Marpally : పంచాయతీరాజ్ శాఖలో కీలక మార్పు.. మర్పల్లి ఇక వికారాబాద్ డివిజన్‌లో

  • పంచాయతీరాజ్ కార్యాలయాల పరిధుల్లో సవరణ
  • మర్పల్లి PRSD ఇక వికారాబాద్ డివిజన్‌లోకి
  • తాండూర్ డివిజన్ నుంచి మర్పల్లి మార్పు
  • G.O.Ms.No.32తో కొత్త పరిపాలనా పరిధులు
Marpalli

Marpalli

తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలోని కొన్ని కార్యాలయాల పరిధులను మారుస్తూ జీవో 32 జారీ చేసింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో చీఫ్ ఇంజనీర్ కార్యాలయాలు, సర్కిళ్లు, డివిజన్లు, సబ్ డివిజన్ల పరిధులను సవరించే క్రమంలో ఈ మార్పులు చేసింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వులను పరిశీలించిన అనంతరం కొన్ని కార్యాలయాల పరిధుల్లో మార్పులు అవసరమని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పలు మండలాల పరిధిని ఒక డివిజన్ నుంచి మరో డివిజన్‌కు మారుస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

 

ముఖ్యంగా తాండూర్ పంచాయతీరాజ్ డివిజన్ పరిధిలో ఉన్న మర్పల్లి పంచాయతీరాజ్ సబ్ డివిజన్ (PRSD)ను ఇకపై వికారాబాద్ పంచాయతీరాజ్ డివిజన్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇప్పటివరకు తాండూర్ డివిజన్ పరిధిలో ఉన్న మర్పల్లి, తాజా ఉత్తర్వులతో వికారాబాద్ డివిజన్ పరిధిలోకి మారనుంది. దీంతో వికారాబాద్ పంచాయతీరాజ్ డివిజన్ పరిధిలో కుల్కచర్ల, పరిగి, వికారాబాద్-1, వికారాబాద్-2తో పాటు మర్పల్లి PRSD కూడా ఉండనుంది. ఈ మార్పుల ద్వారా ఆయా ప్రాంతాల్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ పనుల పర్యవేక్షణ, కార్యాలయాల పరిపాలనా పరిధుల్లో సవరణలు చోటుచేసుకోనున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి.