పసిఫిక్ మహాసముద్రంలో సముద్రజలాలు అసాధారణంగా వేడెక్కడం వల్ల ఏర్పడే ఎల్‌నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తుందని, తెలంగాణలోనూ వర్షపాతం లోటు, జలాశయాల్లోకి తగ్గిన నీటి ప్రవాహం, వ్యవసాయంపై ఒత్తిడి, విద్యుత్ డిమాండ్ పెరుగుదల వంటి పరిణామాలు కనిపించాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అయితే సమస్య తీవ్రతను ముందుగానే అంచనా వేసి ప్రభుత్వం ఏప్రిల్ నుంచే వివిధ శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టిందని ఆయన అసెంబ్లీలో వివరించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా, ఆలస్యంగా, అసమానంగా కురిసే అవకాశం ఉంటుందని, భారత నైరుతి రుతుపవనాలపైనా దీని ప్రభావం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 2026 నైరుతి రుతుపవనాలు జూన్ 8న తెలంగాణలోకి ప్రవేశించినప్పటికీ, జూన్ 23 నాటికి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయని తెలిపారు.
ఆగస్టులో 38 శాతం వర్షపాతం లోటు
2026లో జూన్‌లో 12 శాతం, జూలైలో ఒక శాతం, ఆగస్టులో ఏకంగా 38 శాతం వర్షపాతం లోటు నమోదైందని భట్టి విక్రమార్క తెలిపారు. సాధారణంగా సెప్టెంబర్ 18 నాటికి 640 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా, ఈ ఏడాది 543 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైందని వివరించారు. సగటు వర్షపాతం గణాంకాలు సమస్య తీవ్రతను పూర్తిగా ప్రతిబింబించవని ఆయన అన్నారు. పంటలకు అవసరమైన సమయంలో, తగిన విరామాలతో వర్షాలు కురవడం కీలకమని, ఒకటి రెండు రోజులు భారీ వర్షాలు కురిసినంత మాత్రాన అంతకుముందు ఏర్పడిన దీర్ఘకాలిక పొడి పరిస్థితుల ప్రభావం పూర్తిగా తొలగిపోదని చెప్పారు.
వ్యవసాయంపై ప్రభావం
ఈ ఏడాది వానాకాలం సాగు విస్తీర్ణం 123.74 లక్షల ఎకరాలకు చేరిందని, గత ఏడాది ఇది 139.29 లక్షల ఎకరాలుగా ఉందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. వరి సాగు విస్తీర్ణం కూడా సుమారు 18 శాతం తగ్గిందని పేర్కొన్నారు. వర్షపాతం లోటుతో విత్తనాలు వేయడంలో ఆలస్యం, మొలకలు మరియు పంట ఎదుగుదలపై ప్రభావం, వర్షాధార పంటల దిగుబడులు తగ్గే ప్రమాదం, పశువులకు మేత కొరత, భూగర్భ జలాలు–జలాశయాలపై ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. పత్తి, మొక్కజొన్న, జొన్న, పప్పుధాన్యాలు, సోయాబీన్, నూనెగింజలు వంటి వర్షాధార పంటలకు కీలక దశలో తేమ అందకపోతే రైతుల ఆదాయంపై ప్రభావం పడుతుందని చెప్పారు. అధిక నీరు అవసరమయ్యే పంటలపై మాత్రమే ఆధారపడకుండా, పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల మంత్రులు సూచించారని తెలిపారు.
ఏప్రిల్ నుంచే ముందస్తు ప్రణాళిక
సమస్య ఏర్పడిన తర్వాత ప్రభుత్వం స్పందించలేదని, ఏప్రిల్ నుంచే ముందస్తు ప్రణాళిక ప్రారంభించామని తెలిపారు. భారత వాతావరణ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖలతో సమీక్షలు నిర్వహించి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలను సిద్ధం చేసినట్లు చెప్పారు. ‘రైతు ముంగిట శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని 1,600 గ్రామాల్లో నిర్వహించి రెండు లక్షలకు పైగా రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, పంటల వైవిధ్యీకరణ, తక్కువ నీటితో సాగు చేసే విధానాలపై అవగాహన కల్పించామని వివరించారు. 32 జిల్లాలకు ప్రత్యేక ఎల్‌నినో వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించామని, ఎల్‌నినో, పంటల నిర్వహణ, పంటల వైవిధ్యీకరణపై రూపొందించిన ఆరు వీడియోల ద్వారా సుమారు 31.92 లక్షల మంది రైతులు, ప్రజలకు సమాచారం అందించామని తెలిపారు. ప్రభుత్వ శాఖలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ICRISAT, ICAR-CRIDA, ICAR-IIMR, IMD నిపుణులతో 27 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి అధికారులను, రైతులను అప్రమత్తం చేశామని చెప్పారు.
రాబోయే 12 నెలలకు నీటి భద్రత
ఎల్‌నినో పరిస్థితులు రాబోయే ఏడాది వరకు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని భట్టి తెలిపారు. రాబోయే 11–12 నెలలకు అవసరమైన తాగునీటిని ముందుగానే కేటాయించుకుని, పంటల నీటి అవసరాలను తీర్చుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణా బేసిన్‌లోని మేజర్, మీడియం ప్రాజెక్టుల మొత్తం 553 టీఎంసీల సామర్థ్యానికి ప్రస్తుతం 311 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, గోదావరి బేసిన్‌లో 255 టీఎంసీలకు గాను 154 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 808 టీఎంసీల సామర్థ్యానికి 465 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందన్నారు.
రిజర్వాయర్లు, చెరువుల నింపడానికి చర్యలు ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రిజర్వాయర్లు, చెరువులను నింపేందుకు పలు ఎత్తిపోతల పథకాల ద్వారా చర్యలు చేపట్టామని తెలిపారు. మహాత్మా గాంధీ కల్వకుర్తి, జవహార్ నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, రాజీవ్ భీమా ఎత్తిపోతల, జె. చొక్కారావు దేవాదుల, అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. ప్రతి జిల్లాలో కలెక్టర్ కార్యాలయాల్లో జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశాలు నిర్వహించి, ఇరిగేషన్, వ్యవసాయ అధికారులు, రైతు ప్రతినిధులతో చర్చించామని తెలిపారు. ఆయకట్టుకు అవసరమైన దానికంటే నీరు ఎక్కువగా ఉన్న ప్రాజెక్టుల కింద మాత్రమే పంటలకు నీరు ఇవ్వాలని, రైతులు మెట్ట పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించినట్లు చెప్పారు. నీటిని అవసరానికి అనుగుణంగా ‘ఆన్ అండ్ ఆఫ్’ విధానంలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
‘తెలంగాణ జలసిరి’తో ప్రతి చుక్కను ఒడిసిపట్టాలి వర్షపాతం లోటును ఎదుర్కోవడం అంటే కేవలం తక్షణ ఉపశమన చర్యలు చేపట్టడం కాదని, పడే ప్రతి వర్షపు చుక్కను భూమిలో నిల్వ చేయడం కూడా ముఖ్యమని అన్నారు. నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, గ్రామీణ ఉపాధిని అనుసంధానిస్తూ ‘తెలంగాణ జలసిరి’ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఇందులో భాగంగా 24 లక్షల ఇంకుడు గుంతలు, 50 వేల వ్యవసాయ కుంటలు, 12 వేల పర్కొలేషన్ ట్యాంకులు, 12 వేల బోరు బావుల రీచార్జ్ నిర్మాణాలను చేపట్టాలని ప్రతిపాదించినట్లు చెప్పారు.
తాగునీటికి తొలి ప్రాధాన్యంతాగునీటికి ఆధారమైన 34 జలాశయాల్లో నీటిమట్టాలను ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. సింగూరు జలాశయంపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో సింగూరుపై ఆధారపడిన 2,395 గ్రామీణ ఆవాసాలు, 19 పట్టణ స్థానిక సంస్థలకు అక్కడి నుంచి తాగునీరు సరఫరా అవుతోందని తెలిపారు. సింగూరులో తాగునీటి అవసరాలకు 12 టీఎంసీలు అవసరం కాగా, ప్రస్తుతం సుమారు 4.35 టీఎంసీల నీరు మాత్రమే ఉం దని, నీటి లభ్యత తగ్గితే ప్రత్యామ్నాయ వనరుల నుంచి నీటిని సమకూర్చే ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు SRSP, మెదక్ జిల్లాకు మల్లన్నసాగర్, సంగారెడ్డి జిల్లాకు శ్రీశైలం ఆధారిత నీటి శుద్ధి ప్లాంట్లను వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించామని వివరించారు. హైదరాబాద్‌తో పాటు సుమారు 2,053 చదరపు కిలోమీటర్ల పరిసర ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసే సింగూరు–మంజీరా వనరుల్లో నీటి లభ్యతను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. అవసరమైతే మిషన్ భగీరథ నుంచి సుమారు 40 ఎంజీడీల నీటిని సమీకరించడంతో పాటు, మరో 20 ఎంజీడీలను గోదావరి, కృష్ణా వనరుల ద్వారా సమకూర్చుకునేలా ప్రత్యామ్నాయ కార్యాచరణ రూపొందించామని చెప్పారు. సుమారు మూడు లక్షల కనెక్షన్లకు ఇతర వనరుల ద్వారా నీటిని సరఫరా చేసే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
వర్షాభావం.. పెరిగిన విద్యుత్ డిమాండ్
వర్షాలు తగ్గితే దాని ప్రభావం వ్యవసాయంతోనే ఆగిపోదని, విద్యుత్ వ్యవస్థపైనా నేరుగా పడుతుందని భట్టి విక్రమార్క వివరించారు. వర్షాలు సకాలంలో పడకపోవడంతో రైతులు బోరుబావులపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుందని, భూగర్భ జలమట్టం తగ్గినప్పుడు మరింత లోతు నుంచి ఎక్కువ సమయం నీటిని పంపింగ్ చేయాల్సి వస్తుందని చెప్పారు. దీంతో పాటు ప్రధాన ఎత్తిపోతల పథకాల విద్యుత్ అవసరం కూడా భారీగా పెరిగిందన్నారు. TGTRANSCO 15 నిమిషాల వారీ గణాంకాల ప్రకారం ఆగస్టు మొదటి భాగంలో ప్రధాన ఎత్తిపోతల పథకాల సంయుక్త లోడ్ పలుమార్లు 1,100–1,500 మెగావాట్ల మధ్య నమోదైందని, కొన్ని సమయాల్లో దాదాపు 1,600 మెగావాట్లకు చేరిందని తెలిపారు. గత ఏడాది ఇదే సమయంలో ఇది సాధారణంగా 250–450 మెగావాట్ల మధ్య ఉండేదని చెప్పారు. వర్షాలు తగ్గడంతో జలాశయాల్లోకి నీటి ప్రవాహం తగ్గి జలవిద్యుత్ ఉత్పత్తి కూడా భారీగా పడిపోయిందన్నారు. గత ఏడాది ఇదే సమయంలో 1,940 మెగావాట్లతో పోలిస్తే ఈ ఏడాది 422 మెగావాట్లకు హైడల్ ఉత్పత్తి పరిమితమైందని తెలిపారు.
తెలంగాణ చరిత్రలో అత్యధిక విద్యుత్ డిమాండ్
ఈ పరిస్థితుల మధ్య సెప్టెంబర్ 9న ఉదయం 10.41 గంటలకు తెలంగాణలో 19,543 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైందని భట్టి విక్రమార్క తెలిపారు. 2025 సెప్టెంబర్ 9న గరిష్ట డిమాండ్ 15,585 మెగావాట్లు కాగా, ఈ ఏడాది దాదాపు 4,000 మెగావాట్ల అదనపు భారం ఏర్పడిందన్నారు. సాధారణంగా వర్షాకాలంలో ఉష్ణోగ్రతలు తగ్గి వ్యవసాయ పంపుసెట్ల వినియోగం కూడా తగ్గాల్సి ఉన్నప్పటికీ, ఈ ఏడాది వర్షపాతం లోటు కారణంగా ఖరీఫ్ సీజన్‌లోనే విద్యుత్ డిమాండ్ వేసవి స్థాయిని మించిందని చెప్పారు. అయినప్పటికీ ఇప్పటి వరకు రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చగలిగామని తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు సౌర విద్యుత్ అందుబాటులో లేని సమయంలో థర్మల్ విద్యుత్, కేంద్ర విద్యుత్ వాటాలు, మార్కెట్ కొనుగోళ్లు, ఇతర వనరుల ద్వారా విద్యుత్‌ను సమకూర్చడం సవాలుగా మారిందని వివరించారు.
దేశవ్యాప్తంగా విద్యుత్‌పై ఒత్తిడి
విద్యుత్ డిమాండ్ పెరుగుదల తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదని భట్టి తెలిపారు. 2026 ఆగస్టులో దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం 169.01 బిలియన్ యూనిట్లకు చేరిందని, గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఇది 12.85 శాతం అధికమని చెప్పారు. డే-అహెడ్ మార్కెట్‌లో విద్యుత్ కొనుగోలు అభ్యర్థనలు 61.7 శాతం పెరిగాయని, సగటు విద్యుత్ ధర కూడా 22 శాతం పెరిగిందని తెలిపారు. గత ఏడాది ఆగస్టులో దేశ గరిష్ట విద్యుత్ డిమాండ్ 2,29,720 మెగావాట్లు కాగా, ఈ ఏడాది ఆగస్టులో 2,58,270 మెగావాట్లకు చేరిందని చెప్పారు. ఇలాంటి జాతీయ స్థాయి ఒత్తిడి మధ్య తెలంగాణ తన రికార్డు విద్యుత్ డిమాండ్‌ను తీర్చగలిగిందని తెలిపారు.
విద్యుత్ రంగంలో ముందస్తు చర్యలు
శ్రీశైలం, నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రాల్లో అవసరమైన మరమ్మతులు పూర్తి చేసి ఉత్పత్తిని పునరుద్ధరించినప్పటికీ నీటి లభ్యత తగ్గడంతో హైడల్ ఉత్పత్తి పరిమితమైందని చెప్పారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల పూర్తి స్థాయి లభ్యత కోసం నిరంతర పర్యవేక్షణ చేపట్టామని, సింగరేణి బొగ్గు ఉత్పత్తిని పెంచుతూ ఉత్పత్తిలో 90 శాతాన్ని రాష్ట్ర విద్యుత్ అవసరాలకు కేటాయించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. నైని బొగ్గు బ్లాక్ నుంచి తొలి బొగ్గు రేక్ 2026 ఆగస్టులో TGGENCOకు చేరిందని వెల్లడించారు. అవసరమైన విద్యుత్‌ను మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తూ రైతులు, గృహ వినియోగదారులకు ప్రాధాన్యం ఇస్తూనే పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు నమ్మకమైన సరఫరా కొనసాగించామని చెప్పారు. భవిష్యత్తులో వాతావరణ ఆధారిత విద్యుత్ డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, దీర్ఘకాలిక పునరుత్పాదక విద్యుత్ ఒప్పందాలు, ప్రత్యేక పీక్ పవర్ సామర్థ్యం, మరింత ఖచ్చితమైన విద్యుత్ డిమాండ్ అంచనా వంటి చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
గ్రామీణ ఉపాధికి ప్రాధాన్యం వర్షాభావ పరిస్థితుల్లో గ్రామీణ జీవనోపాధులను కాపాడేందుకు ఉపాధి హామీ పనులకు ప్రాధాన్యం ఇస్తున్నామని భట్టి తెలిపారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు రోజుకు సగటున 12 లక్షల మంది ఉపాధి పనులకు హాజరయ్యారని, జూలై నుంచి వ్యవసాయేతర పనికాలంలోనూ రోజుకు సుమారు రెండు లక్షల మంది ఉపాధి కోరుతున్నారని చెప్పారు.
2026–27లో ఇప్పటివరకు 7.3 కోట్ల పని దినాలను సృష్టించి, 21 లక్షల కుటుంబాలకు చెందిన 31.5 లక్షల మందికి ఉపాధి కల్పించామని తెలిపారు. వేతనాల రూపంలో ₹2,100.53 కోట్లను నేరుగా కూలీలకు చెల్లించామని వెల్లడించారు. నీటి సంరక్షణ, పశుగ్రాస అభివృద్ధి, ఉద్యానవనాలు, కిచెన్ గార్డెన్లు, నేలలో తేమను నిలిపే పనులకు ఉపాధి కార్యక్రమాల్లో ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. కరువు పరిస్థితులు ఉన్న సంవత్సరాల్లో ఉపాధి హామీ పథకానికి కేంద్రం మరింతగా నిధులు భరించాల్సిన అవసరం ఉందన్నారు.
వేడిగాలులు.. ఆరోగ్యంపై అప్రమత్తత
ఎల్‌నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగితే పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, వ్యవసాయ, బహిరంగ కార్మికులపై ఆరోగ్య ప్రభావం పడే అవకాశం ఉందని భట్టి చెప్పారు. వేడిగాలుల హెచ్చరికలు, తాగునీటి ఏర్పాట్లు, అవసరమైన చోట కూలింగ్ కేంద్రాలు, ఆరోగ్య శాఖ సంసిద్ధత, అంగన్‌వాడీలు, పోషకాహార కార్యక్రమాల నిరంతర నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. అటవీకరణలో మొక్కలు నాటడమే కాకుండా అవి బతికి చెట్లుగా ఎదిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2026–27లో 6.18 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 5.91 కోట్ల మొక్కల లక్ష్యాన్ని సాధించామని తెలిపారు. ఇందులో 3.16 కోట్ల మొక్కలను నాటగా, 2.75 కోట్ల మొక్కలను గృహాలకు పంపిణీ చేశామని వివరించారు.
ఎల్‌నినోపై జులైలోనే నిపుణుల సమావేశం తెలంగాణ ప్రణాళికాశాఖ ఆధ్వర్యంలో జులై 21న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో మేధావులు, శాస్త్రవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సమావేశం నిర్వహించి ఎల్‌నినో ప్రభావంపై సమగ్రంగా చర్చించామని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరులను రాబోయే 12 నెలల పాటు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచించారని చెప్పారు. తాగునీటికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, పశుసంపద, పంటలు, పరిశ్రమల అవసరాలకు కూడా అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించాలని సూచించారు.
శాఖల సమన్వయంతోనే సవాల్‌కు పరిష్కారం
ఎల్‌నినో ప్రభావాన్ని ఒక్క శాఖ మాత్రమే ఎదుర్కోలేదని, వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, పశుసంవర్ధక, ఆరోగ్యం, విద్యుత్, విపత్తు నిర్వహణ శాఖలు సమన్వయంతో పనిచేయాల్సి ఉందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. “నష్టం జరిగిన తర్వాత పరిహారం చెల్లించడం మాత్రమే ప్రభుత్వ విధానం కాదు. నష్టం జరగకముందే ప్రమాదాన్ని గుర్తించడం, రైతుకు ముందుగానే సమాచారం ఇవ్వడం, ప్రత్యామ్నాయ పంటను సూచించడం, నీటిని సంరక్షించడం, ఉపాధి కల్పించడం, తాగునీటిని రక్షించడం, సాధ్యమైనంత మేరకు విద్యుత్‌ను సమీకరించడం మా విధానం” అని తెలిపారు. ఎల్‌నినోను ప్రస్తావించడం సాకు కాదని, ఈ ఏడాది వర్షపాతం, వ్యవసాయం, నీరు, విద్యుత్‌పై ఏర్పడిన అసాధారణ ఒత్తిడికి శాస్త్రీయమైన వివరణ అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రకృతి మన నియంత్రణలో లేకపోయినా ప్రజలను రక్షించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవడం మన చేతుల్లోనే ఉందన్నారు. అసాధారణ వర్షపాతం లోటు, దేశవ్యాప్తంగా పెరిగిన విద్యుత్ డిమాండ్, మార్కెట్‌లో పోటీ ఉన్నప్పటికీ తెలంగాణలో 19,543 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్‌ను తీర్చగలిగామని తెలిపారు. “ఆ 19,543 మెగావాట్లు కేవలం ఒక రికార్డు సంఖ్య కాదు. క్లిష్ట పరిస్థితుల్లోనూ రైతుకు, గృహానికి, పరిశ్రమకు, ప్రజలకు విద్యుత్ సరఫరా కొనసాగించాలన్న ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం” అని ఉప ముఖ్యమంత్రి అన్నారు.

