Site icon NTV Telugu

KTR counter to Amit Shah: అప్పట్లో పటేల్‌ విలీనం కోసం.. ఇప్పుడు అమిత్‌ షా విచ్ఛిన్నం కోసం వచ్చిండు

Ktr Sirisilla

Ktr Sirisilla

తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్చ పొందడానికి ఆనాటి యావత్ సమాజం ఉద్యమించిందని..ఆనాటి అపూర్వ ఘట్టాలు జాతి జీవనంలో నిరంతరం సజీవంగా నిలుస్తాయని ఐటీ, మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ అన్నారు. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల కలెక్టరేట్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో వైభవంగా నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ పరోక్షంగా చురకలంటించారు.

ఓ కేంద్రమంత్రి 74 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రజలను భారత యూనియన్ లో విలీనం చేసి సమైక్యతను చాటారు. ఈ రోజు ఓ కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజలను విభజించి, బెదిరింపులకు పాల్పడేందుకు వచ్చారని ఆరోపించారు. అందుకే దేశానికి కావల్సింది నిర్ణయాత్మక విధానాలేనని, విభజన రాజకీయాలు కావని ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అమిత్ షా జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై పలు కామెంట్లు చేశారు. ఎన్నికల ప్రచారంలో.. ఉద్యమాల్లో హామీ ఇచ్చారని కానీ అమలు చేయలేదని పరోక్షంగా కేసీఆర్ సర్కార్‌ను విమర్షించిన అమిత్‌ షా.. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణాలోని కొన్ని ప్రాంతాలకు సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా విమోచన దినోత్సవం నిర్వహించలేదని మండిపడ్డారు. విమోచన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయని అన్నారు. అయితే.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తుందనే, వివిధ పేర్లతో కొందరు విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. అయితే.. ఎవరి త్యాగాల వల్ల అధికారంలో ఉన్నారో, వారికి శ్రద్ధాంజలి వహించకపోతే తెలంగాణకు ద్రోహం చేసినట్లు అని, పరోక్షంగా కేసీఆర్ ను విమర్శించారు. ఈఏడాది హైదరాబాద్‌ విమోచన దినోత్సవం నిర్వహించాలని ప్రధాని మోదీ ఆదేశించారని అమిత్‌ షా పేర్కొన్నారు.

Exit mobile version