NTV Telugu Site icon

Telangana Weather Report: వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు

Telangana Rain Alert

Telangana Rain Alert

తెలంగాణలో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి.. కొన్ని ఏళ్ల తర్వాత జులై నెలలో భారీ స్థాయిలో వరదలు ముంచెతాయి.. గోదావరి పరిసర ప్రాంతాలు ఇంకా జల దిగ్భందంలోనే ఉన్నాయి.. భద్రాచలం దగ్గర పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.. అయితే, ఈ నేపథ్యంలో.. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తాజా హెచ్చరికలు జారీ చేసింది.. తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ మరియు వాతావరణ హెచ్చరికలను ఓ సారి పరిశీలిస్తే.. నిన్న ఒడిశా తీరం, పరిసర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం ఈ రోజు వాయువ్య బంగాళాఖాతంలోని ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరంలో కొనసాగుతూ ఉంది. ఈ అల్పపీడనంకి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉందని.. దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

రాగల 3 రోజులకు వాతావరణ సూచనల విషయానికి వస్తే.. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని చోట్ల రేపు మరియు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షములు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. ఇక, రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలో భారీ వర్షాలు ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలలో అక్క డక్కడ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం. కాగా, భద్రాచలం దగ్గర గోదావరిలో నీటి ఉధృతి కొనసాగుతూనే ఉంది.. ఇంకా 70 అడుగులకు పైగానే ప్రవాహం ఉండడంతో.. చాలా ప్రాంతాల్లో నీటిలో మునిగిపోయాయి.. ఇళ్లను, గూడాలను వదిలి.. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు ప్రజలు. సరైన సౌకర్యాలు లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక, భద్రాచలంలో సుభాష్‌నగర్‌ కాలనీవాసులు ఆందోళన దిగారు.. గోదావరి కరకట్టను పొడిగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.. వారితో అధికారులు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి.. కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని ఆర్డీవో హామీ ఇచ్చినా ఆందోళన విరమించలేదు.. మరోవైపు.. బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే పోడెం వీరయ్యతో వాగ్వాదానికి దిగారు స్థానికులు.. దీంతో, బాధితులతో కలిసి బైఠాయించారు ఎమ్మెల్యే పోడెం.. వెంటనే మంత్రి పువ్వాడ అజయ్‌ ఘటనా స్థలానికి రావాలని.. కరకట్టపై హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.. అప్పటి వరకు కదిలేది లేదని హెచ్చరిస్తున్నారు.