NTV Telugu Site icon

Telangan High Court: బీజేపీకి ఎదురుదెబ్బ.. ఫాంహౌస్ నిందితుల విచారణకు ఆదేశం

Telangana High Court

Telangana High Court

Telangana High Court Lifted Stay On Moinabad Episode Case: మొయినాబాద్ ఫాంహౌస్ ఎపిసోడ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే! మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కి కొన్ని రోజుల ముందు.. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించగా.. ఫాంహౌస్‌లోనే వాళ్లను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ వ్యవహారంపై టీఆర్ఎస్, బీజేపీ నేతలు పరస్పర ఆరోపణలు, విమర్శలు గుప్పించుకున్నారు. ఆ సంగతి అలా ఉంచితే.. ఈ కేసులో పోలీసుల దర్యాప్తుపై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు.. ఇప్పుడు ఆ స్టేను ఎత్తివేసింది. మొయినాబాద్ పోలీసులు నిందితులపై దర్యాప్తు చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. నిందితుల పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని కూడా తీర్పునిచ్చింది. అలాగే.. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను పెండింగ్‌లో పెట్టిన హైకోర్టు, తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.

కాగా.. ఆ నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్‌లుగా గుర్తించగా విషయం విదితమే! ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముందుగానే పోలీసులకు సమాచారం అందించగా.. ఫాంహౌస్‌లో చర్చలు జరుపుతున్న సమయంలో పోలీసులు రంగంలోకి దిగి, ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు. తొలుత వీరి కస్టడీకి ఏసీబీ కోర్టు నిరాకరించడంతో.. పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. అప్పుడు నిందితుల రిమాండ్‌కి హైకోర్టు ఆదేశాలైతే జారీ చేసింది కానీ.. కేసు దర్యాప్తుపై మాత్రం స్టే విధించింది. ఇప్పుడు తాజాగా ఆ స్టేని ఎత్తివేస్తూ తీర్పునిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన వీడియోలో.. ఆ ముగ్గురు వ్యక్తులు బీజేపీకి చెందిన వారిగా అర్థమవుతోంది. పలుసార్లు ఆ వ్యక్తులు అమిత్ షాతో పాటు జేపీ నడ్డా పేర్లను కూడా ప్రస్తావించారు. తాజా కోర్టు తీర్పు.. బీజేపీ పెద్ద ఎదురుదెబ్బే అవుతుందని విశ్లేషకులు చెప్తున్నారు.