తెలంగాణలో రేపు రాత్రి నుంచి 11వ తేదీ రాత్రి 9 గంటల వరకు ప్రభుత్వ ఆన్‌లైన్ సేవలు, ప్రభుత్వ వెబ్‌సైట్లు నిలిచిపోనున్నాయి. 48 గంటల పాటు సేవలు నిలిపివేస్తున్నట్టు ఐటి శాఖ ప్రకటించింది.. ఏ వెబ్‌సైట్లు ఆగిపోనున్నాయో… ఆయా వెబ్ సైట్ ల హోం స్క్రీన్ మీద మెసేజ్ స్క్రోల్ కానుంది. రాష్ట్రంలోని ఆన్‌లైన్ సేవలన్నీ గచ్చిబౌలిలో ఉన్న స్టేట్ డేటా సెంటర్ కేంద్రంగానే నడుస్తాయి. అన్ని శాఖలు, విభాగాలకు చెందిన వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ సర్వీసులు… ఈ డేటా సెంటర్ తోనే అనుసంధానమై ఉంటాయి. ఈ డేటా సెంటర్లో ఉన్న యూపీఎస్ మార్చాలని ఐటి శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న యూపీఎస్‌లో సమస్యలు తలెత్తుతుండడం.. సేవలకు అంతరాయం కలుగుతుండడం తో కొత్త యూపీఎస్ సిస్టమ్ ఏర్పాటు చేయనుంది. దీంతో శుక్రవారం రాత్రి నుండి ఆదివారం రాత్రి వరకు కొన్ని ప్రభుత్వ ఆన్‌లైన్ సేవలు, వెబ్‌సైట్లు పనిచేయవు. రెండో శనివారం, ఆదివారం ప్రభుత్వ సెలవులు కావడంతో ప్రజలకు పెద్దగా ఇబ్బంది కలగకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యూపీఎస్ అప్‌డేట్ చేయడంతో పాటు… ఇతర మెయింటెనెన్స్ పనులు కూడా పూర్తి చేస్తున్నారు.