NTV Telugu Site icon

Water Disputes: ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరం.. కేఆర్ఎంబీకి లేఖ

Krmb

Krmb

తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి జల జగడం నెలకొన్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారి ఈఎన్‌సీ మురళీధర్ రెండు లేఖలు రాశారు. ప్రకాశం బ్యారేజీ దిగువన రెండు ఆనకట్టల నిర్మాణ ప్రతిపాదనపై లేఖలో అభ్యంతరం తెలిపారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్టులు చేపట్టరాదని ఈ లేఖలో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. రెండు కొత్త బ్యారేజీల పనులు చేపట్టకుండా ఏపీని నిరోధించాలని కోరింది.

Read Also: Driverless Car: ఐఐటీ హైదరాబాద్ మరో ఆవిష్కరణ.. ఇండియాలోనే తొలి డ్రైవర్ లెస్ కారు టెస్ట్ రన్

అటు కృష్ణా జలాలపై ఆధారపడి పంప్డ్‌ స్టోరేజ్ స్కీమ్‌ల ప్రతిపాదనపై ఈఎన్‌సీ మురళీధర్ మరో లేఖ రాశారు. జలవిధానం మేరకు తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేఆర్ఎంబీని తెలంగాణ ప్రభుత్వం కోరింది. తాగునీటి అవసరాలు కాదని ఇతరత్రాలకు తరలింపు సరికాదని తెలంగాణ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేసింది. పంప్డ్‌ స్టోరేజ్ స్కీమ్‌, విద్యుదుత్పత్తికి నీటి తరలింపు సరికాదని పేర్కొంది. అనుమతి లేని పంప్డ్‌ స్టోరేజ్ స్కీమ్‌లను పరిశీలించాలని కేఆర్ఎంబీని తెలంగాణ ప్రభుత్వం కోరింది. సీడబ్ల్యూసీ, బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేనివి పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది.