NTV Telugu Site icon

Harish Rao: చాకలి ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణ కోసం కేసీఆర్‌ పోరాటం..

వీరవనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తితో సీఎం కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినట్టు వెల్లడించారు మంత్రి హరీష్‌రావు.. మెదక్ లోని జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన రజకుల ఆత్మగౌరవ సభలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 33 జిల్లాల్లో రెండేసి కోట్లతో మోడ్రన్ దోబీ ఘాట్ లు నిర్మిస్తామని తెలిపారు. వృత్తి పైనా ఆధారపడ్డ రజకులకు, నాయి బ్రాహ్మణులకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని గుర్తుచేసిన ఆయన.. 80 శాతం సబ్సిడీతో రజకులకు సబ్సిడీ లోన్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇక, మెదక్‌లో రజకుల కమ్యూనిటీ హాల్ కోసం రెండు ఎకరాలు కేటాయించామని.. కోటి రూపాయలతో జిల్లా కేంద్రంలో ఫంక్షన్ హాల్ నిర్మిస్తామని వెల్లడించారు.

మరోవైపు, రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే విషయంపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతానని తెలిపారు మంత్రి హరీష్‌రావు.. ఇక, మెదక్‌లో 500 పడకల హాస్పిటల్ ను నెలకొల్పుతామన్న ఆయన.. మెదక్ కు మెడికల్ కాలేజీ తో పాటు నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని.. 60 ఏళ్ల కాంగ్రెస్‌, టీడీపీ పాలనలో మూడే మెడికల్ కాలేజీలు వచ్చాయని.. ఆరేళ్లలో తెలంగాణలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు మంత్రి హరీష్‌రావు.