CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం

  • ప్రపంచంతో పోటీపడేలా కొత్త విద్యా విధానం
  • విద్యా బడ్జెట్‌ను 15 శాతానికి పెంచే లక్ష్యం
  • కేకే నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు
  • గ్లోబల్ స్టాండర్డ్స్‌తో విద్యలో సంస్కరణలు
Cm Revanth

Cm Revanth

తెలంగాణ శాసనసభలో విద్యాశాఖపై జరిగిన సమగ్ర చర్చ సభలో ఒక శుభపరిణామమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. శాసనసభ వేదికగా విద్యా వ్యవస్థ బలోపేతం , ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. విద్య ఒక్కటే మానవ జీవితాల్లో శాశ్వత వెలుగులను నింపుతుందని సంపూర్ణంగా నమ్ముతున్నానని, శాసనసభలోని సభ్యులు ఇచ్చే విలువైన సూచనలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

నెహ్రూ వేసిన పునాదులే నేటి విద్యావ్యవస్థకు మూలం

దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ విద్య , నీటిపారుదల రంగాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. దేశంలోని నేటి ప్రముఖ విద్యాసంస్థలన్నీ నెహ్రూ వేసిన బలమైన పునాదులపైనే నిర్మితమయ్యాయని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో నేడు అందుబాటులో ఉన్న మెజారిటీ యూనివర్సిటీలు కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే ఏర్పాటు చేసినవని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ‘సీపెక్’ సర్వేలోనూ ఆస్తులు, అంతస్తులు లేకపోవడం సామాజిక వెనుకబాటుతనానికి కారణం కాదని, కేవలం విద్య లేకపోవడమే దానికి ప్రధాన కారణమని తేలిందని వెల్లడించారు. ప్రపంచంతో పోటీ పడాలంటే విద్యావిధానంలో తీసుకురావాల్సిన మార్పులపై విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.

విద్యారంగ బడ్జెట్ 15 శాతానికి పెంపే లక్ష్యం: కేకే కమిటీ ఏర్పాటు

ప్రపంచ పోటీకి తట్టుకునేలా తెలంగాణ నూతన విద్యా విధానాన్ని రూపొందించేందుకు ఇప్పటికే విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. విద్యా కమిషన్ అందించిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించేందుకు సీనియర్ నాయకులు కే కేశవరావు నేతృత్వంలో ప్రత్యేక కమిటీని నియమించినట్లు చెప్పారు. సభ్యులెవరైనా తమ సూచనలు, సలహాలను కేశవరావు కమిటీకి అందిస్తే ప్రభుత్వం స్వీకరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో విద్యారంగానికి బడ్జెట్‌లో కేటాయింపులను 15 శాతానికి పెంచడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం వివరించారు.

విద్యాశాఖ నా వద్ద ఉండటం గర్వకారణం: బీజేపీ ఎమ్మెల్యేకు కౌంటర్

శాసనసభలో ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రి లేరని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖను నిర్వహిస్తున్నారంటే ఆ రంగానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రిగా తాను విద్యాశాఖపై సమీక్ష నిర్వహిస్తే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం , సిస్టమ్ అంతా సమిష్టిగా అందులో భాగమవుతుందని చెప్పారు. తనకు ఈ శాఖపై ప్రత్యేక ప్యాషన్ ఉందని, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందనే నమ్మకంతోనే విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్నానని తెలిపారు. తాను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏకంగా 86 వేలకు పెరిగిందని, ఇది తన పనితీరుకు ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు.

కేటాయింపుల పెంపు , ఉద్యోగాల భర్తీ

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే తమ ప్రభుత్వం విద్యా రంగానికి కేటాయింపులను రికార్డు స్థాయిలో పెంచిందని సీఎం రేవంత్ రెడ్డి గణాంకాలతో వివరించారు. 2023-24 బడ్జెట్‌లో గత ప్రభుత్వం విద్యాశాఖకు రూ. 19,093 కోట్లు కేటాయిస్తే, తమ ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌లో ఆ మొత్తాన్ని రూ. 21,292 కోట్లకు పెంచిందని తెలిపారు. అలాగే 2025-26 బడ్జెట్‌లో రూ. 23,108 కోట్లకు, 2026-27 బడ్జెట్‌లో రూ. 26,647 కోట్లకు పెంచామని, కేవలం మూడేళ్ల వ్యవధిలోనే విద్యా శాఖ బడ్జెట్‌ను రూ. 7,554 కోట్లకు పెంచామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే, అదీ కేవలం 55 రోజుల వ్యవధిలోనే ఎలాంటి చిన్న ఆరోపణలకు తావులేకుండా పారదర్శకంగా 10,006 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో కేవలం 7,857 టీచర్ పోస్టులను మాత్రమే భర్తీ చేసిందని ఎద్దేవా చేశారు.

భవిష్యత్ తరాల కోసం గ్లోబల్ ప్రాక్టీసెస్

ప్రస్తుత జెన్ ఆల్ఫా, జెన్ బీటా తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్లోబల్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా విద్యా విధానాన్ని రూపొందిస్తున్నట్లు సీఎం తెలిపారు. మనుషుల తలరాతలను మార్చే శక్తి విద్యకే ఉందని నమ్మి ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ విద్యా పద్ధతులను తెలంగాణకు తీసుకొస్తున్నామని చెప్పారు. పాలిటెక్నిక్ కాలేజీల జీవో ఎంఎస్ నెం. 97 వంటి కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు వివాదాలు రావడం సహజమేనని, అయితే విద్యార్థుల భవిష్యత్తే తమకు అంతిమ ప్రాధాన్యమని సీఎం పునరుద్ఘాటించారు.