తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. మొత్తం 116 మున్సిపాలిటీలు , 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 52,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ప్రధాన ఘట్టాలు కింది విధంగా ఉన్నాయి..
Online Dating App Scam: దూల తీర్చేసిన డేటింగ్ యాప్.. గంట ముచ్చటకి నెల జీతం హాంఫట్!
ఎన్నికల కీలక షెడ్యూల్
- నామినేషన్ల స్వీకరణ: జనవరి 28, 2026 నుంచి జనవరి 30, 2026 సాయంత్రం 5:00 గంటల వరకు.
- నామినేషన్ల పరిశీలన (Scrutiny): జనవరి 31, 2026.
- నామినేషన్ల ఉపసంహరణ గడువు: ఫిబ్రవరి 3, 2026 మధ్యాహ్నం 3:00 గంటల వరకు.
- పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 11, 2026 (ఉదయం 7:00 నుండి సాయంత్రం 5:00 వరకు).
- రీ-పోలింగ్ (అవసరమైతే): ఫిబ్రవరి 12, 2026.
- ఓట్ల లెక్కింపు , ఫలితాలు: ఫిబ్రవరి 13, 2026.
నేటి నుంచే ఎన్నికల కోడ్ అమలు
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తక్షణమే రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct) అమల్లోకి వచ్చింది. అక్రమాలను అరికట్టేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్లు రంగంలోకి దిగాయని ఏడీజీ మహేష్ భగవత్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నగదు రవాణాపై పోలీసులు కఠిన నిబంధనలు విధించారు.. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వ్యక్తులు గరిష్టంగా ₹50,000 వరకు మాత్రమే నగదును వెంట తీసుకెళ్లాలి. రూ.50,000 కంటే ఎక్కువ నగదు ఉంటే తప్పనిసరిగా సరైన ఆధారాలు చూపించాలి, లేని పక్షంలో ఆ నగదును సీజ్ చేస్తారు. పోలీసులు నగదు లేదా ఇతర వస్తువులను సీజ్ చేసినప్పుడు తప్పనిసరిగా రిసీట్ ఇస్తారు. దానిపైనే అప్పీల్ చేసుకునే వివరాలు కూడా ఉంటాయి.
భద్రతా ఏర్పాట్లు , నిఘా
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ పోలీసులతో పాటు ఫారెస్ట్ , ఎక్సైజ్ శాఖల నుంచి సుమారు 2,000 మంది అదనపు సిబ్బందిని వినియోగిస్తున్నారు. పారదర్శకత కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్ కాస్టింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. హైపర్ సెన్సిటివ్ , క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలతో నిఘా ఉంచుతారు. రౌడీ షీటర్లను బైండోవర్ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఓటర్లందరూ ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, నిర్భయంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ , పోలీస్ శాఖ విజ్ఞప్తి చేశాయి.
