Site icon NTV Telugu

Municipal Elections: ముగిసిన ప్రచార పర్వం.. 11న పోలింగ్.. వివరాలు ఇలా.!

Municipal Elections

Municipal Elections

Telangana municipal elections 2026 : తెలంగాణ రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రచార పర్వం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు , 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. అధికార , ప్రతిపక్ష పార్టీలు తమ సత్తా నిరూపించుకునేందుకు ఈ ఎన్నికలను సెమీఫైనల్స్‌గా భావిస్తున్నాయి. అగ్రనేతల పర్యటనలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారంతో ఇన్నాళ్లూ మార్మోగిన వీధులన్నీ ఇప్పుడు నిశ్శబ్దంగా మారాయి. ఫిబ్రవరి 11న జరగనున్న పోలింగ్‌లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Samsung 55inch TV Offer: రూ.81,900 టీవీ ఇప్పుడు కేవలం రూ.45,990లకే.! టాప్ ఫీచర్స్ కూడా..!

ఈ ఎన్నికల్లో ఓటర్ల బలం గణనీయంగా ఉంది. మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 2,996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి మొత్తం 52,43,023 మంది ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 25,62,639 కాగా, 26,80,014 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం ఈ ఎన్నికల్లో కీలక పరిణామంగా కనిపిస్తోంది. వీరితో పాటు మరో 640 మంది ఇతర ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,195 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల కోసం 16,031 బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధం చేశారు. పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు 1,379 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు (RO), 1,547 మంది సహాయ రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారు. క్షేత్రస్థాయిలో 9,560 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు (PO), 31,428 మంది ఇతర సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను భద్రపరచడానికి 137 స్ట్రాంగ్ రూమ్‌లు, ఫలితాల లెక్కింపు కోసం 136 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు.

ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. సుమారు 25,000 మంది పోలీసు సిబ్బందితో రాష్ట్రవ్యాప్తంగా నిఘా పెంచారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. ఎన్నికల ప్రక్రియలో పూర్తి పారదర్శకతను పాటించేందుకు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్ కాస్టింగ్ సదుపాయాన్ని కల్పించారు. దీని ద్వారా ఎన్నికల సంఘం అధికారులు నేరుగా పోలింగ్ సరళిని పర్యవేక్షించవచ్చు. మొత్తం 12,993 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి.

ఫిబ్రవరి 11న పోలింగ్ ముగిసిన తర్వాత, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఫిబ్రవరి 14న మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్లతో పాటు మున్సిపల్ చైర్మన్ , డిప్యూటీ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది. చివరగా ఫిబ్రవరి 16న కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, ప్రత్యేక సమావేశంతో ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.

Hydra Demolition : నార్సింగిలో హైడ్రా కూల్చివేతలు

Exit mobile version