తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను తెలంగాణ గౌడ సంఘాల సమన్వయ కమిటీ ఛైర్మన్ బాలగౌని బాలరాజు గౌడ్ ఆధ్వర్యంలో పలువురు గౌడ సంఘాల నాయకులు కలిశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371 జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వనించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కు వినతి పత్రం అందజేశారు.
రాష్ట్రంలో తక్షణమే కల్లుగీత కార్పొరేషన్ పాలకవర్గాన్ని ప్రకటించడంతోపాటు 5 వేల కోట్ల రూపాయల నిధిని కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని గౌడ సంఘాల నేతలు ఆ వినతి పత్రంలో కోరారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, ఎక్స్ గ్రేషియాకు అడ్డుగా ఉన్న మెడికల్ బోర్డును తీసివేసి కల్లుగీత కార్మికులు మరణిస్తే రూ.10 లక్షలు పరిహారం ఇచ్చేలా ప్రభుత్వానికి లేఖ రాయాలని కోరారు. ఏజెన్సీ ఏరియాలో కల్లుగీతను పునరుద్దరించాలని, తక్షణమే గౌడ ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించాలని, కల్లుగీత సొసైటీలకు రాష్ట్రంలోని 50 శాతం వైన్ షాపులను కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు.
సానుకూలంగా స్పందించిన శ్రీ బండి సంజయ్ కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం బీజేపీ కార్యాచరణ రూపొందిస్తోందన్నారు. గౌడసహా వివిధ కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజల్లో ఎండగట్టడంతోపాటు ఆయా భవనాలు నిర్మించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు.