Site icon NTV Telugu

KTR: ముస్లిం శ్మశానవాటికలకు 125 ఎకరాలు.. వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌కు పత్రాలు అందజేసిన కేటీఆర్

Muslim

Muslim

KTR: ముస్లిం మైనార్టీల కోసం మోడల్ శ్మశాన వాటికల నిర్మాణానికి ప్రభుత్వం దాదాపు 125 ఎకరాలు కేటాయిస్తోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ మసిల్లాఖాన్ సీఈవో ఖాజా మొయినుద్దీన్ కు కేటాయింపు పత్రాలను అందజేశారు. ముస్లిం శ్మశాన వాటికల ఏర్పాటుకు 125 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ ఈ ఏడాది ఆగస్టు తొలివారంలో తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. శ్మశాన వాటికల నిర్మాణానికి రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో భూములు కేటాయించారు.

Read also: Fake Doctor: హైదరాబాద్‌లో బయటపడ్డ ఫేక్ డాక్టర్ బండారం.. బాధితుల్లో వీఐపీలు..!

రంగారెడ్డి జిల్లా మజీద్‌పూర్‌లో 22 ఎకరాలు, ఖానాపూర్‌లో 42.22 ఎకరాలు, కొందుర్గు మండలంలో 10 ఎకరాలు. మేడ్చల్ జిల్లా నూతనకల్ లో 35.27 ఎకరాలు, తుర్కపల్లిలో 16.31 ఎకరాలు మంజూరయ్యాయి. శ్మశాన వాటికల్లో ప్రత్యేక నడక మార్గాలు ఉండాలని, అక్కడి కార్యక్రమాలకు ఎలాంటి రుసుములు వసూలు చేయరాదని, ప్రహరీగోడలు నిర్మించాలని మంత్రి కేటీఆర్ వక్ఫ్ బోర్డుకు సూచించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్‌ ఒవైసీ, బలాల తదితరులు పాల్గొన్నారు. అయితే గతంలో ముస్లిం శ్మశాన వాటికకు భూమి కేటాయించడంపై స్థానిక రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము సాగు చేసుకుంటున్న భూములను చెప్పారు. ఈ మేరకు హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇదిలా ఉండగా ఇటీవల ఆ భూములను వక్ఫ్ బోర్డుకు అప్పగించారు.
Fake Doctor: హైదరాబాద్‌లో బయటపడ్డ ఫేక్ డాక్టర్ బండారం.. బాధితుల్లో వీఐపీలు..!

Exit mobile version