Site icon NTV Telugu

Telangana Inter Exams : విద్యార్థులకు అలర్ట్.. షెడ్యూల్ వచ్చేసింది..!

Inter Exams

Inter Exams

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈసారి ఇంటర్ పరీక్షలు మామూలుగా మార్చిలో కాకుండా ముందుగానే ఫిబ్రవరిలోనే ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరగనున్నాయని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య వెల్లడించారు. ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం విద్యార్థులు JEE మెయిన్, EAPCET (EAMCET), NEET వంటి పోటీ పరీక్షలకు సులభంగా సిద్ధం కావడానికి ఎక్కువ సమయం దొరకడం. ఈ మార్పుతో విద్యార్థులకు ప్రిపరేషన్ కోసం అదనపు సమయం లభిస్తుందని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఇంటర్ సిలబస్‌లో కీలక మార్పులు చేయబోతున్నట్లు ప్రకటించారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత సిలబస్‌లో మార్పులు అమలుకానున్నాయి. గణితం, రసాయనశాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం వంటి ముఖ్యమైన సబ్జెక్టుల్లో కొత్త కాన్సెప్ట్స్ చేర్చబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా, ఇప్పటివరకు కేవలం సెకండ్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే ప్రాక్టికల్ పరీక్షలు ఉండగా, ఈసారి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకూ ల్యాబ్ ప్రాక్టికల్స్ నిర్వహించాలని నిర్ణయించారు.

జనవరి 21న ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష, జనవరి 23న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, జనవరి 24న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరగనున్నాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 25 నుంచి ఫస్ట్ ఇయర్ రాత పరీక్షలు, ఫిబ్రవరి 26 నుంచి సెకండ్ ఇయర్ రాత పరీక్షలు ప్రారంభమవుతాయి. ఇక ప్రాక్టికల్ పరీక్షలు జనవరి చివరి వారంలో ప్రారంభమై, ఫిబ్రవరి మొదటి వారంలో ముగియనున్నాయి.

పరీక్ష ఫీజుల చెల్లింపు ప్రక్రియ నవంబర్ 1 నుంచి నవంబర్ 11 వరకు ఆన్‌లైన్ ద్వారా కొనసాగుతుందని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. విద్యార్థులు గడువులోపు ఫీజులు చెల్లించి తమ హాల్‌టికెట్లు పొందాలని సూచించింది. ఈసారి విడుదలైన షెడ్యూల్‌ వల్ల విద్యార్థులు పోటీ పరీక్షలకు మరింత సమర్థవంతంగా సిద్ధం కావడానికి అవకాశం లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు.

Exit mobile version