వరల్డ్ వాటర్‌ఫాల్ రాప్లింగ్ మూడో విడత పోటీలకు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చో్డ మండలంలోని గుండివాగు వద్ద 330 అడుగుల ఎత్తున్న గాయత్రి జలపాతంలో ఈ పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీలలో 30కిపైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 33 టీవీ ఛానెల్స్ ఈ పోటీలను టెలికాస్ట్ చేస్తాయని చెప్పారు. ఉవ్వెత్తున దూకే జలపాత ధారల్లో తాడు సాయంతో పై నుంచి (స్ట్రెయిట్ పాయింట్) కిందకు (ఫినిష్ పాయింట్)కు చేరడాన్నే వాటర్‌ఫాల్ రాప్లింప్ అంటారు. ప్రపంచంలోని చాలా దేశాలు అడ్వెంచర్ టూరిజంలో భాగంగా సాహసాలు చేసేవారి కోసం ఈ పోటీలను నిర్వహిస్తున్నాయి.
Read Also: Godavari River Floods: 32 ఏళ్ల తర్వాత 70 అడుగులు.. నీట మునిగిన 95 గ్రామాలు
కాగా కరోనా కారణంగా ఏడాది విరామం తర్వాత ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. గతంలో రెండు ప్రపంచ వాటర్ ఫాల్ రాప్లింగ్ పోటీలు 2019, 2020లో ఏపీ అరకులోయలోని 420 అడుగుల కటిక జలపాతం వద్ద జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టూరిజం శాఖ ప్రోత్సాహం, ఐటీడీఏ వారి పూర్తి సహకారంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని వాటర్ ఫాల్ రాప్లింప్ వరల్డ్ కప్ ఆర్గనైజింగ్ కమిటీ వ్యవస్థాపకుడు రంగారావు పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో తెలంగాణ అడ్వెంచర్ టూరిజంలో దేశంలోనే మొదటిస్థానంలో నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.