్‌లు లాక్కోవడమే కాకుండా గృహనిర్బంధంలో ఉంచిన ఘటనలు కోకొల్లలు..

విజయలక్ష్మి తన కుమారుడిక మంచి జీవితం ఇవ్వాలని భావించింది.. ట్రావెల్ ఏజెంట్ సాయంతో మస్కట్‌కు వెళ్లింది. అయితే, ఆమె వీసా గడువు తేదీని ఏజెన్సీ నకిలీది సృష్టించినందున ఒమన్‌లోని విమానాశ్రయం అధికారులు ఆమెను ఆపారు… ఆ తర్వాత ఆమెను కొచ్చికి పంపారు.. ఎర్నాకులం పోలీస్ స్టేషన్‌లో రిమాండ్ చేశారు. ఏజెంట్ చేసిన మాల్ ప్రాక్టీస్‌గా పోలీసులు భావిస్తున్నారు.. ఇప్పుడు ఆమె జైలులో మగ్గాల్సిన పరిస్థితి వచ్చింది.. కోర్టు విచారణ పూర్తయ్యే వరకు నిరీక్షించాల్సిందే.. ఆమె ఒక్కగానొక్క కొడుకు కూడా ఓదార్చలేని పరిస్థితి.. ఆమె తిరిగి వచ్చే వరకు వేచిచూడడం తప్ప మరో మార్గం లేదు.. అయితే, గుడ్డిగా ఏజెంట్లను నమ్మి విదేశాలకు వెళ్లవొద్దని.. భారత ప్రభుత్వం హెచ్చరించినా.. నిరంతరం ఇలాంటి ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి.. చాలా మంది ప్రజలు ఇప్పటికీ బాధితులుగా మారుతూనే ఉన్నారు.