డిసెంబర్ 7 నుంచి నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని, ఫార్చ్యూన్ కంపెనీల పెట్టుబడులను ఆహ్వానించే దిశగా ముందుకు వెళ్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ఈ సమీక్షలో మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, సీఎం సలహాదారు శివధర్ రెడ్డి, స్పెషల్ సీఎస్‌లు జయేష్ రంజన్, నవీన్ మిట్టల్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రతినిధులకు సదుపాయాలు.. లైజనింగ్ వ్యవస్థ
సమ్మిట్‌కు పెద్ద సంఖ్యలో ప్రతినిధులు వస్తారని, వారి కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ప్రతినిధులకు ఎంట్రీ కల్పించాలని, డ్యూటీలో ఉండే అధికారులు ప్రతినిధులతో చాలా మర్యాదగా నడుచుకునేలా ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు. ప్రతినిధుల కోసం ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయడంతో పాటు మంచి ఇంటర్నెట్ నెట్వర్క్ సదుపాయం కల్పించాలన్నారు. అలాగే ప్రతినిధుల కోసం లైజనింగ్ ఆఫీసర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పారు.
సమ్మక్క సారలమ్మ తోరణాలు.. విద్యార్థులకు ఎయిర్ షో
సమ్మక్క సారలమ్మ ఆలయంలో ఉండే తోరణాల నమూనాలను సమ్మిట్‌లో ఉపయోగించాలని సీఎం సూచించారు. గ్లోబల్ సమ్మిట్‌లో జరిగే ఎయిర్ షోతో పాటు ఇతర కార్యక్రమాలను చూసేందుకు ప్రభుత్వ స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని అన్నారు. దేశ, విదేశాల్లో పేరున్న యూనివర్సిటీలు సమ్మిట్‌లోని ఎడ్యుకేషన్ పెవిలియన్‌లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆహ్వానాల బాధ్యత మంత్రులకు.. అధికారులకు వార్నింగ్
ప్రతినిధులకు ఆహ్వానాలు పంపే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమైన ప్రతినిధులకు ఆహ్వానాలు పంపే బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులకు అప్పగించాలని తెలిపారు. సమ్మిట్ ఏర్పాట్లలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే మాత్రం అస్సలు సహించేది లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు.

