తెలంగాణకు భారీ వర్ష ముప్పు పొంచి ఉంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఈ రోజు, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో ఏకంగా 61 సెంటీమీటర్ల మేర వర్షం కురిసే అవకాశం ఉందని లెక్కకట్టింది. చాలా ప్రాంతాల్లో 35 సెంటీమీటర్లు దాటి వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా తెలంగాణపై దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. అల్పపీడన ప్రభావంతో మరింత భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఈ రోజు మంచిర్యాల, భూపాలపల్లి, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాంతంలో జులై నెలలో అత్యధికంగా 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి, చెన్నూర్, కోటపల్లి మండలాతో పాటు భూపాలపల్లి జిల్లా మహాదేవాపూర్, కాటారం, పలిమెల మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు అయింది. రాష్ట్రంలో 7 జిల్లాల్లో అత్యధిక వానలు కురిశాయి. రాష్ట్రంలో అత్యధికంగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూర్ లో 18.3 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదు అయింది. వేమనపల్లి మండలం నీల్వాయిలో 15, కోటపల్లిలో 14.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. 20 ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతం, 56 భారీ వర్షపాతం నమోదు అయింది. నిర్మల్ జిల్లా మామడ మండలం కిషన్ రావు పేట, ఖానాపురం మండలం రాజూరా గ్రామాల్లో చెరవులకు గండిపడింది. ముథోల్ మండలంలో పలు మండలాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి జిల్లాలో మహాముత్తారం, పలిమెల మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Read Also: Konaseema: అంబేద్కర్ ఫొటో వివాదం.. పోలీస్ స్టేషన్‌లోనే ఎమ్మెల్యే జగ్గిరెడ్డి నిరసన
తెలంగాణ, మహారాష్ట్రల్లో కురుస్తున్న వానలతో గోదావరి, ప్రాణహిత ఉగ్రరూపం దాల్చాయి. భద్రాచలం వద్ద 49 అడుగులకు గోదావరి నీటమట్టం చేరింది. 11,39,230 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. దీంతో భద్రాద్రి వద్ద రెండో ప్రమాదహెచ్చరిక జారీ చేసింది జిల్లా యంత్రాంగం.ఇల్లందు, కోయగూడెం ఓసీపీ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పనులకు ఆటంకం ఏర్పడింది. సింగూర్ ప్రాజెక్టుకు వరదనీరు చేరుతోంది. శ్రీరాంసాగర్ 9 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం వద్ద గోదావరి 12.9 మీటర్ల ఎత్తుకుచేరుకుని ప్రమాదకరంగా మారింది.