Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..

Land Ratess

Land Ratess

తెలంగాణ రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో కీలక మార్పు చోటుచేసుకోబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా సవరించిన భూముల మార్కెట్ విలువలు ఈ నెల 5వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార అండ్ పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారికంగా ప్రకటించారు. క్షేత్రస్థాయిలో వాస్తవ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ విలువలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాలను తొలగించి, అత్యంత శాస్త్రీయంగా, హేతుబద్ధంగా ఈ కొత్త ధరలను నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు ప్రముఖ ఆర్థిక నిపుణుడు అరవింద్ సుబ్రమణ్యం ఇచ్చిన నివేదికను, ఉన్నతాధికారుల సలహాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2021-22లో ఎలాంటి క్షేత్రస్థాయి అధ్యయనం లేకుండా కేవలం ఆరు నెలల వ్యవధిలోనే రెండుసార్లు అశాస్త్రీయంగా ధరలను పెంచిందని, దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ రేటు కంటే ప్రభుత్వ విలువలు భారీగా పెరిగాయని మంత్రి విమర్శించారు. ఈ అసమానతలను సరిదిద్దేందుకు రాష్ట్రంలోని మొత్తం 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో మార్కెట్ విలువల సవరణ చేపట్టారు.

×
×
Ad

ఈ కొత్త విలువల నిర్ణయంలో పారిశ్రామికాభివృద్ధి, కొత్త రహదారులు, ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్, మౌలిక వసతుల విస్తరణ వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకున్నారు. ఇప్పటికే అధిక రేట్లు ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి పెంపుదల చేయలేదు. అలాగే, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లలో అంతస్తుల వారీగా ఉన్న అసమానతలను తొలగించి అన్ని అంతస్తులకు ఒకే రేటు వర్తింపజేశారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ పరిధిలోని వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఫ్లాట్లకు కనీస ప్రాథమిక రేట్లను కూడా ఖరారు చేశారు.

మరోవైపు.. గత ఐదేళ్లలో నిర్మాణ సామగ్రి ధరలు, కార్మికుల వేతనాలు పెరిగిన నేపథ్యంలో 2021 తర్వాత మొదటిసారిగా నిర్మాణ వ్యయాల రేట్లను కూడా సవరించారు. అనేక పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారిన నేపథ్యంలో ఆర్‌సీసీ, నాన్-ఆర్‌సీసీ నిర్మాణాల రేట్లను గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు అనుగుణంగా మార్చారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, భూ లావాదేవీలలో పారదర్శకతను పెంచుతూ, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.