వ్యాక్సినేషన్ విషయంలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు.. సిద్దిపేటలో హై రిస్క్ పర్సన్స్ కి వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యాక్సిన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనాలోచిత, అసందర్భ, తప్పుడు నిర్ణయాలతో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.. వ్యాక్సిన్ల విషయంలో అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు అనేరీతిలో కేంద్రం వ్యవహారం ఉందన్న ఆయన.. రాష్ట్రాలకు అవసరమైన వ్యాక్సిన్లను కేంద్రం ఉచితంగా సరఫరా చేయడం లేదని.. మరోవైపు కంపెనీలు, ఇతర దేశాల నుంచి దిగుమతి కూడా చేసుకోనివ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. తెలంగాణలో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్లను కూడా కంపెనీల నుంచి మనం కొనుక్కునే పరిస్థితి లేకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న మంత్రి హరీష్.. కేంద్రం తప్పుల మీద తప్పులు చేస్తూ.. రాష్ట్రాలను బద్నాం చేసేలా వ్యవహరిస్తోందన్నారు.
వ్యాక్సినేషన్ సకాలంలో పంపిణీ చేయడంలో కేంద్రం ఫెయిల్ అయ్యిందన్నారు హరీష్‌రావు.. వ్యాక్సిన్ పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను పున సమీక్షించుకోవాలని సూచించిన ఆయన.. వ్యాక్సినేషన్ దిగుమతిని సరళతరం చేయాలన్నారు.. రాష్ట్ర ప్రభుత్వాలే ప్రాధాన్యత క్రమాలను నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించాలని.. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ను కంపెనీలు ,ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.. కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాల కొనుగోలుకు ఇప్పటికే ఆయా కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం రూ. 100 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చిందన్నారు హరీష్.. కానీ, రాష్ట్రాలకు కేటాయించే వ్యాక్సిన్లు ఎన్ని ఇవ్వాలో కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయిం చడం వల్ల.. కంపెనీలు టీకాలను తెలంగాణకు ఇవ్వలేక పోతున్నాయని తెలిపారు.