NTV Telugu Site icon

యాసంగి వడ్లపై కేంద్రం క్లారిటీ.. తెలంగాణకు నిరాశ..

వడ్లు కొనుగోలు వ్యవహారంలో గత కొంత కాలంగా కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తోంది.. కేంద్రం చెప్పేది ఒక్కటైతే.. రాష్ట్ర నేతలు మాత్రం రైతులను తప్పుదోవపట్టిస్తున్నారని టీఆర్ఎస్‌ ఆరోపిస్తుంటే.. కేంద్రం స్పష్టంగా చెప్పినా.. టీఆర్ఎస్‌ ప్రభుత్వమే డ్రామా చేస్తుందని బీజేపీ విమర్శిస్తుందో.. ఇక, దీనిపై మరింత క్లారిటీ కోసం ఢిల్లీ వెళ్లిన తెలంగాణ మంత్రుల బృందానికి నిరశే ఎదురైంది.. తెలంగాణ‌లో యాసంగిలో పండించే వ‌డ్ల కొనుగోలుపై కేంద్రం నిరాశే మిగిల్చింది. యాసంగి వ‌డ్లను కొనేందుకు కేంద్రం సిద్ధంగా లేద‌ని కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ మంత్రుల బృందం నిరాశ‌తోనే వెనుదిర‌గాల్సిన పరిస్థితి.

హస్తిన వెళ్లిన తెలంగాణ మంత్రులు సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి, ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు, మ‌ల్లారెడ్డితో పాటు ఎంపీలు నామా నాగేశ్వర రావు, బీబీ పాటిల్, సురేశ్ రెడ్డి… కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌తో సమావేశం అయ్యారు.. ఈ సందర్భంగా యాసంగిలో వ‌రి ధాన్యం సేక‌ర‌ణ‌పై చ‌ర్చించారు. కానీ.. కేంద్ర ప్రభుత్వం నుంచి ధాన్యం కొనుగోలుపై సానుకూల నిర్ణయం రాలేదని చెబుతున్నారు మంత్రులు. కాగా, ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల మార్కెట్‌ యార్డులు, రోడ్లపై కూడా వరి ధాన్యం దర్శనమిస్తోంది.. కేంద్రం, రాష్ట్రం మధ్య వైరంతో కొనుగోళ్లలో గందరగోళ పరిస్థితి నెలకొంది.