Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!

  • పులిచింతల పవర్ ప్లాంట్‌ను పరిశీలించిన భట్టి విక్రమార్క
  • రాష్ట్రంలో సరికొత్త రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్
  • ఎల్‌నినో ప్రభావంతో 4 వేల మెగావాట్ల జలవిద్యుత్ తగ్గుదల
  • విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేస్తున్న సంస్థలు
Bhatti Vikramarka

Bhatti Vikramarka

సూర్యాపేట జిల్లాలోని పులిచింతల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సందర్శించారు. ఈ సందర్భంగా ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని, ఇప్పటివరకు జరిగిన విద్యుత్ ఉత్పత్తి వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం యూనిట్ కంట్రోల్ రూమ్‌ను స్వయంగా పరిశీలించిన డిప్యూటీ సీఎం, ప్రాజెక్టు నిర్వహణ, విద్యుత్ ఉత్పత్తి తీరుపై అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను తిలకించారు.

20 వేల మెగావాట్లకు చేరిన విద్యుత్ డిమాండ్

అనంతరం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్రంలో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగి సరికొత్త రికార్డులను తాకుతోందని తెలిపారు. గతంలో ఇదే సమయంలో రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ (పీక్ డిమాండ్) 15,000 మెగావాట్లుగా ఉండగా, ప్రస్తుతం అది ఏకంగా 20,000 మెగావాట్లకు చేరుకుందని వెల్లడించారు. ఎల్‌నినో ప్రభావం, తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా జల విద్యుత్ ఉత్పత్తి సుమారు 4,000 మెగావాట్ల మేర తగ్గిందని, పెరిగిన డిమాండ్ , తగ్గిన ఉత్పత్తిని కలిపి విద్యుత్ వ్యవస్థపై మొత్తంగా 8,000 మెగావాట్ల అదనపు భారం పడిందని వివరించారు.

అదనపు భారమైనా నిరంతర సరఫరా.. విద్యుత్ సంస్థల సమర్థత

వ్యవస్థపై ఇంతటి భారీ భారం పడినప్పటికీ, రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా సమర్థవంతంగా నిర్వహణ సాగిస్తున్నామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ముఖ్యంగా గృహ వినియోగదారులకు 24 గంటల పాటు ఎలాంటి అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని చెప్పారు. జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గినా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్‌ను సమకూర్చుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థలు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయని భట్టి విక్రమార్క అభినందించారు.