Telangana Rising Global Summit : హైదరాబాద్‌లో జరగనున్న రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్‌కు పోలీసు శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. సమ్మిట్‌ను సురక్షితంగా నిర్వహించేందుకు దాదాపు 6 వేల మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నంబర్ 14 నుంచి సమ్మిట్ ప్రధాన వేదిక వరకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నామని వెల్లడించారు.
సమ్మిట్ వేదికను ఇప్పటికే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపారు. సమ్మిట్‌కు వచ్చే అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రముఖులు, విదేశీ ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో ఎలాంటి భద్రతా లోటు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
భద్రతా చర్యలలో భాగంగా గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బలగాలను రంగంలోకి దించారు. ప్రధాన ప్రాంగణం పూర్తిగా ఆక్టోపస్ ఆధీనంలో ఉండనుండగా, ప్రధాన వేదికతో పాటు ఇతర ప్రాంగణాల్లోనూ విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. అన్ని ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్‌లతో గాలింపులు నిర్వహిస్తున్నారు. అధునాతన సాంకేతికతను వినియోగిస్తూ గ్లోబల్ సమ్మిట్‌కు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ప్రధాన వేదిక వరకు డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ప్రధాన వేదిక చుట్టూ నలువైపులా ప్రత్యేక డ్రోన్ నిఘా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
సమ్మిట్ ప్రాంగణంలో ప్రత్యేకంగా అధునాతన కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. వందలాది సీసీ కెమెరాల ద్వారా సమ్మిట్ మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి 24 గంటల పాటు నిఘా కొనసాగించనున్నారు. ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలతో పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోందని అధికారులు వెల్లడించారు.
