తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి 2026 సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారికంగా విడుదల చేశారు. ఈ ఎన్నికల ప్రక్రియ ద్వారా మొత్తం 52 లక్షల 43 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కమిషనర్ ఈ సందర్భంగా కోరారు.
UGC Protests: యూజీసీ కొత్త నిబంధనలపై నిరసనలు.. అసలేం జరిగిందంటే..!
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, జనవరి 28వ తేదీ (బుధవారం) నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను జనవరి 30వ తేదీ సాయంత్రం 5:00 గంటల వరకు దాఖలు చేయవచ్చు. జనవరి 31న నామినేషన్ల పరిశీలన చేపట్టి, అదే రోజు సాయంత్రం అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 3:00 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అనంతరం తుది బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు.
ముఖ్యమైన తేదీలు ఇవే:
- నామినేషన్ల ప్రారంభం: 28.01.2026 (ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 వరకు).
- నామినేషన్ల ముగింపు: 30.01.2026 (సాయంత్రం 5:00 గంటల వరకు).
- పోలింగ్ తేదీ: 11.02.2026 (ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు).
- ఓట్ల లెక్కింపు: 13.02.2026 (ఉదయం 8:00 గంటల నుంచి).
- ఫలితాల ప్రకటన: ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలు వెల్లడిస్తారు.
