Oil Palm Cultivation : తెలంగాణలో ఆయిల్‌పామ్‌ దూకుడు.. రైతులకు ‘మహా కారిడార్’ ప్లాన్

  • ఆయిల్‌పామ్ కారిడార్
  • రైతులకు మార్కెట్ భరోసా
  • రిలయన్స్ క్షేత్రస్థాయి పరిశీలన
  • 30 ఏళ్ల స్థిర ఆదాయం
Oil Palm Cultivation

Oil Palm Cultivation

తెలంగాణలో పంటల వైవిధ్యీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఊపిరి పోస్తోంది. నిరంతరం వరి సాగుపైనే ఆధారపడటాన్ని తగ్గించి, రైతులకు అత్యంత లాభదాయకమైన ఆయిల్‌పామ్ సాగును విస్తరించడానికి భారీ కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను అనుసంధానిస్తూ ఒక భారీ ‘ఆయిల్‌పామ్ కారిడార్’ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ దిశగా సూర్యాపేట జిల్లాలో ఒక ఇంటిగ్రేటెడ్ ఆయిల్‌పామ్ హబ్ ఏర్పాటు చేసేందుకు ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఆసక్తి చూపింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు , కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఉన్నతస్థాయి బృందం నిర్వహించిన కీలక సమావేశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. కోదాడ , హుజూర్‌నగర్ ప్రాంతాలను ఆయిల్‌పామ్ ప్లాంటేషన్ , ప్రాసెసింగ్ క్లస్టర్‌కు ప్రారంభ కేంద్రంగా ఎంచుకోవాలని మంత్రులు సూచించారు.

‘ఫార్మ్ టు ఇండస్ట్రీ’ విధానంతో రైతులకు మార్కెట్ భరోసా

తోటల పెంపకం నుంచి ప్రాసెసింగ్, రిఫైనరీ , సబ్బులు, పారిశ్రామిక ఉత్పత్తుల తయారీ వరకు పూర్తిస్థాయి ‘ఫార్మ్ టు ఇండస్ట్రీ’ వ్యవస్థను నెలకొల్పడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్ నుండి క్రూడ్ పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ ఉత్పత్తి చేసేలా సకల సౌకర్యాలు కల్పిస్తే రైతులకు నిరంతర మార్కెట్ భరోసా లభిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రైతును వరి నుంచి మరో పంట వైపు మళ్లించాలంటే కేవలం సూచనలు ఇస్తే సరిపోదని, వరి కంటే మెరుగైన ఆదాయంతో పాటు పంట చేతికొచ్చిన వెంటనే కొనుగోలు చేసే వ్యవస్థ సిద్ధంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయిల్‌పామ్ తోట ఒకసారి స్థిరపడితే దాదాపు 30 సంవత్సరాల పాటు రైతుకు నిలకడైన ఆదాయం లభిస్తుందని అధికారులు వెల్లడించారు.

సాగునీటి ఒత్తిడి తగ్గడమే కాకుండా ప్రభుత్వ భారం అవుతుంది మాయం

ఎల్‌నినో పరిస్థితులు , వర్షపాతంలో అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత తరుణంలో తక్కువ నీటితో పండే ఆయిల్‌పామ్ వనరులను సద్వినియోగం చేసుకుంటుంది. దీనివల్ల జలాశయాలపై , సాగునీటి వనరులపై ఒత్తిడి తగ్గడంతో పాటు, వరి ధాన్యం కొనుగోలు, రవాణా, మిల్లింగ్ , నిల్వపై ప్రతి ఏటా ప్రభుత్వంపై పడుతున్న వేల కోట్ల రూపాయల భారాన్ని కూడా క్రమంగా తగ్గించవచ్చు. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్ (NMEO-OP) వచ్చిన తర్వాత తెలంగాణలో ఈ సాగు శరవేగంగా విస్తరిస్తోంది. గతంలో కేవలం 46 వేల ఎకరాల్లో ఉన్న ఈ సాగు, ప్రస్తుతం 3.12 లక్షల ఎకరాలకు పైగా విస్తరించి దాదాపు 65 వేల మందికి పైగా రైతులకు జీవనోపాధిని అందిస్తోంది. అందుకోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 515 కోట్ల కంటే ఎక్కువ సబ్సిడీలను అందించింది.

రిలయన్స్ క్షేత్రస్థాయి అధ్యయనం , జాతీయ లక్ష్యం

సూర్యాపేట జిల్లాలో ఇప్పటికే దాదాపు 5,753 ఎకరాల్లో తోటలు విస్తరించగా, భారీ ప్రాసెసింగ్ యూనిట్‌కు అవసరమైన ముడిసరుకు కోసం సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలను కలుపుతూ ప్రత్యేక అధ్యయనం చేయనున్నారు. రిలయన్స్ ప్రతినిధుల బృందం త్వరలోనే ఆయా జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి తోటల ఉత్పాదకత, నర్సరీలు, రవాణా సౌకర్యాలను పరిశీలించనుంది. ఈ ప్రణాళికలు పూర్తిగా కార్యరూపం దాల్చితే తెలంగాణ ‘ఫార్మ్ టు ఇండస్ట్రీ ఆయిల్‌పామ్ కారిడార్’కు కేంద్రబిందువుగా మారనుంది. అంతేకాకుండా, విదేశాల నుంచి వంటనూనెల దిగుమతులపై భారతదేశం ఆధారపడటాన్ని తగ్గించాలనే జాతీయ లక్ష్యంలో తెలంగాణ రాష్ట్రం అత్యంత కీలక పాత్ర పోషించనుంది.